Suryaa.co.in

Andhra Pradesh

మీడియా ముసుగులో దందా.. న‌లుగురు అరెస్ట్‌

మీడియా ముసుగులో దందాల‌కు పాల్ప‌డుతున్న న‌లుగురిని తిరుప‌తి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ప్రైమ్‌9 న్యూస్ చాన‌ల్‌కు చెందిన రిపోర్ట‌ర్లు సూర్యనారాయణ రాజు, సునీల్, కెమెరామెన్లు రామకృష్ణ‌, బాలు ఉన్నారు. పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి.

రెండు నెల‌ల క్రితం తిరుమ‌ల ప‌ర‌కామ‌ణిలో దొంగ‌త‌నం కేసులో ర‌వికుమార్ స్వామి అనే వ్య‌క్తి అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో స‌ద‌రు స్వామికి ప్రైమ్9 న్యూస్ రిపోర్టర్లు, కెమెరామెన్లు ఫోన్ చేసి ..మీ గురించి త‌మ చాన‌ల్‌తో పాటు మిగిలిన చాన‌ళ్ల‌లో క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తామ‌ని, కుటుంబ ప‌రువు పోతుంద‌ని, అలా జ‌ర‌గ‌కుండా వుండాలంటే రూ.50 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని బ్లాక్‌ మెయిల్‌కు దిగారు.

చేసిన త‌ప్పున‌కు శిక్ష అనుభ‌విస్తున్నామ‌ని, మ‌ళ్లీ పెద్ద‌మొత్తంలో డ‌బ్బు ఎక్క‌డి నుంచి తేవాల‌ని స్వామి , ఆయ‌న కుటుంబ స‌భ్యులు త‌మ గోడు వెళ్ల‌బోసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ రిపోర్ట‌ర్లు, కెమెరామెన్లు వినిపించుకోలేదు.

స్వామి కుటుంబ స‌భ్యులు వీరి ఫోన్‌కాల్స్‌ను రిసీవ్ చేసుకోక‌పోవ‌డంతో, వారి స్నేహితుడు బాల‌కృష్ణారెడ్డికి ఫోన్ చేసి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. స్వామికి సంబంధించిన వీడియోల‌ను చూపుతూ, ప్ర‌సారం చేస్తే కుటుంబ ప‌రువు బ‌జారున ప‌డుతుంద‌ని డ‌బ్బు కోసం బెదిరింపుల‌కు దిగారు.

త‌మ‌కు ఆత్మ‌హ‌త్య త‌ప్ప‌, మ‌రో గ‌త్యంత‌రం లేద‌ని నెత్తీనోరూ కొట్టుకుని వేడుకున్నా ప్రైమ్‌9 రిపోర్ట‌ర్లు, కెమెరామెన్ల మ‌న‌సు క‌ర‌గ‌లేదు. రూ.50 ల‌క్ష‌ల్లో త‌మ సీఈవో, ఇత‌ర చాన‌ళ్ల రిపోర్ట‌ర్ల‌కు ఇవ్వాల్సి వుంటుంద‌ని చెప్పుకొచ్చారు. ఈ విష‌యాన్ని బాధిత కుటుంబ స‌భ్యులు తిరుప‌తి పోలీస్ ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వ‌ల‌ప‌న్ని ఆ న‌లుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదే రీతిలో తిరుప‌తి, తిరుమ‌ల‌లో చిన్న‌చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, రాజ‌కీయ నేత‌లు త‌దిత‌రుల‌ను బెదిరిస్తూ దందాల‌కు పాల్ప‌డుతున్నార‌ని స‌మాచారం.

LEAVE A RESPONSE