– అనుకూల గ్రామాల్లోనే మందగమనం
రాజధాని అమరావతి కోసం చేపట్టిన రెండోదశ పూలింగులో భూ సమీకరణలో మందగమనంగా సాగుతోంది. జనవరి ఏడోతేదీన నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ పూలింగుకు 664 ఎకరాలు వచ్చింది. తొలిలో పెద్దఎత్తున హడావుడి చేసినప్పటికీ రైతుల్లో అంత ఆసక్తి కనిపించడం లేదు.
రెండోదశలో వడ్డమాను, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడి రెవెన్యూ గ్రామాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిల్లో వడ్డమాను మినహా మిగిలిన మూడు గ్రామాలు తెలుగుదేశం అనుకూలం కావడం, పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలోని అమరావతి మండలంలో ఉండటంతో రైతులు ముందుకొచ్చి భూములు ఇస్తారని ప్రభుత్వం ఆశించింది.
అప్పట్లో రైల్వే ప్రాజెక్టు వస్తుందని, కేంద్రం భూములు తీసుకుంటుందనే ప్రచారం రావడంతో పూలింగుకు ఇవ్వాలని నిర్ణయించి, కర్లపూడి రైతులు ఎమ్మెల్యేను కలిశారు. స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తమ భూములు సమీకరణకు తీసుకోవాలని 2024లో సిఎంకు ఒక లేఖ సమర్పించారు. దీంతో రైతులు ఉత్సాహంగా ఉన్నారని, భూములు ఇస్తారని ఆశించి ఆయా గ్రామాలకే ముందు నోటిఫికేషన్ ఇచ్చారు.
బుధవారం నాటికి ప్రాథమికంగా తెలిసిన సమాచారం మేరకు యండ్రాయి రెవెన్యూలో 291 ఎకరాలు, పెదమద్దూరులో 192 ఎకరాలు, కర్లపూడిలో 181 ఎకరాలు పూలింగు కింద వచ్చింది. వీరిలోనూ ఎక్కువమంది పూలింగుకు ఇవ్వడం కోసం కొనుగోలు చేసినవారివే ఉన్నాయి. ఇప్పటికీ స్థానిక రైతుల్లో ఆసక్తి తక్కువగా కనిపిస్తోంది.
నోటిఫికేషన్ సమయంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గ్రామసభలు పెట్టిన సమయంలో రైతులు అనేక సమస్యలు ముందుకు తెచ్చారు. వాటిని పరిష్కరించాలని కోరారు. అయితే అవి ఇప్పటికీ పరిష్కారానికి నోచలేదు. పైగా తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ వడ్డమానులో రైతులు నిరసన వ్యక్తం చేశారు.
ప్రస్తుత పూలింగు గ్రామాల్లో కౌలు పరిహారం పెంపు, రుణమాఫీ, అవిభాజ్యహక్కుల పరిష్కారం, గ్రామకంఠాల నిర్ధారణ వంటివాటితో రిటర్నబుల్ ప్లాట్లు ఎక్కడ ఇస్తారు? ఒకేచోట ఇస్తారా? లేక వేర్వేరుగా ఇస్తారా? అనే అంశాలపై ప్రభుత్వం వైపు నుండి స్పష్టత ఇవ్వలేదు. దీంతో రైతుల్లో కొంత ఆసక్తి తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూమి వేగంగా వస్తుందనుకున్న ప్రాంతంలోనే పూలింగులో జాప్యం జరగడం కొంత ఇబ్బందికరంగా మారింది.
– వల్లభనేని సురేష్
సీనియర్ జర్నలిస్ట్
9010099208