Suryaa.co.in

Andhra Pradesh

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి

– సుప్రీంకోర్టు లీగల్‌సెల్‌ సర్వీసెస్‌ కమిటీకి విజ్ఞాపన

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్థిక స్థోమత లేనందున న్యాయసహాయం కల్పించాలంటూ దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. ఈమేరకు సుప్రీంకోర్టు లీగల్‌సెల్‌ సర్వీసెస్‌ కమిటీకి విజ్ఞాపన పంపారు. వివేకా హత్య కేసులో తనను బాధితుడిగా పరిగణించాలంటూ ఆయన వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

వివేకా హత్యపై తొలుత ఫిర్యాదు చేసింది తానే కనుక బాధితుడిగా చూడాలని కోరారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే.. పీఏ కృష్ణారెడ్డి అభ్యర్థనపై వివేకా కుమార్తె సునీత వ్యతిరేకించారు.

అదే సమయంలో దర్యాప్తు సంస్థ సీబీఐకి, అప్రూవర్‌గా మారిన దస్తగిరికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు నోటీసులపై స్పందించిన దస్తగిరి.. వివేకా హత్యకేసులో తనకు న్యాయసహాయం అందించాలని కోరాడు. సుప్రీంకోర్టులో న్యాయవాదిని పెట్టుకునేంత ఆర్థిక స్థోమత లేనందున న్యాయసహాయం కల్పించాలని విజ్ఞప్తి చేశాడు.

మరో వైపు దస్తగిరి అప్రూవర్‌గా మారటాన్ని వివేకా హత్యకేసులో నిందితుడు శివశంకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనం.. ఈ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. నిందితులకు ఇలాంటివి కోరే హక్కు లేదని స్పష్టం చేసింది..

LEAVE A RESPONSE