న్యాయాన్ని నడిరోడ్డుపై ఉరితీస్తున్న జగన్ రెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా 17వ రోజు రిలే నిరాహార దీక్షలు
అక్రమ అరెస్టులు, అడ్డగోలు కేసులతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కుల్ని జగన్ రెడ్డి హత్య చేస్తున్నాడు. చంద్రబాబు యువతకు ఉద్యోగాలు, మెరుగైన ఉపాధి కోసం ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు కళ్ల ముందు కనిపిస్తున్నా అసలు కేంద్రాలే లేవు అంటూ కేసు పెట్టారు. మరోవైపు, సెంటు సేకరణ చేయలేదు, అసలు రోడ్డే లేదు. అయినా అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు నిర్మాణంలో అవినీతి చేశారంటూ మరో కేసు పెట్టారు.
పిచ్చోడి చేతిలో రాయిలా జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం తయారైంది. కనకపు సింహాసనంపై శునకమును కూర్చోబెట్టినా.. దాని బుద్ధి ఎప్పుడూ పెంట కుప్పపైనే ఉన్నట్లు, ముఖ్యమంత్రి అయినా జగన్ రెడ్డి ఇంకా ఫ్యాక్షన్ మనస్తత్వంతోనే ఉన్నాడు. వేధించడం, కేసులు పెట్టడం, దాడులు చేయడమే లక్ష్యంగా నాలుగేళ్ల పాలన సాగించి ప్రజల్ని భరించలేని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఏ ముఖ్యమంత్రి అయినా, తన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం పని చేస్తే.. జగన్ రెడ్డి మాత్రం పొరుగు రాష్ట్రాల కోసం పని చేస్తున్నారు. ఏపీ నుండి తరిమేసిన కియా తెలంగాణలో ప్రారంభమైంది.
ఏపీ నుండి తరిమేసిన అమరరాజా బ్యాటరీస్ సంస్థ తెలంగాణలో రూ.9వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. త్వరలో ప్రారంభానికీ సిద్ధమవుతోంది. జగన్ రెడ్డి నాలుగేళ్లలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తీసుకురాకపోగా, ఉన్న వాటిని తరిమేయడమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమా? పరిశ్రమలు తెచ్చి, శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించాలనుకోవడమే చంద్రబాబు చేసిన నేరమా అని నేతలు ప్రశ్నించారు.
ఈ మేరకు చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 17వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కొత్తపేట నియోజకవర్గంలో ఇంఛార్జి బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష వినూత్నంగా చేపట్టారు. చావు బ్రతుకుల్లో వున్న మనిషిని డాక్టర్లు ఎలా బ్రతికిస్తారో అదే విధంగా రాజ్యాంగాన్ని కాపాడే గవర్నర్, రాష్ట్రపతులు ఆంధ్రప్రదేశ్ లో న్యాయాన్ని బ్రతికించాలని కోరుతూ వెంటిలేటర్ పై బొమ్మకు సిలైన్ ఎక్కిస్తూ నిరసన తెలియజేశారు. హిందూపురంలో TNTUC & వాణిజ్య విభాగాలల ఆధ్వర్యంలో శిరోముండనంతో నిరసన తెలిపారు.
కొవ్వూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ ఆధ్వర్యంలో వాడపల్లి గ్రామంలోని శ్రీ కృష్ణ ఆలయం వద్ద సంకల్ప సిద్ధియాగం నిర్వహించారు. ఆత్మకూరు నియోజకర్గం చేజెర్లలో ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో కొరిటెపాడు కోదండరామస్వామి దేవస్థానములో వేద పండితులతో ప్రత్యేక యాగం చేపట్టారు.
అనంతపురం జిల్లా రాయదుర్గంలో పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో చేనేత కార్మికులు తమ పనిముట్లు, రాట్నం, నూలు వడికే యంత్రాలను ఏర్పాటు చేసి దీక్ష చేపట్టారు. కుప్పంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రత్యంగిరదేవి అమ్మవారి దేవాలయంలో హోమం నిర్వహించారు. కనిగిరిలో చీపుర్లతో రోడ్లు ఊడ్చి వినూత్నంగా నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.
సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఇంచార్జి బి.కె.పార్థసారథి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం రిలే నిరాహారదీక్ష చేపట్టారు. కళ్లకు గంతలు కట్టుకుని, నల్ల బెలూన్లు చేతపట్టి నిరసన తెలిపారు. ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రీనివా కాలువలో “జలదీక్ష” చేపట్టారు. అమలాపురం నియోజకవర్గంలో తాండవ కాలువలో అర్థనగ్న ప్రదర్శనతో పార్టీ కార్యకర్తలు, నాయకులు నిరసన తెలిపారు.
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్ నాయుడు(గణబాబు) ఆధ్వర్యంలో మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మోకాలిపై కూర్చుని నిరసన తెలిపారు. రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పుష్కరాల రేవులో జలదీక్ష చేపట్టారు.
ఉంగుటూరు నియోజకవర్గ కేంద్రంలో గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో వినూత్నంగా చీపుళ్ళతో రోడ్లు తుడుస్తూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఆధ్వర్యంలో ఆటోనగర్ లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ నాయకులు చేతులకు ఇనుప సంకెళ్ళు తగిలించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 17వ రోజు కొనసాగాయి. చేతికి సంకెళ్లతో మాజీమంత్రి ప్రత్తిపాటి, తెదేపా నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమాలలో పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనందబాబు, ఎండీ షరీఫ్, కాలవ శ్రీనివాసులు, ఎన్.ఎండి ఫరూక్, గుమ్మడి సంధ్యారాణి, పార్లమెంట్ అధ్యక్షులు కూన రవికుమార్, బుద్దా నాగజగధీశ్వరరావు, జ్యోతుల నవీన్, కె.ఎస్ జవహార్, నెట్టెం రఘురాం, తెనాలి శ్రావణ్ కుమార్, ఏలూరి సాంబశివరావు,నూకసాని బాలాజీ, మల్లెల రాజశేఖర్ గౌడ్,, బి.కె పార్థసారథి, మల్లెల లింగారెడ్డి, గొల్లా నరసింహాయాదవ్,పులివర్తి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నియోజకవర్గ ఇంఛార్జులు, రాష్ట్ర, మండల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.