Suryaa.co.in

Andhra Pradesh

బిల్లుల చెల్లింపు జాప్యం.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్‌ వేటు

– ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, మరో డివిజినల్‌ అకౌంట్స్ ఆఫీసర్‌పై సస్పెన్షన్‌ వేటు
– ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఉత్తర్వు

అమరావతి : రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖకు చెందిన ఒక ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, మరో డివిజినల్‌ అకౌంట్స్ ఆఫీసర్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు. మరో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌కు ఛార్జి మెమో ఇచ్చారు. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులిచ్చారు. ఈ 483 జీవో రెండు రోజులు ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. ఉపాధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యంపై, హైకోర్టు ఆయనపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. శాఖాపరంగా ఇటువంటి తీవ్ర చర్యలు తీసుకోవడంపై సంబంధిత వర్గాల్లో చర్చనీయాంశమైంది.

జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద చేసిన పనికి సంబంధించిన కోర్టుధిక్కరణ కేసులో హాజరైన ముఖ్యకార్యదర్శిపై హైకోర్టు 14న ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే.హైకోర్టు ఆదేశించినా గుత్తేదారులకు బిల్లులు చెల్లించరా? అని గట్టిగా ప్రశ్నించింది. ఈ పరిస్థితికి ప్రకాశం జిల్లా మార్కాపురం పంచాయతీరాజ్‌ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ వై.రమేశ్‌బాబు, డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పీవీ సుబ్బారావు ప్రధాన కారణమని పేర్కొంటూ, ముఖ్యకార్యదర్శి ద్వివేది వారిద్దరినీ 16న సస్పెండ్‌ చేశారు.డీఈఈ కె.ఆదినారాయణకు ఛార్జి మెమో ఇచ్చారు. కోర్టుధిక్కరణపై ముఖ్యకార్యదర్శి రివ్యూ పిటిషన్‌ వేశారు. అందులో.. పిటిషనర్‌ పూర్తి చేసిన రోడ్డు పనిపై తొలుత క్వాలిటీ కంట్రోల్‌ విభాగం తనిఖీ చేసి, నాణ్యత లోపం ఉందంటూ రికవరీ పెట్టిన విషయాన్ని ప్రస్తావించకపోవడానికి, ఇంజినీర్లు సమాచారం ఇవ్వకపోవడమే కారణమని ముఖ్య కార్యదర్శి నిర్ధారణకు వచ్చారు. వీరి కారణంగా హైకోర్టులో ఇబ్బందికరమైన పరిస్థితులతో పాటు, ప్రతికూల వ్యాఖ్యలు ఎదుర్కొన్నామని ఆ జీవోలో పేర్కొన్నారు. సస్పెన్షన్లపై ఇంజినీర్ల సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో, తీవ్రమైన ఒత్తిడితో పని చేస్తున్న ఇంజినీర్లను చేయని తప్పునకు బలిపశువులను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సస్పెన్షన్లను తక్షణం ఎత్తివేయాలని ఏపీ పంచాయతీరాజ్‌ ఇంజినీర్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వీవీ మురళీకృష్ణనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

LEAVE A RESPONSE