ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ నేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణ స్వామి కుమార్తె కళత్తూరు కృపాలక్ష్మి గురువారం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డిని కలిశారు. పార్టీ అనుబంధ విభాగాల సమన్వయకర్తగానూ వ్యవహరిస్తున్న సాయిరెడ్డి.. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటూ తనను కలిసేందుకు వస్తున్న వారితో భేటీ అవుతున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం తాడేపల్లి వచ్చిన కృపాలక్ష్మీ… సాయిరెడ్డితో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని కృపాలక్ష్మి స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. ఇటీవలే ఆమె తాడేపల్లిలోనే పార్టీ మరో ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా కలిశారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి నారాయణ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ వస్తున్న నారాయణ స్వామి… జగన్ సీఎం కాగానే ఆయన కేబినెట్‌లో ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకున్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలోనూ నారాయణ స్వామి తన పదవిని నిలుపుకున్నారు.
ఇప్పటిదాకా నారాయణ స్వామి కుటుంబం పెద్దగా బయటకు వచ్చిన దాఖలా లేదనే చెప్పాలి. ఇప్పటికే 73ఏళ్ల వయసు ఉన్న నారాయణ స్వామి రాజకీయాల నుంచి తప్పుకుని తన వారసురాలిగా తన కుమార్తెను రంగంలోకి దింపనున్నారన్న దిశగా చిత్తూరు జిల్లాలో ప్రచారం సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఆయన కుమార్తె కృపాలక్ష్మి నేరుగా సాయిరెడ్డిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కలిగిన కృపాలక్ష్మికి ఇప్పటిదాకా ఎలాంటి ప్రత్యేక పదవి అయితే లేదు. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన తాను వైసీపీలో ఉన్నానంటూ ఆమె సోషల్ మీడియాలో తన వివరాలను పొందుపరిచారు.