– సంక్షేమ హాస్టళ్లను నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం
– 18 నెలల్లో బీసీ,ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో 46 మంది మరణం
– ఆహారం, తాగునీటి కాలుష్యంతోనే పిల్లల వరుస మరణాలు
– ఎన్సీపీసీఆర్ మార్గదర్శకాలు, హైకోర్టు ఆదేశాలూ పట్టవా?
– మాజీ మంత్రి విడదల రజిని
తాడేపల్లి : 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లను నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షిత మంచినీటితో పాటు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైన సీఎం చంద్రబాబు నిర్లక్ష్యంతో 46 మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చి చెప్పారు.
తాడేపల్లి వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… ఆహారం, తాగునీరు కలుషితం కావడం వల్లే పిల్లల వరుస మరణాలు సంభవిస్తున్నా.. ప్రభుత్వానికి ఎన్సీపీసీఆర్ మార్గదర్శకాలు, హైకోర్టు ఆదేశాలూ పట్టడం లేదని విమర్శించారు. వైయస్.జగన్ హయాంలో జీవో 46తో సంక్షేమ హాస్టళ్లకు మహర్దశ పడితే.. కేవలం అక్కసుతోనే ఆ జీవోను నిలిపివేసి చంద్రబాబు… పేద పిల్లల ఉసురు తీస్తున్నారని స్పష్టం చేేశారు. దాని ఫలితమే అధ్వాన్న స్దితిలో ఉన్న సంక్షేమ హాస్టళ్లు అని విడదల రజిని తీవ్రంగా ఆక్షేపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,783 సంక్షేమ హాస్టళ్లలో సుమారు ఆరున్నర లక్షల మంది విద్యార్ధులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారిని నిలువునా వంచిస్తోంది. వారి హక్కుల్ని కాలరాస్తోంది. విద్యార్ధులు ఆకలితో అలమటిస్తున్నారు. పారిశుద్ధ్యం కరవై అనారోగ్యం పాలై చనిపోతున్నారు. ఇది పాలనా వైఫల్యం కాదా ?, ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. 18 నెలల్లో సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధులు అనారోగ్యం పాలవుతూనే ఉన్నారు. ఆహారం, తాగునీరు కలుషితం కావడం, పారిశుద్ధ్యం కరవై ఆస్పత్రుల పాలవుతున్నారు.
ఈ 18 నెలల్లో తిరుపతి జిల్లాలో 139 మంది గురుకుల హాస్టల్ విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో భోజనంలో పురుగులు వచ్చాయి. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ హాస్టల్లో మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయి. పొట్టి శ్రీరాములు జిల్లా ఆత్మకూరులో పిల్లలు విషజ్వరాలతో ఆస్పత్రి పాలయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా బాలికల ఆశ్రమ పాఠశాలలో 22 మంది అస్వస్థతకు గురయ్యారు.
నంద్యాల జిల్లా మిట్టకందాల గ్రామంలో 8 మంది చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. సత్యసాయి జిల్లా గిరిజన సంక్షేమ పాఠశాలలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. ఇలా 18 నెలల్లోనే మొత్తం 46 మంది చిన్నారులు చనిపోయారు. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోనప్పుడు ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సి ఉంటుంది.
సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధుల మరణాలకు కారణమేంటో ప్రభుత్వం చెప్పాలి. వెనుకబడిన వర్గాల పిల్లలు చదువుకోకుండా ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా అనేది చెప్పాలి. సంక్షేమ హాస్టళ్లపై ప్రభుత్వానికి ఓ ప్రణాళిక లేదు, బాథ్యత అస్సలే లేదు. ఇది పేదలకు పెట్టే ప్రభుత్వం కాదు, కార్పోరేట్ వాళ్లకు పెట్టే ప్రభుత్వం. పిల్లల విషయంలోనూ రాజకీయాలు చేస్తున్నారంటే ఇది ముంచే ప్రభుత్వమని అర్దమవుతోంది.
హాస్టళ్ల విషయంలో నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్( ఎన్సీపీసీఆర్) కొన్ని మార్గదర్శకాలు ఇస్తోంది. హైకోర్టు కూడా వీటిని అమలు చేయాలని మొట్టికాయలు వేస్తూనే ఉంది. తాగునీరు ఎప్పుడిస్తారని అడుగుతోంది. ఎన్సీపీసీఆర్ మార్గదర్శకాల ప్రకారం భద్రమైన వాతావరణం కల్పించాలని, క్వాలిఫైడ్, బాధ్యత కలిగిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, లివింగ్ కండిషన్స్ ఉండాలని, పౌష్ఠికాహారం ఇవ్వాలని, మందులు అందుబాటులో ఉంచాలని చెబుతోంది. అలాగే విద్యార్ధులకు మానసిక అంశాలపై కౌన్సిలింగ్ కూడా కల్పించాలని చెబుతోంది. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు.