– మందబలంతో టీఆర్ఎస్ రెచ్చగొట్టే అవకాశమున్నందున సంయమనంతో వ్యవహరించండి
– ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, షార్ట్ డిస్కషన్స్ సహా అసెంబ్లీలో ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోండి
– తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు, నిధుల దారి మళ్లింపు, ఖర్చు చేసిన వివరాలపైనా చర్చకు అస్త్రశస్త్రాలతో సిద్ధం కండి
– బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలను ప్రస్తావించడంతోపాటు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం పట్టుపట్టాలని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం నిర్ణయించింది. అందులో భాగంగా డబుల్ బెడ్రూం ఇండ్లు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భ్రుతి, 317 జీవో, పోడు భూములు, యాసంగిలో ధాన్యం కొనుగోలు, పంట నష్టపరిహారం, కొత్త రేషన్ కార్డులు, ఆసరా ఫించన్లు, మద్యంతోపాటు విద్యావైద్య వ్యవస్థలోని లోపాలవల్ల ప్రజలపై పడుతున్న భారం వంటి అంశాలను అసెంబ్లీలో లేవనెత్తేందుకు సిద్ధమైంది.
పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్, సీనియర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ ఆయా నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ…. బడ్జెట్ సమావేశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలో బీజేపీ బలపడటానికి ప్రధాన భూమిక పోషించాలని కోరారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తీవ్ర అసహనంతో ఉన్న టీఆర్ఎస్ పార్టీ బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు, ప్రతిపక్షాలను తన ట్రాప్ లోకి నెట్టేందుకు శతవిధాల ప్రయత్నించే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ ట్రాప్ లో పడకుండా ప్రజా సమస్యలపైనా, ఏడేళ్లలో టీఆర్ఎస్ వైఫల్యాలపైనా ప్రభుత్వాన్ని ఎండగట్టేలా ప్రణాళిక రూపొందించుకోవాలని బండి సంజయ్ సూచించారు.
అసెంబ్లీ వేదికగా ప్రశ్నోత్తరాలు, షార్ట్ డిస్కషన్స్, జీరో అవర్ వంటి వాటిని ఉపయోగించుకుని ప్రజా సమస్యలపై గళమెత్తాలని కోరారు. మంద బలంతో అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యేలకు సమయం కేటాయించకుండా శాయశక్తులా క్రుషి చేసే అవకాశం ఉన్నందున ఈ అంశాన్ని ప్రతి దశలోనూ ఎండగట్టాలని బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
అన్ని వర్గాల ప్రజలను ప్రతిబింబించేలా అసెంబ్లీలో పార్టీ తరపున ప్రజా సమస్యలను ప్రస్తావించాలని, తద్వారా మా సెక్షన్ కోసం బీజేపీ పోరాడుతుందనే వాతావరణం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందని బండి సంజయ్ తెలిపారు.
అందులో భాగంగా డబుల్ బెడ్రూం ఇండ్ల పరిస్థితి, నిరుద్యోగ సమస్య (ఉద్యోగ ఖాళీలు, నిరుద్యోగ భ్రుతి), రైతు బంధు లోపాలు – కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు-పరిష్కార మార్గాలు, ఆసరా ఫించన్లు, 317 జీవో, పోడు భూముల సమస్య – పరిష్కార మార్గాలు, అకాల వర్షాలు పంట నష్టపరిహారం – ప్రభుత్వ వైఫల్యాలు, వైద్య రంగంలో లోపాలు, సీఎంసహా టీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, విద్యా రంగం దుస్థితి, యాసంగిలో ధాన్యం కొనుగోలు, మద్యం దుష్ప్రభావాలు, దళిత బంధు, రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల పరిస్థతి, రెగ్యులరైజేషన్, ఫీల్డ్ అసిస్టెంట్లు, విద్యా వలంటీర్లు, స్టాఫ్ నర్సులు, స్కూల్ స్కావెంజర్స్ తొలగింపు వంటి అంశాలు సభలో చర్చకు వచ్చేలా చూడాలని సంజయ్ పార్టీ ఎమ్మెల్యేలను కోరారు.
ముఖ్యంగా తెలంగాణపట్ల కేంద్రం వివక్ష చూపుతోందని, నిధులు కేటాయించడం లేదని అధికార పార్టీ పదేపదే ఆరోపిస్తున్న నేపథ్యంలో సభలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించి బీజేపీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉందని ఈటల రాజేందర్ పేర్కొనగా… 2014 నుండి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, వివిధ రూపాల్లో తెలంగాణకు కేటాయించిన నిధులకు సంబంధించి పూర్తి వివరాలను తెప్పిస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. సభలో ఈ అంశం ప్రస్తావనకకు వస్తే కేంద్రం కేటాయించిన నిధులు, ఖర్చు చేసిన వివరాలతోపాటు ఇతర పథకాలను ఆయా నిధులను దారి మళ్లించిన అంశాలను ప్రస్తావిస్తూ అధికార పార్టీని నిలదీయాలని బండి సంజయ్ సూచించారు.
రాజాసింగ్ మాట్లాడుతూ సభలో అధికార పార్టీ నేతల సంఖ్య ఎక్కువగా ఉన్నందున మంద బలంతో పదేపదే రెచ్చగొట్టే అవకాశం ఉందని చెప్పగా… అధికార పార్టీ సభ్యులు పదేపదే రెచ్చగొట్టి సైడ్ ట్రాక్ పట్టించాలని చూస్తారని.. ఈ విషయంలో మీరు మాత్రం టీఆర్ఎస్ ట్రాప్ లో పడకుండా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టానికే ప్రాధాన్యత ఇవ్వాలని బండి సంజయ్ కోరారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ రోజురోజుకూ బలహీనపడుతుండటం, బీజేపీ గ్రాఫ్ పెరుగుతుండటంతో సీఎం కేసీఆర్ స్ట్రాటజిస్ట్ పీకే టీంతో కలిసి బీజేపీని బదనాం చేసే కుట్రలు చేస్తున్నారనే అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీ బలపడుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని బలమైన లీడర్లుగా ఉన్న డీకే అరుణ, జితేందర్ రెడ్డిలపై హత్యకు కుట్ర వంటి ఆరోపణలు చేస్తూ బీజేపీపట్ల ప్రజల్లో చులకన భావన ఏర్పడేలా కేసీఆర్, పీకే టీం దుష్ప్రచారం చేస్తోందని అభిప్రాయపడ్డారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పట్ల జిల్లా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, ప్రజల ద్రుష్టి మళ్లించేందుకు కేసీఆర్ పీకే టీంతో కలిసి ఇలాంటి ఎత్తుగడ వేశారనే భావన సమావేశంలో వ్యక్తమైంది.