– రాష్ట్రంలో మానవ హక్కులను హరిస్తారా?
– ప్రజల సహనాన్ని ఇంకా పరీక్షించ వద్దు
– ఇప్పుడు ఆపినా మరోసారి తప్పకుండా అమలాపురం వెళ్లి తీరుతాం
– ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్
విజయవాడ : అధికార పార్టీ నేతల కుట్ర తోనే అమలాపురం లో విధ్వంసం జరిగిందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ ఆరోపించారు. రాష్ట్రంలో మానవ హక్కులను సైతం హరిస్తారా? అని ప్రశ్నించారు. నియంత పాలన తో ప్రజల సహనాన్ని ఇంకా పరీక్షించ వద్దని హెచ్చరించారు. పోలీసులతో అరెస్టు చేయించి ఇప్పుడు తమను ఆపైనా మరోసారి తప్పకుండా అమలాపురం వెళ్లి తీరుతామని శైలజ నాథ్ స్పష్టం చేశారు.
విజయవాడ నుంచి బుధవారం కాంగ్రెస్ నేతలు చేపట్టిన “చలో అమలాపురం” కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ సహా ఆ పార్టీ నాయకులు రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద జగజ్జీవన్ రాం విగ్రహానికి నివాళులర్పించి అమలాపురం బయల్దేరారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి మాచవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అంబేడ్కర్ పేరును కోనసీమకు పెడితే నేరం అన్నట్లుగా కొంతమంది ప్రవర్తిస్తున్నారని శైలజానాథ్ మండిపడ్డారు. జిల్లా ఏర్పాటు చేసిన నెల తర్వాత కోనసీమ జిల్లా పేరు మారుస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపించారు.అధికార పార్టీ నేతల కుట్రతోనే అమలాపురంలో విధ్వంసం జరిగిందన్నారు. సామాజిక న్యాయ భేరి యాత్ర పేరుతో ఒరగ బెట్టిందేమిటని ఎద్దేవా చేశారు. వైఎస్సాఆర్, ఎన్టీఆర్ పేర్లకు లేని అభ్యంతరం అంబేడ్కర్‌కే ఎందుకని నిలదీశారు. అమలాపురం వెళ్లేందుకు మాకు ఆటంకాలు కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము అమలాపురం వెళితే ప్రభుత్వానికే మేలు జరుగుతుందని, అక్కడ సోదరులతో మాట్లాడి శాంతి కోసం ప్రయత్నం చేస్తామన్నారు. తమని ఆపితే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉందన్నారు. తమను అమలాపురం వెళ్లనివ్వాలని శైలజానాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆపారు కానీ, మరోసారి తప్పకుండా వెళ్లి తీరుతామని శైలజనాథ్ స్పష్టం చేశారు. దేశాన్ని కాపాడడానికి బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని, జగన్ రెడ్డి కుట్రలను, దౌర్జన్యాన్ని ఎదుర్కొంటామని అన్నారు.
అంబేద్కర్ గౌరవాన్ని మంట గలిపారు : కొరివి వినయ్ కుమార్
అమలాపురంలో ఆర్ ఎస్ ఎస్, బీజేపీ, భజరంగ్ దళ్ కు చెందిన మతోన్మాదులు దాడులకు పాల్పడి అంబేడ్కర్ గౌరవాన్ని మంట గలిపారని, ఇది రాజ్యాంగ విరుద్ధం అని కొరివి వినయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పు పెట్టినప్పటికీ పోలీసులు నిర్వీర్యం కావడం కుట్ర కాదా ? అని ప్రశ్నించారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. ఈ ఘటనలకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.