Suryaa.co.in

Andhra Pradesh

తెలుగుదేశం పార్టీకి ధర్మవరం పెట్టని కోట

  • ఇక్కడ ప్రతి కార్యకర్త ఒక సైనికుడు.. పరిటాల శ్రీరామ్
  • వారికి అన్ని విధాలుగా పార్టీ న్యాయం చేస్తుంది
  • ధర్మవరంలో పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా శ్రీరామ్
  • పండుగ వాతావరణంలో పార్టీ కార్యాలయం ప్రారంభం

ధర్మవరం: ధర్మవరం అంటే.. తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట అని.. నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలోని గాంధీ సర్కిల్లో టీడీపీ కార్యాలయాన్ని ఆయన పునఃప్రారంభించారు. గతంలో ఇక్కడున్న పార్టీ కార్యాలయాన్ని పలు కారణాలతో మరో చోటికి మార్చారు. తాజాగా పాత భవనంలో పార్టీ కార్యకలాపాలు ప్రారంభించారు. బుధవారం సాయంత్రం పార్టీ కార్యాలయం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పార్టీ కార్యాలయం ప్రారంభం అనంతరం క్యాడర్ కు శ్రీరామ్ దిశా నిర్దేశం చేశారు. ఇక నుంచి పార్టీ మరింత బలోపేతం అయ్యే విధంగా మనం పని చేద్దామని పిలుపునిచ్చారు. మనం అధికారంలో ఉన్నప్పుడు మనపై బాధ్యత ఇంకా ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రజలకు మనం అందించాల్సింది ఇంకా ఎక్కువగా ఉంటుందన్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా పట్టణం నడిబొడ్డున పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు.

ధర్మవరం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి బలమైన ప్రాంతమని.. పార్టీ ఎంత కష్టంలో ఉన్నా.. కార్యకర్తలు సైనికులుగా పని చేశారన్నారు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇక్కడ పార్టీ చాలా సంక్షోభాన్ని చూసిందని.. మీ అందరి సహకారంతో మళ్లీ ఇక్కడ పూర్వ వైభవం తెచ్చామన్నారు. పార్టీ కోసం కష్ట పడ్డ ఏ ఒ‍క్క కార్యకర్తని, నాయకున్ని మర్చిపోమని.. ప్రతి ఒక్కరికి తగిన విధంగా న్యాయం చేస్తామని శ్రీరామ్ స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE