– మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కు ఆదేశం
ఏలేశ్వరం: కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బాలికల గురుకులంలో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. విద్యార్థినులు మంగళవారం ఉదయం నుంచి కడుపు నొప్పి, విరేచనాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలియగానే కాకినాడ కలెక్టర్ తో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు.
విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలందించే ఏర్పాట్లు చేయాలని, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలని ఆదేశించారు. వీరికి చికిత్స నిమిత్తం ఏలేశ్వరం ఆసుపత్రికి స్పెషలిస్టులను పంపించాలన్నారు. గురుకులంలో విద్యార్థినులకు అందించిన ఆహారం, అక్కడి మంచినీటికి పరీక్షలు చేయించాలని స్పష్టం చేశారు.