– రెండు మున్సిపాలిటీల పరిధిలో ఐదు అక్రమ నిర్మాణాలపై చర్యలు
– గుండ్లపోచంపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలలో టాస్క్ ఫోర్స్ కూల్చివేతలు
హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ) పరిధిలో 600 చదరపు గజాలకు మించిన అక్రమ నిర్మాణాలపై డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ బృందాలు కూల్చివేత పరంపర కొనసాగుతున్నది.మంగళవారం నాటికి టాస్క్ ఫోర్స్ కూల్చివేత చర్యలు వంద(సెంచరీ)కు చేరాయి.
మంగళవారం నాడు హెచ్ఎండిఎ, డిస్టిక్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ గుండ్లపోచంపల్లి మునిసిపాలిటీ, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల పరిధిలో ఐదు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నాయి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపేట్ గ్రామం రెసిడెన్షియల్ జోన్ (నివాస ప్రాంతం)లో
పదకొండు(11) ఎకరాలు విస్తీర్ణం గల స్థలంలో అక్రమంగా నిర్మించిన పౌల్ట్రీ షెడ్ పై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇదే మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ గ్రామం వద్ద మరో అక్రమ పౌల్ట్రీ ఫామ్ పై కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో మూడు అక్రమ నిర్మాణాలను టాస్క్ఫోర్స్ బృందాలు సీజ్ చేశాయి.