Suryaa.co.in

Editorial

డిప్యూటీ కలెక్టరు పోస్టు.. ఒక్కోరికి ఒక్కోలా!

– ప్రవీణ్‌ప్రకాష్ పుణ్యాన డిప్యూటీ కలెక్టరు పోస్టు దక్కని బాధితుడు
– దివంగత ఐఏఎస్ రమామణికి పోస్టింగ్ ఇవ్వకుండా వేధించిన ప్రవీణ్ ప్రకాష్
– ఢిల్లీ బిల్లులు క్లియర్ చేయకపోవడమే రమామణి చేసిన పాపం
– ఆ ఆగ్రహంతో ఆమెకు పోస్టింగ్ ఇవ్వని ప్రవీణ్‌ప్రకాష్
– టీడీపీకి సంబంధించిన అధికారి అని రాసిన ప్రవీణ్
– దానితో మనస్తాపానికి గురయి మంచం పట్టి మృతి చెందిన ఐఏఎస్ రమామణి
– రెండేళ్ల తర్వాత ఆమె ఉద్యోగం కొడుక్కు ఇచ్చిన జగన్ సర్కారు
– అది కూడా డిప్యూటీ తహశీల్దార్‌తో సరిపుచ్చిన ముత్యాలరాజు
– మిగిలిన వారికి నేరుగా డిప్యూటీ కలెక్టర్ పోస్టింగులు
– బాధితుడి అర్జీని తొక్కిపెట్టిన జగన్ సర్కారు
– డిప్యూటీ కలెక్టరు పోస్టులు పాలకుల దయాధర్మమేనా?
– కూటమి సర్కారయినా న్యాయం చేస్తుందా?

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆమె విజయవాడ వాణిజ్యపన్నుల శాఖ కమిషనరేట్‌లో సెక్రటరి టు కమిషనర్. పేరు టి.కె. రమామణి. ఐఏఎస్ అయిన ఆమె.. మరొక ఐఏఎస్ అధికారి వేధింపులకు మానసికవేదన అనుభవించి, కరోనా సమయంలో కన్నుమూశారు. పోస్టింగు కోసం కాళ్లరిగేలా తిరిగినా కనికరించని.. సదరు ప్రవీణుడి వేధింపులు, మానసిక క్షోభగా మారిన ఫలితంగా మంచం పట్టారు. దానితో మంచంలోనే మరణించారు. విచిత్రమేమిటంటే.. ఆమె టీడీపీకి సంబంధించిన అధికారి అంటూ తన నివేదికలో రాసి ఆమెను మానసికంగా వేధించి, చావుకు పరోక్షంగా కారణమయిన సదరు అధికారి.. ఆసుపత్రికి వచ్చి కుటుంబసభ్యులను పరామర్శించడం!

ఐఎఏఎస్-ఐపిఎస్ అధికారులు వివిధ సందర్భాల్లో మృతి చెందినప్పుడు, వారి కుటుంబసభ్యుల విద్యార్హత బట్టి ఉద్యోగాలివ్వడం రివాజు. ఉన్నతవిద్య అభ్యసించిన వారికి, డిప్యూటీ కలెక్టర్ పోస్టింగులు ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు. కానీ పీజీ చదివిన ఐఏఎస్ అధికారి రమామణి కొడుకు సుభాష్ హరిహరరామచంద్రశర్మకు మాత్రం, నాటి జగన్ సర్కారు డిప్యూటీ తహశీల్దార్ పోస్టు మాత్రమే ఇచ్చింది. అంటే గ్రూపు-2 ఏ అన్నమాట. అది కూడా ఆమె మరణించిన రెండేళ్ల తర్వాత!

అది కూడా ఎప్పుడంటే.. ప్రవీణుడు సీఎం పేషీ నుంచి వెళ్లిన తర్వాత.. చెప్పులు పూర్తిగా అరిగిపోయిన తర్వాత ముత్యాలరాజు జాలిపడి దయతో ఇచ్చిన పోస్టింగ్. మరి మృతిచెందిన ఐఏఎస్-ఐపిఎస్ కుటుంబసభ్యులకు డిప్యూటీ కలెక్టర్ పోస్టింగులు ఇవ్వలేదా అంటే.. బోలెడుమందికి ఇచ్చారు. ఇప్పుడు వాళ్లంతా ఐఏఎస్‌లయి, కలెక్టర్లుగా కూడా పనిచేస్తున్నారు. మరి రమామణి కొడుక్కి ఎందుకివ్వలేదంటే.. పాలకుల దయ. బాధితుల ప్రాప్తం! జగన్ జమానాలో జరిగిన ఇదో వైచిత్రి.

రమామణి. విజయవాడలో వాణిజ్యపన్నుల శాఖలో ఒక ఐఏఎస్ అధికారి. అప్పట్లో ప్రవీణ్ ప్రకాష్ అనే ‘మతిస్థిమితంగా బాగా ఉన్న’ సీనియర్ ఐఏఎస్ అధికారి, సీఎంఓలో ముఖ్య కార్యదర్శిగా ఉండేవారు. ఆయన ఢిల్లీ పర్యటనలో కార్లు, ఇతర వ్యవహారాలకు అయిన ఖర్చుల బిల్లులు, రమామణి క్లియర్ చేయాల్సి ఉంటుంది. అసలు సీఎంఓలో ఉండే సారు, ఆమెకు బిల్లులు ఎందుకు పంపారంటే.. ఏ శాఖలో డబ్బులుంటే ఆ శాఖకు ఆయన బిల్లులు పంపేవారట. అయితే అవి నిబంధనల మేరకు లేనందున, ఆమె ఆ బిల్లులను క్లియర్ చేయలేదు. అది ప్రవీణ్ సారుకు నచ్చలేదు.

సీఎంఓలో తిష్టవేసి, అప్పటి సీఎస్ ఎల్వీఎస్ ఇవ్వాల్సిన ఉత్తర్వులు కూడా ప్రకాష్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎల్వీని అవమానకర తీరిలో సాగనంపి, నీలం సహానీని సీఎస్‌గా తెచ్చుకున్నారు. టీడీపీ సర్కారు వచ్చిన వెంటనే ఆగమేఘాలపై వీఆర్‌ఎస్ తీసుకుని జంపయిన ప్రవీణ్ సార్ హవా.. జగనన్న జమానాలో మామూలుగా కాదు. ఒక రేంజ్‌లో ఉండేది. సారు సాయంత్రం సచివాలయంలో టక్ చేసుకుని వాకింగ్ చేస్తూ డిక్టేట్ చేస్తుంటే.. వెనుక ఉన్న నలుగురు సిబ్బంది చేతిలో లాప్‌టాప్ పట్టుకుని, సారు చెప్పేది రాసుకుని, అక్కడికక్కడే ఉత్తర్వులిచ్చేంత హవా ఆయనది. సరే ఇదంతా తెలిసిందే.

టీడీపీ సర్కారు అధికారంలోకి వస్తే.. సారుకు మూడుతుందని పాపం చాలామంది ‘పిచ్చి తమ్ముళ్లు’ భ్రమపడ్డారు. కానీ సారు నాకిక ఉద్యోగం చేసే మూడ్ లేదు. నాకు వీఆర్‌ఎస్ ఇప్పించమని దరఖాస్తు చేసుకోవడం.. దయగల సీఎస్ వెంటనే దానిని ఆమోదించడం చకచకా జరిగిపోయింది. మీది తెనాలి మాది తెనాలి అన్నట్లు.. ఎంతైనా ఐఏఎస్‌లంతా ఒకటే. ఎటొచ్చీ ఐపిఎస్‌లకే ఆ ఐక్యత లేదు.

23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్పించారన్న ఒకే ఆరోపణలతో జగన్ సర్కారు.. ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఐఏఎస్ అధికారి సతీష్‌చంద్రకు చాలాకాలం పోస్టింగ్ ఇవ్వలేదు. అయితే కొద్దినెలలతర్వాత సతీష్‌ చంద్రకు మంచి పోస్టింగ్ ఇచ్చిన జగన్ సర్కారు, ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు మాత్రం పోస్టింగ్ ఇవ్వకపోగా.. ఏకంగా రెండుసార్లు సస్పెండ్ చేసింది. అట్లుంటది ఐఏఎస్‌ల ఐకమత్యం. అది వేరే విషయం.

సరే..సీఎంఓలో ఉన్న సారు.. తన బిల్లులు క్లియర్ చేయని రమామణిని అక్కడి నుంచి తప్పించి, జీఏడీలో రిపోర్టు చేయమని ఆదేశించారు. అలా ఆమె నాలుగునెలలు పోస్టింగ్ కోసం చకోరపక్షిలా ఎదురుచూసింది. అటు జీతం రాక ఇబ్బందిపడాల్సిన పరిస్థితి. దానితో తనకు పోస్టింగ్ ఇవ్వాలని, ఆమె సారును ఎన్నిసార్లు కలిసి ప్రాధేయపడినా సారు కనికరించలేదు. ఇక తనకు పోస్టింగు ఇవ్వరన్న మానసికవ్యధతో రమామణి మంచం పట్టారు.

అప్పుడే కరోనా సీజన్ ఉధృతంగా ఉంది. రోజూ కుటుంబసభ్యుల ముందు తనకు జరిగిన అన్యాయం, ప్రవీణ్‌ సారు వేధింపుల గురించి చెప్పి భోరున ఏడ్చేవారట. ఆ మానసికక్షోభ ఆమె ఆరోగ్యాన్ని కుంగదీసిన ఫలితంగా, మరణానికి కారణమయింది. అయితే.. రమామణి మృతి చెందారన్న విషయం తెలుసుకున్న ప్రవీణ్ సారు, ఆసుపత్రికి వెళ్లి ఆమె భౌతికకాయం చూసి నివాళి అర్పించడమే విచిత్రం. ఆ సమయంలో ఉద్యోగసంఘ నేత కెఆర్ సూర్యనారాయణ ఆందోళనకు దిగేందుకు సిద్ధమవగా, రమారాణి కుటుంబసభ్యులు నచ్చచెప్పడంతో, ఆయన ఆ ఆలోచన మానుకున్నారు.

ఇక అప్పటినుంచే రమామణి కుటుంబానికి మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. కుటుంబాన్ని పోషించే భార్య మరణించడంతో, ఆ భారం ఆమె కుటుంబసభ్యులపై పడింది. భర్త మురళీమోహన్ సాధారణ న్యాయవాది. కొడుకు సుభాష్ పీజీ చేసిన నిరుద్యోగి. దానితో తన కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలని, భర్త మురళీమోహన్ సర్కారుకు అర్జీ పెట్టుకున్నారు. అది రెండేళ్లు అధికారుల చెత్తబుట్టలో సుఖనిద్రపోయింది. రెండేళ్ల తర్వాత సీఎంఓ అధికారి ముత్యాలరాజు కరుణించి, రమామణి కొడుకు సుభాష్‌కు డిప్యూటీ తహశీల్దారు ఉద్యోగం ఇచ్చారు. అంటే గ్రూప్ 2-ఏ ఉద్యోగమన్నమాట. అది కూడా రమామణి చనిపోయిన రెండేళ్ల తర్వాత.

నిజానికి రమామణి కొడుకు విద్యార్హత ప్రకారం, అందరిలా డిప్యూటీ కలెక్టర్ పోస్టింగ్ ఇవ్వాలి. గతంలో రాగ్యానాయక్ మరణిస్తే, ఆయన రెండో కుమారుడికి ఆర్డీఓ ఉద్యోగం ఇచ్చారు. ఐఎఫ్‌ఎస్ అధికారి వెంకటేశ్వర్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే, భార్య స్వర్ణలతకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు. గుంటూరు కలెక్టర్ నాగార్జున క్యాన్సర్‌తో మృతి చెందితే, ఆయన భార్య సుధ కోరిక మేరకు ప్రభుత్వ లెక్చరర్ ఉద్యోగం ఇచ్చారు.

ఐపిఎస్ అధికారి పరదేశీనాయుడు చ నిపోతే, ఆయన భార్య రేఖారాణికి ఆమె విద్యార్హత ప్రకారం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చి, రెండేళ్ల తర్వాత గ్రూప్-1 హోదా ఇచ్చారు. మరో ఐపిఎస్ అధికారి ఉమేష్‌చంద్ర చనిపోతే ఆయన భార్య నాగరాణికి ఆర్డీఓ ఇచ్చి, తర్వాత గ్రూప్1 హోదా ఇచ్చారు. కానీ ఐఏఎస్ అధికారి రమామణి కొడుకుకు మాత్రం డిప్యూటీ తహశీల్దారు ఇవ్వడానికి కారణం.. ఆమె కుటుంబం కోసం సిఫార్సు చేసేవారెవరూ లేకపోవడమే. అయితే రమామణి కొడుక్కు డిప్యూటీ కలెక్టర్ పోస్టింగ్ ఇవ్వాలని అప్పటి ఐఏఎస్ అసోసియేషన్ కూడా సిఫార్సు చేసినా, దానిని ఎవరూ పట్టించుకోలేదు.

‘నా భార్య రమామణికి పోస్టింగ్ ఇవ్వకుండా మానసికంగా వేధించిన ప్రవీణ్ ప్రకాష్ గురించి తను మాకు రోజూ చెప్పి ఏడ్చేది. ప్రవీణ్ ప్రకాష్ ఇచ్చిన బిల్లులు మంజూరు చేయకపోవడమే తాను చేసిన తప్పని విలపించేది. ఇక నాకు పోస్టింగ్ రాదని దిగులుపడేది. ఆ దిగులుతోనే చనిపోయింది. నేను టీడీపీకి చె ందిన దాన్నని ప్రవీణ్ ప్రకాష్ రిపోర్టులో రాశాడని చెప్పి బాధపడేది. అసలు మాకు రాజకీయాలతో ఏం సంబంధం? ఎవరైనా అలా రాస్తారా? మాకు జరిగిన అన్యాయం గురించి ఢిల్లీ బీజేపీ నేత పురిఘళ్ల రఘురాం, సిరిపురపు శ్రీధర్‌శర్మ మీడియాలో కూడా మాట్లాడారు. మాకు అండగా నిలబడ్డారు. అయినా మా కుటుంబానికి ఎవరూ న్యాయం చేయలేదు. నా భార్య చనిపోయిన తర్వాత ప్రవీణ్‌ను కలసి న్యాయం చేయాలని కోరితే.. నీ కులం నేతలను పట్టుకుని చేయించుకోమని సలహా ఇచ్చారు. ఈ ప్రభుత్వమైనా మాకు న్యాయం చేయాలి. గతంలో అందరికీ ఇచ్చినట్లే నా కుమారుడికీ డిప్యూటీ కలెక్టర్ ఇవ్వమని కోరుతున్నా’నని, రమామణి భర్త మురళీమోహన్ అభ్యర్ధించారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తో చూడాలి!

LEAVE A RESPONSE