– దిగజారుతున్న రాజకీయాలు
– ‘భీమ్లానాయక్’కు తెలంగాణలో మినహాయింపు
– ఆంధ్రాలో థియేటర్లకు వేధింపులు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హుందాతనం కరిగిపోయి, నానాటికీ దిగజారుతుండటం ప్రజాస్వామ్య ప్రియులను ఆందోళనపరుస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కనిపించిన కనీస విలువలు, ఇప్పుడు విభజిత రాష్ట్రంలో భూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదు. ప్రధానంగా రాజకీయపార్టీల మధ్య విబేధాలు, శత్రువుల స్థాయికి చేరాయన్న ఆవేదన వ్యక్తమవుతోంది. వ్యక్తిగత అంశాలను కూడా రాజకీయ దృష్టితో చూడటం వల్లే ఈ సమస్య ఏర్పడిందన్నది రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య. ఈ విషయంలో ఏపీ నేతలతో పోలిస్తే.. తెలంగాణ నాయకుల వ్యవహారశైలి భిన్నంగా, ఆదర్శంగా కనిపిస్తోంది.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ సినిమా ఈనెల 25న విడుదల కానుంది. ఇంకా సినిమా రేట్ల వ్యవహారం ఖరారు కానందున, ఏపీలో పాతరేట్ల ప్రకారమే టికెట్లు అమ్మాలని, అదనపు షోలు ప్రదర్శించకూడదని ప్రభుత్వం
స్పష్టం చేసింది. మంచిదే. దానిని ఎవరూ తప్పు పట్టాల్సిన పనిలేదు. కానీ, సినిమా విడుదలయిన తర్వాత సమీక్షించాల్సిన అంశాలన్నీ విడుదలకు ముందే అమలుచేసి, థియేటర్ల యజమానులను వేధించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భీమ్లానాయక్ సినిమా విడుదలయ్యే థియేటర్లపై, అధికార యంత్రాగం ఇప్పటినుంచే నిబంధనల కొరడా ఝళిపించడమే దానికి కారణం. సినిమా ఎగ్జిబిటర్లతో అధికారులు ముందస్తు సమావేశం నిర్వహించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధరలు ఉండాలని ఆదేశించారు. పాత ధరలకే టికెట్లు అమ్మాలని మరికొన్ని జిల్లాల్లో, అధికారులు ఎగ్జిబిటర్లకు ఫోన్లు చేసి హెచ్చరిస్తున్నారు. తినుబండారాలు, థియేటర్లలో సౌకర్యాలపై తనిఖీలు నిర్వహిస్తున్నారు.
నిజానికి సినిమా విడుదలకు ముందే ఇన్ని ఒత్తిళ్లు చేయాల్సిన అవసరం లేదు. విడుదల సమయంలో ఎగ్జిబిటర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే, వారిపై చర్యలు తీసుకోవచ్చు. కానీ ప్రభుత్వంపై పవన్ యుద్ధం చేస్తున్నారు కాబట్టి, ఆయన నటించిన భీమ్లానాయక్ సినిమాపై ఆంక్షలు విధించడం ద్వారా, ఆయన నిర్మాతలను ఆర్ధికంగా దెబ్బకొట్టవచ్చన్న వ్యూహం, ప్రభుత్వ చర్యల్లో స్పష్టంగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సరిగ్గా భీమ్లానాయక్ సినిమా ఎగ్జిబిటర్లపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన రోజునే.. హైదరాబాద్‌లో తెలంగాణ మంత్రి కేటీఆర్,
తలసాని సమక్షంలో అదే భీమ్లానాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ కార్యక్రమం ముగిసేంత వరకూ కేటీఆర్-తలసాని ఇద్దరూ పవన్‌తోనే కనిపించారు. అంతేకాదు. అదే సినిమాను తెలంగాణ రాష్ట్రంలో రెండు వారాలపాటు 5 షోలు నిర్వహించుకునేందుకు, తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది.
ఈ నేపథ్యంలో పవన్ సినిమా వ్యవహారంపై, ఏపీలో సహజంగానే రాజకీయ చర్చకు తెరలేచింది. ఈ సందర్భంగా గత ఎన్నికలకు ముందు కేసీఆర్-పవన్ మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. కేసీఆర్‌ను పవన్ తాటతీస్తానని
హెచ్చరించడం, దానిపై ఆగ్రహించిన కేసీఆర్ కూడా, పవన్‌పై పరుష పదజాలం వాడిన వైనం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే.. తనను అంత ద్వేషించిన పవన్ సినిమాలను, జగన్ మాదిరిగానే కేసీఆర్ కూడా అడ్డుకునే అధికారం-అవకాశం ఉంది.
కానీ, కేసీఆర్ వాటి గురించి పట్టించుకోకుండా హుందాతనంతో వ్యవహరించి, పవన్ సినిమాలకు విడుదల రోజున వెసులుబాటు
అప్పటి నుంచీ ఇస్తూనే ఉన్నారు. అదే విధంగా తన రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబు బావమరిది బాలకృష్ణ నటించిన సినిమాలకూ, కేసీఆర్ అదే విధానం అవలంబిస్తున్నారు. మధ్యలో వారు కేసీఆర్‌ను స్వయంగా కలసి, ఆయనతో భోజనం కూడా చేసిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలకు అదనపు షోలకు అనుమతించినందుకు, అటు ప్రభుత్వానికీ ఆదాయం వస్తుందన్న ముందుచూపే కేసీఆర్ నిర్ణయానికి కారణంగా కనిపిస్తుంది.
సినిమా వ్యవహారాలను పక్కకుపెడితే.. రాజకీయ అంశాల్లో కూడా తెలంగాణ నాయకులు, శత్రుభావన చూపించే దాఖలాలు తక్కువే. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం కేసీఆర్‌పై రాజకీయ యుద్ధం చేస్తున్న వారిలో ఒకరు. ఆ క్రమంలో టీఆర్‌ఎస్ నేతలు కూడా కోమటిరెడ్డిపై ఎదురుదాడి చేస్తున్నారు. అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో కలసిన కేసీఆర్-కోమటిరెడ్డి ఆ
విషయాలు మర్చిపోయి, ఆలింగనం చేసుకున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. గత అసెంబ్లీలో విపక్షనేత జానారెడ్డిని కేసీఆర్.. ‘పెద్దలు జానారెడ్డి గారు చెప్పినట్లు’ అని సంబోధించారు. అదే సభలో కేసీఆర్ సర్కారు విధానాలపై, జానారెడ్డి విరుచుకుపడేవారు.
కేసీఆర్‌కు సన్నిహితుడైన మైహోం రామేశ్వర్‌రావుపై బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తుంటారు. కానీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీలో..
చినజీయర్‌స్వామి వెంట ఉన్న అదే రామేశ్వరరావును తన వెంట తీసుకుని అమిత్‌షా, రాజనాధ్‌సింగ్‌ను
కలిపించారు.మొన్నటిరకూ కేసీఆర్‌పై విరుచుకుపడిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఓ సందర్భంలో టీఆర్‌ఎస్ వర్కింగ్
ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలసి ముచ్చటించిన వైనం సంచలనం సృష్టించింది.
ఇక కేసీఆర్‌పై తిరుగుబాటు చేసి, ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్ధిని ఓడించిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్.. ఇటీవల ఓ పెళ్లి కార్యక్రమంలో అదే టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావుకు తారసపడ్డారు. కేశవరావు చొరవ తీసుకుని, ఈటల మాస్కు తీయించి
బుగ్గ పట్టుకుని కాసేపు తమాషా చేశారు. ఇది సోషల్‌మీడియాలో కూడా వైరల్ అయింది. ఆ సమయంలో వారిద్దరూ ప్రత్యర్ధి పార్టీల నాయకులమని భావించలేదు. తెలంగాణలో నాయకుల ఇళ్లలో జరిగే పెళ్లిలు, చావులకు పార్టీలతో సంబంధం లేకుండా వచ్చి హాజరవుతుంటారు. ఇవన్నీ రాజకీయాల్లో హుందాతనానికి నిదర్శనంగా నిలిచేవే. ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు ఏపీలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు.
అసలు ఏపీలో రాజకీయాలు, జుగుస్పాకరంగా, హుందాతనం లోపించాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్ధులను శత్రువులుగా భావించి, వారి ఆర్ధికమూలాలు దెబ్బతీసే చెడు సంప్రదాయం కొనసాగడం.. ప్రజాస్వామ్యానికి
శోభనివ్వదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్ధుల కార్యాలయాలు, రాజకీయ ప్రత్యర్ధులపై భౌతిక దాడులు, గిట్టని వారి వ్యాపారాలను దెబ్బతీసి, వాటిని బలవంతంగా స్వాధీనం చేసుకునే చర్యలతో, ఏపీ రాజకీయాలు భ్రష్టుపడుతున్నాయన్న ఆవేదన వ్యక్తమవుతోంది.