అమరావతి:రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పధకాలపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, హోం, నైపుణ్య అభివృద్ధి, సాంఘిక, బిసి, గిరిజన మహిళా శిశు సంక్షేమం విభిన్న ప్రతిభా వంతుల శాఖలతో పాటు, గృహ నిర్మాణ, వ్యవసాయ, వైద్య ఆరోగ్య, మత్స్య శాఖలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పధకాల అమలు తీరును,ఆయా పధకాల ప్రగతిని సిఎస్ సమీక్షించారు.
ముందుగా పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన వివిధ కేంద్ర ప్రాయోజిక పధకాలపై సిఎస్ సమీక్షించగా ఆశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ పిఆర్ అండ్ ఆర్డి శాఖలో మొత్తం 22 కేంద్ర ప్రాయోజిత పధకాలను అమలు చేయడం జరుగుతోందని వివరించారు.2023-24లో వివిధ కేంద్ర ప్రాయోజిత పధకాల కింద 13వేల 366 కోట్ల రూ.లను,2024-2025లో ఇప్పటి వరకూ 7వేల 899 కోట్ల రూ.లను ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు.2024-2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాయోజిత పధకాల అమలుకు కేంద్ర ప్రభుత్వ వాటాగా 8వేల 340 కోట్ల రూ.లను విడుదల చేసిందని చెప్పారు.పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో వివిధ కేంద్ర ప్రాయోజిత పధకాలు విజయవంతంగా అమలు జరుగుతున్నట్టు శశిభూషణ్ కుమార్ సిఎస్ కు వివరించారు.
అనంతరం నైపుణ్య శిక్షణ విభాగానికి సంబంధించిన కార్యక్రమాలపై సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షిస్తూ 2023-24, 2024-25లో ఇప్పటి వరకూ నిర్వహించిన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందుకు కేంద్ర ప్రభుత్వం వాటా,అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కేటాయించిన నిధులు,ఖర్చు చేసిన నిధులపై చర్చించారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నవివిధ శిక్షణా కార్యక్రమాల్లో కవర్ చేయని కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటిని కూడా రాష్ట్రంలో అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా నైపుణ్య శిక్షణ విభాగం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఔట్ కమ్ బేస్డ్ మెరుగైన శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు.ఇప్పటి వరకూ నిర్వహించిన శిక్షణా కార్యక్రమాలకు సంబంధించి సవివరమైన నివేదికను సమర్పించాలని సిఎస్ ఆదేశించారు.
తదుపరి హోం శాఖకు సంబంధించిన కేంద్ర ప్రాయోజిత పధకాలను సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించగా హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్ హోం శాఖకు సంబంధించి పోలీస్ బలగాల ఆధునీకరణ వంటి 3 కేంద్ర ప్రాయోజిత పధకాలు అమలు జరుగుతున్నాయని తెలిపారు.రాష్ట్రంలోని అన్ని సిసి కెమెరాలను రాష్ట్ర సచివాలయంలోనే రియల్ టైమ్ గవర్నెస్ వ్యవస్థతో అనుసంధానించాలని సిఎస్ చెప్పారు.
అనంతరం సాంఘిక,బిసి,గిరిజన మహిళా,విభిన్నప్రతిభా వంతుల శాఖలతో పాటు,గృహ నిర్మాణం,వ్యవసాయ,వైద్య ఆరోగ్య,మత్స్య శాఖలకు సంబంధించిన కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల అమలు ప్రగతిని ఆయా శాఖల అధికారులతో సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు.
ఈసమావేశంలో ఆర్ధికశాఖ కార్యదర్శి జానకి,పోలీస్ శాఖ ఐజి పిహెచ్డి రామకృష్ణ,ఇంకా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.