– ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి డిమాండ్
పరవాడ: ఫార్మా సిటీలో డెక్కన్ రెమెడీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో విధులు నిర్వహిస్తున్న సీనియర్ కెమిస్ట్ ఎం.పోల్ నాయుడు సోమవారం తెల్లవారి ఆరు గంటలకు మృతి చెందాడు. దీనిపై సమగ్ర విచారణ చేసి కార్మిక కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం గని శెట్టి పరిశ్రమలో కార్మికుడు తీవ్ర అస్వస్థతకి గురైన రియాక్టర్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన పరిశ్రమ గేటు వద్ద మీడియాతో మాట్లాడుతూ యాజమాన్యం నిర్లక్ష్యంగా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వలన ఒక నిండు ప్రాణం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు.
భద్రత ప్రమాణాలు పాటించాలని కార్మికులకు రక్షణ భద్రత సంక్షేమం అమలు చేయాలని గనిశెట్టి డిమాండ్ చేశారు. యాజమాన్యం విషయాన్ని గోప్యంగా ఉంచడం పట్ల గని శెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలో భద్రత ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించడంతోపాటు కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు గనిశెట్టి తెలిపారు.