– అడ్డంకులు అధిగమించి అమరావతి నుంచి తిరుపతి వరకూ..
– ‘అన్యాయం’పె న్యాయదేవత తీర్పు వరకూ అమరావతి ప్రస్థానం
( మార్తి సుబ్రహ్మణ్యం)
మా భూములు తీసుకోండి. రాజధాని కోసం మూడుపంటలు పండే భూములిస్తాం..
మేం భూములివ్వం. మా నుంచి బలవంతంగా లాక్కుంటే సహించం..
రాజధాని కోసం భూములిచ్చిన మీరంతా చరిత్రలో నిలిచిపోతారు. ఐదు పైసలు ఖర్చు లేకుండా ఒక రాజధాని నిర్మిస్తున్న చరిత్ర ప్రపంచంలోనే అద్భుతం. మీరు భూములిచ్చింది చంద్రబాబునాయుడుకు కాదు. రాష్ట్ర రాజధాని నగర నిర్మాణానికి. మీ త్యాగం ఆంధ్రరాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన, తెలుగుదేశం పార్టీ పక్షాన అందరికీ పాదాభివందనం..
అమరావతి నగరం దేశంలోనే అతి పెద్ద నగరంగా వర్ధిల్లాలి. ఢిల్లీకి మించిన నగరం నిర్మాణం కావాలి. దీనికోసం కేంద్రం తనవంతు సాయం చేస్తుంది. ప్రధానిగా ఇది నా మాట.
అది అమరావతి కాదు. ‘కమ్మ’రావతి. అదో రియలఎస్టేట్ వ్యాపారుల స్వర్గం..
అది అమరావతి కాదు. భ్రమరావతి..
శ్మశానం తప్ప అక్కడ ఏముంది?
మీకు భూములు ఎవరు అమ్మారు? పత్రాలు పట్రండి. సబ్ రిజిస్ట్రార్లంతా సీఐడీకి వివరాలు ఇవ్వాల్సిందే..
అసలు శాసనరాజధాని కూడా అక్కడ వద్దని సీఎంకు చెబుతాం..
లం.. కొడుకులు.. టీ షర్టులు, జీన్సు ఫ్యాంట్లూ వేసుకుని చేసుకునే ఉద్యమం కూడా ఒక ఉద్యమమేనా?..
అమరావతిలో జరిగేది పెయిడ్ ఆర్టిస్టుల ఉద్యమం..
అంత ఖరీదైన పట్టు చీరలు కట్టుకుని ఉద్యమాలు చేస్తారా?
ప్రభుత్వం మనసు కరిగించి, అమరావతిలోనే రాజధాని ఉండేలా చూడు వెంకటేశా…
ఇవీ.. నరేంద్రమోడీ చేతులమీదుగా శంకుస్థాపన జరిగిన అమరావతి రాజధాని నగరానికి సంబంధించిన తీపి-చేదు జ్ఞాపకాలు. కానీ ఇప్పుడక్కడ కనిపించేవన్నీ.. సగంలో ఆగిన నిర్మాణాలు, మట్టిదిబ్బలే. అసలు ప్రధాని శంకుస్థాపన చేసిన తర్వాత కొన్నిరోజులు నిర్విఘ్నంగా వెలిగిన దీపజ్యోతి స్థలంలో.. ఇప్పుడు బీరుబాటిళ్లు, చెత్తచెదారం. ఈ నామర్దా ఎవరిది? అవమానం ఎవరికి? శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీకా? ఆయనను పిలిచిన నాటి సీఎం చంద్రబాబుకా? దేశంలో వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన చల్లిన పవిత్ర జలాలదా? తమ వద్ద రాజధాని వస్తే భూములకు మంచి రేట్లు వస్తే బాగుపడతామన్న ఆశతో భూములిచ్చిన రైతులకా? ప్రభుత్వం మారిన తర్వాత కమ్మోరి మీద ఉన్న కసితో, అమరావతి ఆయువు తీసేసిన ఇప్పటి సీఎం జగన్‌కా? అసలు అప్పుడే శాశ్వత భవనాలు నిర్మించని నాటి సీఎం చంద్రబాబుకా? తప్పెవరిది?.. ఇదో పెద్ద రచ్చ లాంటి చర్చ. కాబట్టి కాసేపు దాన్నలా వదిలేద్దాం.
మూడేళ్ల నుంచి అక్కడ మగ్గిపోయిన రాజధాని అమరావతి బదులు, మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చిన జగనన్న సర్కారుపై, 800 రోజులకు పైగా అవిశ్రాంతంగా పోరాడుతున్న అమరావతి రైతుల ఓపిక-పోరాట పటిమకు జోహార్లర్పించాల్సిందే. అఫ్‌కోర్స్… అమరావతి ఉద్యమం ఆ పరిమిత గ్రామాలు దాటి, గుంటూరు సిటీని కూడా తాకకపోవచ్చు. ఆంధ్రా ప్రజల్లో చైతన్యం చేవచచ్చి, 2 వేలకు ఓటుకు నోటుతో చేష్టలుడిగిపోవచ్చు. సంక్షేమ పథకాల మాయలో చచ్చుబడిపోయి ఉండవచ్చు. సోషల్‌మీడియాలో మాత్రమే ప్రభంజనంలా కనిపించవచ్చు.
కానీ.. అమరావతి ఉద్యమకారులు వ్యూహాత్మకంగా ఇప్పటివరకూ చేసిన న్యాయపోరాట వ్యూహమే వీటన్నింటికంటే గొప్పది. అఫ్‌కోర్స్.. వారి వెనుక ఒక చంద్రబాబు, ఒక సుజనాచౌదరి ఉండవచ్చు. అమరావతికి అన్యాయంపై రోజూ సొంత సర్కారుపై సమరనినాదం చేస్తున్న రఘురామకృష్ణంరాజు, అమరావతికి అనుకూలంగా తీర్మానం చేయించిన నాటి కమల దళపతి కన్నా లక్ష్మీనారాయణ వంటి
నేతల నైతిక- ప్రత్యక్ష రాజకీయ మద్దతు ఉండవచ్చు. కమ్యూనిస్టులూ, కాంగ్రేసీయుల దన్ను ఉండవచ్చు.ఒక కొలికపూడి శ్రీనివాసరావు.. ఇంకో సుంకర పద్మశ్రీ, మరో వెలగపూడి గోపాలకృష్ణ.. ఒక బాలకోటయ్య వంటి యోధుల ప్రత్యక్ష భాగస్వామ్యం ఉండవచ్చు. వీటికి మించి ప్రధాన పత్రికలు, చానెళ్లు
ఆక్సిజనూ ఇచ్చి ఉండవచ్చు. కానీ.. అన్నేళ్లు పోరాడేందుకు ఓపిక కూడా ఉండాలి కదా?! ఆ సహనమే ఇప్పుడు గెలిచింది.
పైన సుప్రీంకోర్టు కూడా ఉంది కాబట్టి…తాజా హైకోర్టుదే అంతిమతీర్పు కాకపోవచ్చు. కానీ.. సహనంతో నిలబడి-సర్కారుతో కలబడి, సివంగుల్లా సర్కారు దాష్టీకంపై శిగ కట్టి..కొంగు బిగించి, ఖాకీల లాఠీలతో కుళ్లబొడిపించుకుని కదనరంగంలో దిగిన నారీలోక సమర నినాదమే ‘న్యాయస్థానం టు దేవస్థానం’ ఎపిసోడ్‌లో మరపురాని ఘట్టం. న్యాయం చేయాలంటూ మోకాళ్లమీద నిలబడి దీనంగా అర్ధించిన మహిళల నిరసన, న్యాయం చేసినందుకు మళ్లీ అదే మోకాళ్ల మీద నిలబడి న్యాయదేవతకు చెప్పిన అవే కృతజ్ఞతల దృశ్యాలు చిరస్మరణీయం.
ఈ మొత్తం ‘ఆగిన అమరావతి రాజధాని’ ప్రస్థానం.. ‘ఆపవద్దన్న కోర్టు తీర్పు’ వరకూ జరిగిన వివిధ ఘట్టాలపై సింహావలోకనం ఇది.
2014, సెప్టెంబరు 3: గుంటూరు – విజయవాడల మధ్యన కొత్త గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నిర్మాణానికి శాసనసభ ఏకగ్రీవ తీర్మానం.
2014 అక్టోబరు 25: తుళ్లూరు, రాయపూడి, నేలపాడులో గుంటూరు, గురజాల ఆర్‌డీవోలు, తుళ్లూరు, తెనాలి తహసీల్దార్లు సంయుక్తంగా గ్రామసభల నిర్వహణ.
2014 నవంబరు 12 నుంచి 30 వరకు: తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరిలోని గ్రామాల రైతులతో అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి వరుస గ్రామసభల నిర్వహణ.
2014 నంబరు 17: హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథిగృహంలో అప్పటి సీఎం చంద్రబాబుతో రాజధాని రైతుల సమావేశం.
2014 డిసెంబరు 12: రాజధాని కోసం భూములు సమీకరించేందుకు ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌ని ప్రకటించిన నాటి సీఎం చంద్రబాబు.
2014 డిసెంబరు 23: ఏపీసీఆర్‌డీఏ చట్టం ఆమోదించిన అసెంబ్లీ.
2014 డిసెంబరు 30: రాజధాని నగర నిర్మాణం కోసం ఏపీసీఆర్‌డీఏ ఏర్పాటు.
2015 జనవరి 1 నుంచి 10వ తేదీ మధ్యన: ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌కి కాంపిటెంట్ అథారిటీల నియామకం. 29 గ్రామాల్లో ఎల్‌పీఎస్ నోటిఫికేషన్.
2015 జనవరి 1: ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్రారంభం
2015 ఫిబ్రవరి 28 : 20,510 రైతులు స్వచ్ఛంధంగా ముందుకొచ్చి 32,469 ఎకరాల భూమి ప్రభుత్వానికి స్వాధీనం.
2015 మార్చి 30: సింగపూర్ ప్రభుత్వం రాజధాని పరస్పెక్టివ్ ప్లాన్ నివేదన
2015 మే 25: రాజధాని నగర మాష్టర్ ప్లాన్‌ని నివేదించిన సింగపూర్ ప్రభుత్వం
2015 జూలై 20: సీడ్ క్యాపిటల్ డెవలప్‌మెంట్ ప్లాన్‌ని నివేదించిన సింగపూర్ ప్రభుత్వం.
2015 అక్టోబరు 22: అమరావతి రాజధానికి ఉద్ధండ్రాయునిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన
2016 ఫిబ్రవరి 17: వెలగపూడిలో తాత్కాలిక ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన.
2016 ఏప్రిల్ 25: లాంఛనంగా తాత్కాలిక ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్‌లో ఒక ఆఫీసు ప్రారంభం.
2016 జూన్ 25: నేలపాడులో తొలి రిటర్నబుల్ ప్లాట్ పంపిణీ
2016 అక్టోబరు 28: శాశ్వత ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్‌కు కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ చేతుల మీదగా శంకుస్థాపన.
2017 ఫిబ్రవరి 2: అమరావతి రైతులకు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు
2017 మార్చి 6: వెలగపూడి అసెంబ్లీలో తొలి సెషన్ ప్రారంభం.
2019 డిసెంబరు 17: మూడు రాజధానులను అసెంబ్లీలో ప్రకటించిన సీఎం జగన్.
2019 డిసెంబరు 17: సీఎం ప్రకటనపై నిరసన తెలుపుతూ ఉద్యమ బాట పట్టిన రాజధాని ప్రాంత రైతులు.
2020 జనవరి 20 : అమరావతి రైతుల ఛలో అసెంబ్లీ ద్వారా నిరసన.
2021 నవంబరు 1 : అమరావతి రైతుల న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర ప్రారంభం.
2021 డిసెంబరు 14: అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు.
2022 మార్చి 3: అమరావతిని యథాతథంగా ఉంచాలని హైకోర్టు తీర్పు.