– కొత్త చట్టం తీసుకువచ్చేందుకు సన్నాహాలు
– వచ్చే శాసన సభలో చట్ట సవరణ బిల్లు
– రాష్ట్ర శాసనసభ పిటిషన్ల కమిటీ చైర్మన్, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు
అమరావతి: సైబర్ క్రైమ్స్ పై ఉక్కుపాదం మోపే విధంగా ప్రస్తుతం ఉన్న చట్టానికి మరింత పదును పెట్టే నిమిత్తం వచ్చే శాసన సభా సమావేశాల్లో చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ అభిప్రాయ పడుతున్నట్టు ఆ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె.రఘు రామకృష్ణ రాజు వెల్లడించారు. పటిష్ఠమైన చట్ట రూపకల్పనకు హోం, ఐటి శాఖ కార్యదర్శలతో శుక్రవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ సమావేశంలో సమగ్రంగా చర్చించినట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర శాసన సభ భవనంలోని తమ ఛాంబరులో జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే పి.విష్ణు కుమార్ రాజు, చిత్తూరు శాసన సభ్యుడు గురజాల జగన్మోహన్ తో కలిసి ఆయన పాత్రికేయులతో రఘురామ కృష్ణ రాజు మాట్లాడారు
రాష్ట్రంలో జరుగుతున్న సైబర్ క్రైమ్స్ నియంత్రణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ కూడా ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ వల్ల రాష్ట్రంలోని ఎంతో మంది అమాయకులు మోసపోతున్నారని, వీటికి సంబంధించి కేవలం నాలుగు శాతం కేసులు మాత్రమే రిజిస్టరు అయ్యాయని, మొత్తం రూ.960 కోట్లు మేర మోసం జరిగిందని, ఇందులో రూ.300 కోట్ల వరకూ రికవరీ అయినట్టు గత ఏడాది నివేదికలు వెల్లడిచేస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఈ లెక్కన ఏడాది దాదాపు రూ.30 వేల కోట్ల వరకూ సైబర్ క్రైమ్ మోసాలు జరుగుతున్నాయన్నారు. మోస పూరిత యాప్స్ ను రూపొందించే వారిపై, సిస్టమ్స్ లో వాటిని లోడ్ చేసేవారిపై కేసులు పెట్టే అవకాశం ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం లేదని, అయితే ఆ చట్టానికి సవరణ చేయడం ద్వారా గ్రాస్ రూట్ లెవివ్ లో క్రైమ్ సిండికేట్ మొత్తాన్ని నియంత్రించే విధంగా నూతన చట్టాన్ని తీసుకురానున్నామన్నారు. ఇందుకు సంబంధించి సమగ్రమైన నివేదికను తమ కమిటీ త్వరలో శాసన సభ స్పీకర్ కు నివేదిదించనున్నట్టు ఆయన తెలిపారు.
డిజిటల్ అరెస్టు చేసినట్టు మోసపూరితమైన కాల్స్, సందేశాలు రావడం వల్ల ఎంతో మంది అమాయకులు భయబ్రాంతులకు గురై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న సంఘటనలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయన్నారు. అసలు డిజిటల్ అరెస్టు అనే విధానమే లేదని, ఇటువంటి మోసపూరితమైన కాల్స్, సందేశాలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సినీ ప్రముఖులతో పలు మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయించే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నామని, ఏడాది కాలంలో ఈ సైబర్ క్రైమ్స్ ను పూర్తి గా అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలనేది తమ కమిటీ ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ సభ్యుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యంగా నాలుగు రకాలైన సైబర్ క్రైమ్స్ ద్వారా ప్రజలను మోసగిస్తున్నారన్నారు. తక్కువ వడ్డీ రుణాల యాప్స్, బెట్టింగ్ యాప్స్, కాల్ సెంటర్ల ద్వారా పోర్ను వీడియోలు, లింకులు పంపించడం, బ్యాంక్ ఓటిపి లను అడగం ద్వారా సైబర్ మోసాలు జరుగుతున్నాయన్నారు. ఈ నేరాలను నియంత్రించేందుకు ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోందని తెలిపారు.
కమిటీ సమావేశంలో శాసన సభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, డిప్యుటీ సెక్రటరీ కె.రాజకుమార్, కమిటీ సభ్యుడు, శాసన సభ్యుడు కొణతాల రామకృష్ణ, పల్లా శ్రీనివాసరావు, పి.విష్ణు కుమార్ రాజు, గురజాల జగన్మోహన్, హోం శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్, తదితరులు పాల్గొన్నారు