– బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
విశాఖపట్నం: స్థానిక రాక్ డైల్ హోటల్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్స్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ దేశంలో సరళికృతమైన పన్ను విధానాల్ని అమలు చేస్తూ ఒకే దేశం ఒకే పన్ను అనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు.
ఇప్పటివరకు ఉన్న జీఎస్టీ స్లాబులను నాలుగు స్లాబ్ నుంచి రెండు స్లాబులకు తగ్గించారని, దానివల్ల దేశంలో ఉన్న అన్ని రంగాల వారికి, అన్ని వర్గాల వారికి కలుపుకుంటూ 140 కోట్ల మందికి ఈ కొత్త జీఎస్టీ విధానంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఈ నెల 22వ తారీకు నుంచి కొత్త పన్ను విధానాలు అమల్లోకి రాబోతున్నాయని దేశ ప్రజలందరి తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కి ధన్యవాదాలు తెలిపారు.
ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం వైపు వెళుతున్న సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, తీసుకొస్తున్న సంస్కరణల వల్ల ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉందని చెప్పటానికి గర్వపడుతున్నానని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశంలోని సైనిక, ఆర్థిక, మౌళిక, విమానయాన, రైల్వే, వ్యవసాయ, పారిశ్రామిక, ఔషధ తయారీ రంగాలలో అత్యున్నతమైన ప్రతిభను చూపుతూ ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి తీసుకువెళ్లారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీఎస్టీ సంస్కరణల వల్ల ఏఏ ఉత్పత్తులపై ఎంత శాతం ధరలు తగ్గనున్నాయో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.