• పెట్టుబడులు రావాలంటే లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలి
• రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ.. సుస్థిర పాలన కూటమి ప్రభుత్వ బాధ్యత
• గత ప్రభుత్వ చీకటి రోజులను స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో ఎదుర్కొన్నాం
• దేశంలో అంతర్గత సుస్థిరత దెబ్బ తీసేవారిపై ఓ కన్నేసి ఉంచాలి
• విదేశీ శక్తుల అజెండాను మోస్తున్న వారిపట్ల అప్రమత్తత అవసరం
• అంతర్గత శత్రవులను ఓ కంట కనిపెట్టాలి
• ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తాం
• ఏడాది పాలనలో సూపర్ సిక్స్ అమలు చేశాం
• వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర ప్రగతిని మరింత పరుగులు పెట్టిస్తాం
• కాకినాడలో నిర్వహించిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
కాకినాడ: ‘రాష్ట్రం అభివృద్ధి జరగాలి.. సూపర్ సిక్స్ పథకాలు నిరాటంకంగా అమలుకావాలి.. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలి. అందుకు సుస్థిరతతో కూడిన పాలన అవసరం. కూటమి ప్రభుత్వానికి శాంతి భద్రతల నిర్వహణ మీద, దేశ సుస్థితర మీద సమగ్ర అవగాహన ఉంది. దేశం లోపల అంతర్గత సుస్థిరతను దెబ్బ తీసేవారిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. ఈ విషయంలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాల’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, అర్.డబ్ల్యూ.ఎస్, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఉన్న చీకటి రోజులను స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో ఎదుర్కొన్నామన్నారు. విభజించు.. పాలించు అన్న బ్రిటీష్ రూల్ ని వారు అమలు చేస్తే.. కూటమి ప్రభుత్వం స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో యునైటెడ్ రూల్ అమలు చేస్తోందని తెలిపారు. కలిసి పాలన చేస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి–సంక్షేమాలను రెండు కళ్లుగా ముందుకు తీసుకువెళ్తోందని చెప్పారు. కాకినాడలో నిర్వహించిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జాతీయ జెండాను ఆవిష్కరించి, వందనం సమర్పించారు. జిల్లా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ పరేడ్ ను తిలకించారు. వివిధ శాఖల శకట ప్రదర్శన, చిన్నారుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, విన్యాసాలు తిలకించారు. అనంతరం వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు ఉత్తమ సేవా పతకాలు అందజేశారు. కాగా, పవన్ కల్యాణ్ తో కలిసి వేడుకలకు హాజరైన ఆయన సతీమణి అనా కొణిదల అతిథుల గ్యాలరీ నుంచి ఈ వేడుకలను ఆసక్తిగా తిలకించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “ప్రతి ఒక్కరి జీవితాల్లో చీకటి రోజులు వస్తాయి. రాష్ట్రం కూడా 2019 నుంచి 2024 వరకు అలాంటి చీకటి రోజులను ఎదుర్కొంది. గత పాలకులు బ్రిటీషర్ల మాదిరి రాష్ట్రాన్ని తమ కబంధ హస్తాల్లో పెట్టుకుంటే.. స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో ఎదుర్కొన్నాం. ఆగస్టు 15ని ప్రతి ఒక్కరు గుండెల్లోతుల నుంచి స్వీకరించాలి. దేశ విభజన సమయంలో లాహోర్ పాకిస్థాన్ లో అంతర్భాగం అవుతుందని ఎవ్వరికీ తెలియదు.
సడెన్ గా లాహోర్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు మత ప్రాతిపదికన అక్కడ ఉన్న హిందువులను పంపివేసిన సమయంలో ఎన్నో దారుణాలు జరిగాయి. తమది అనుకున్న ప్రాంతం రాత్రికి రాత్రి పరాయి ప్రాంతం అయిపోతే ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవాల్సి వచ్చింది. స్వాతంత్య్ర చాలా తేలికగా అహింసా మార్గంలో సాధించుకున్నామని అనుకుంటాం. కానీ స్వాతంత్య్రం రావడానికి చాలా హింస జరిగింది. మనం ఎంచుకున్న విధానాలు అహింసా విధానాలు కావచ్చు. దేశం నుంచి విడిపోవాలి అనుకున్న వారు మాత్రం హింసనే నమ్మారు.
లౌకిక వాదం మన సంస్కృతిలో భాగం
దేశ విభజన జరిగిన నాటి నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు మత ప్రాతిపదికన హింస జరుగుతూనే ఉంది. భారత దేశం తన లౌకిక విధానాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. దేశ విభజన జరిగిన తర్వాత మతానికి సంబంధం లేకుండా భారత దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించి లౌకిక వాదాన్ని ముందుకు తీసుకువెళ్లింది. డాక్టర్ అబ్దుల్ కలాం గారి లాంటి వారిని అత్యున్నత పదవిలో కూర్చోబెట్టింది. ఆ పరిస్థితులు పాకిస్థాన్ దేశంలో లేవు. పాకిస్థాన్ లో ఒక హిందూ క్రికిటర్ గా ఉంటే తప్పించేస్తారు.
హిందువుల్లో ఒక బలమైన నాయకుడు కూడా ఆ దేశంలో కనబడడు. మత ప్రాతిపదికన రెండు దేశాలుగా విడిపోయినా, భారత దేశంలో అధిక సంఖ్యలో హిందువులు ఉన్నా అన్ని మతాల వారిని గౌరవించి ముందుకు తీసుకువెళ్లే సంస్కృతి మనది. లౌకిక విధానం అనేది భారత దేశ సంస్కృతిలోనే ఉంది. ఆ సంస్కృతిని పరాయివారు, యూరోపియన్లు మనకు నేర్పించవలసిన అవసరం లేదు. ఈ స్ఫూర్తిని మనమంతా ముందుకు తీసుకువెళ్లాలి. మహిళలు చేసిన త్యాగాలకు పెద్దపీట వేసి ఆ స్ఫూర్తిని మేం ముందుకు తీసుకువెళ్తాం.
అంతర్గత సుస్థిరతను దెబ్బతీసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి
అవినీతి ఉన్న చోట దేశం బలహీనపడుతుంది. అలాంటి పరిస్థితులు ఉండకూడదనే మేం ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు ఎరుకతో నిరంతరం పహారా కాస్తేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. మన దేశాన్ని మనం రక్షించుకోవాలంటే ప్రజలంతా నిరంతర పహారా మనస్థత్వం కలిగి ఉండాలి. కశ్మీర్ లో సింధూర్ ఆపరేషన్ కి మనకి సంబంధం ఏంటి అనుకోకూడదు. పెహల్గాంలో విశాఖకు చెందిన వ్యక్తిని, కావలికి చెందిన వ్యక్తిని ఉగ్రవాదులు చంపేశారు. దానికి బలంగా బదులిచ్చాం. అయితే దేశంలో లోపల అంతర్గత సుస్థితరతను దెబ్బతీసే వారిపై కూడా మనమంతా దృష్టి సారించాలి. ప్రతిసారి పోలీసు అధికారుల పేరు చెప్పేకంటే ఇది ప్రతి పౌరుడి బాధ్యత అని నేను అంటాను. నేను నా వంతు బాధ్యత నిర్వహిస్తున్నాను. ప్రజలు వారి బాధ్యత వారు బాధ్యత నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సుస్థిర పాలన కావాలంటే కూటమి 15 ఏళ్లు ఉండాలి… అభివృద్ధి సాధించాలి. సూపర్ సిక్స్ అమలు కావాలి. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలి. లా అండ్ ఆర్డర్ బలంగా లేకపోతే పెట్టుబడులు రావు. ఉత్తరప్రదేశ్ కి శ్రీ యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాక ఆ రాష్ట్రం రూ. 15 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది. ఆయనకి ముందు ఆ రాష్ట్రం అన్ రూలీ స్టేట్ గా ఉండేది. పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ సాహసించేవారు కాదు. లా అండ్ ఆర్డర్ అనేది చాలా బలంగా ఉండాలి. దాని వల్లే యూపీకి రూ. 15 లక్షల పెట్టుబడులు వచ్చాయి.. ఆంధ్రప్రదేశ్ కి లా అండ్ ఆర్డర్ చాలా క్లిష్టమైంది. సుస్థిరతతో కూడిన పాలన ప్రజలకు ఇవ్వాలనే పదే పదే కూటమి ప్రభుత్వం దశాబ్దంన్నర ఉండాలని కోరుకుంటున్నాను. పదవుల్లో కూర్చుని దాన్ని ఆస్వాదించాలన్న కోరిక నాకు లేదు.
ఓడిన ప్రతిసారీ ఓట్ చోరి అంటున్నారు
జాతీయ స్థాయి నుంచి ప్రతిపక్ష నాయకులు ఓడిన ప్రతిసారి ఓట్ చోరీ అని ప్రచారం చేస్తున్నారు. గెలిచినప్పుడు వారికి వారికి ఓట్ చోరి కనబడదు. వాళ్లు గెలిచిన సమయంలో మేం ఎక్కడా ఆ మాట అనలేదు. 2024లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు 164 సీట్లు ఇస్తే ఈవీఎంలలో తేడా ఉన్నట్టు. వీరికి గెలిచిప్పుడు ఒక న్యాయం.. ఓడినప్పుడు ఇంకో న్యాయం.
జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒకటే విధానం. మన దేశంలో అంతర్గత అస్థిరత సృష్టించడం శత్రుదేశాల విధానం. వీరు మాట్లాడుతున్న మాటలను అంతర్జాతీయ కుట్రలో భాగంగా చూడాలి. ఒక కోటని కొట్టాలంటే బయట నుంచి కంటే లోపల ఉన్నవాడు తలుపు తీస్తే తేలికగా దెబ్బకొట్టవచ్చు. విదేశీ శక్తులు కూడా దేశంలో తమకు సహకరించే అంతర్గత శత్రువులు ను వెతుక్కుని వారికి సమాచారం ఇవ్వాలన్న ఆలోచన చేస్తాయి. విదేశీ శక్తుల అంజెండానే వీరు మోస్తున్నారు. ప్రజలు దాన్ని గమనించాలి.
మేం సద్విమర్శను స్వీకరిస్తాం
2019 నుంచి 2024 మధ్య ప్రజలంతా చూశారు. ఒక్కో సందర్భంలో రోడ్డు మీదకు రావాలంటేనే భయాలు ఉండేవి. కూటమి ప్రభుత్వాన్ని తిట్టేందుకు ఎవరూ భయపడడం లేదు. మేం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం. కూటమి పాలనలో సద్విమర్శను స్వీకరించే పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో విమర్శ చేయాలన్నా భయపడే వారు. పోలీసు అధికారులు డ్యూటీ చేయడానికి భయపడే వారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేసుకున్నారు. ఇలాంటి పరిస్థితులు విదేశీ శక్తులకు ఆలవాలంగా మారతాయి. 79వ స్వాతంత్య్ర దినోత్సవ శుభసందర్భంగా నేను కోరేది ఒకటే. అంతర్గత శత్రువులను ఒక కంట కనిపెట్టాలి.
డీజిల్ దగ్గర వదిలేస్తే.. వెపన్స్ వరకు పాకొచ్చు
కాకినాడ పోర్టు విషయంలో గొంతు ఎత్తడానికీ కారణం ఉంది. రాష్ట్రానికి 974 కి.మీ. సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. ఇది రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకువస్తుంది. ఒక్కోసారి అదే బలహీనత కూడా అయిపోతుంది. ముంబైలో దాడులకు పాల్పడిన ముష్కరులు ఏ మాత్రం పర్యవేక్షణ లేని పోర్టుల నుంచే వచ్చేశారు. ఆర్డీఎక్స్ లు ఆ పోర్టుల నుంచే వచ్చేశాయి. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై పోలీస్ శాఖ బలంగా దృష్టి పెట్టాలి. పెడుతుంది కూడా.
కాకినాడ పోర్టులో అక్రమంగా డీజిల్ రవాణా జరుగుతోంది. దీన్ని బలంగా అడ్డుకోవాలి. ఒకసారి డీజిలే కదా అని వదిలేస్తే.. తర్వాత వెపన్స్, బాంబులు తెచ్చే అవకాశం ఉంటుంది. కూటమి ప్రభుత్వానికి లా అండ్ ఆర్డర్, దేశం తాలూకు సుస్థిరత మీద సమగ్ర అవగాహన ఉంది. అవినీతి ఉన్న చోట దేశం బలహీనపడుతుంది. అలాంటి పరిస్థితులు ఉండకూడదని ప్రయత్నిస్తున్నాం.
స్త్రీ శక్తికి కూటమి ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ సిక్స్ అమలు చేస్తోంది. మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది 67.27 లక్షల తల్లుల ఖాతాల్లో రూ. 8,745 కోట్లు జమ చేసాం. దీపం – 2 పథకం కింద రెండు విడతల్లో 1 కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. 5 ఏళ్లలో ఏడాదికి 3 సిలిండర్లు చొప్పున ఈ పథకం కోసం రూ. 13,423 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. నేటి నుంచి స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాము.
పల్లెల్లో అభివృద్ది పండుగ
పంచాయతీరాజ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ పండుగలకు కేటాయించే నిధులను మైనర్ పంచాయతీలకు రూ.100 నుంచి రూ.10 వేలకు, మేజర్ పంచాయతీలకు రూ. 250 నుంచి రూ.25 వేలకు పెంచి, సర్పంచుల ఆత్మ గౌరవాన్ని కాపాడాం. గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో భాగంగా ఒకే రోజు 13, 326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించాం. పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో 4,000 కి.మీ. సీసీ రోడ్లు, 22,500 మినీ గోకులాలు, 1 లక్ష నీటి కుంటలు, 15,000 నీటి తొట్టెల నిర్మాణం పూర్తి చేశాం. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా 2,000 కి.మి. బీటీ రోడ్లు, 14 కొత్త వంతెనలు నిర్మించాం.
గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 75.23 లక్షల ఉపాధి శ్రామికులకు వారి గ్రామాల్లోనే ఉపాధి కల్పించాం. వారికిచ్చే ప్రమాద పరిహారం రూ.50 వేల నుంచి రూ.4 లక్షలకు పెంచాం. అడవితల్లి బాట కింద కొండ ప్రాంతాలలో రూ.1,005 కోట్లతో 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ, 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రధాన మంత్రి జన్మన్, ఉపాధి హామీ పథకం, రాష్ట్ర నిధులతో శ్రీకారం చుట్టాం. జల్ జీవన్ మిషన్ కింద 5 జిల్లాల్లో 5 కొత్త ప్రాజెక్టులను రూ.7,910 కోట్లతో ప్రారంభించాం. 1 కోటి 20 లక్షల మందికి 30 ఏళ్ల పాటు తాగునీటి భద్రత కల్పించబోతున్నాం.
ఆపరేషన్ కుంకీ.. ఎకో టూరిజం అభివృద్ధి
అటవీ విస్తీర్ణం 30 శాతం నుంచి 37 శాతానికి పెంచే లక్ష్యంతో కోటి మొక్కలు నాటి, జి.ఐ.ఎస్., క్యూఆర్ కోడ్లతో ట్రాకింగ్ ప్రారంభించాం. ఏనుగుల బెడద నివారణకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తీసుకువచ్చాం. కుంకీలతో విజయవంతమైన ఆపరేషన్లు నిర్వహించాం. ఎకో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నాం. అరకులో ఉడెన్ బ్రిడ్జి, నగరవన యోజన కింద రూ. 1,122 కోట్లతో 61 ప్రాజెక్టులు చేపట్టాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.
ఏడాది కాలంలో కాకినాడ జిల్లా పరిధిలో ప్రగతి వీచికలు
కాకినాడ జిల్లా పరిధిలో అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ పథకం ద్వారా 1,50,475 మంది రైతులకు రూ.102 కోట్లు తొలి విడతగా జమ చేశాం. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు 187 ప్రత్యేక బస్సులలో ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. తల్లికి వందనం పథకం ద్వారా 2,79,312 విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి ₹13,000 చేశాం. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న 5,000 యోగా శిక్షకులు, 8 లక్షల మంది ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లా పరిధిలో 2,69,148 లబ్ధిదారులకు ప్రతీ నెలా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద రూ.116 కోట్లు పంపిణీ చేస్తున్నాం.
ఉపాధి హామీ పథకం ద్వారా రూ.118.46 కోట్లు వేతనాలు, రూ. 93.46 కోట్లు మెటీరియల్ ఖర్చుతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాం. గడచిన ఏడాది కాలంలో 107 జాబ్ మేళాల ద్వారా కాకినాడ జిల్లాలో 7,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో స్కిల్ హబ్, పార్లమెంట్ పరిధిలో జేఎన్టీయూ కాకినాడలో స్కిల్ కాలేజీ ప్రారంభించాం. మాదక ద్రవ్యాల నివారణకు పాఠశాలలు, కళాశాలల్లో ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేశాం. జల్ జీవన్ మిషన్ ద్వారా రూ. 497 కోట్ల వ్యయంతో ఇప్పటివరకు 506 పనులు పూర్తి చేశాం. రోడ్లు-భవనాల శాఖ ద్వారా రూ. 27 కోట్లతో రహదారుల గోతులు పూడ్చాం.
గడచిన ఏడాది కాలంలో నా పిఠాపురం నియోజకవర్గంలో రూ.308 కోట్లకుపైగా అభివృద్ధి పనులు చేశాం. దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నాం. వచ్చే నాలుగేళ్లలో మరింత ప్రగతికి కట్టుబడి ఉన్నామని అన్నారు.
ఈ వేడుకల్లో కాకినాడ పార్లమెంటు సభ్యుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడి వెంకటేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, కలెక్టర్ షన్మోహన్ సగిలి, ఎస్పీ బిందు మాధవ్, ఇతర ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.
క్యాన్సర్ బ్లాక్ నిర్మాణానికి శ్రీకారం
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం కాకినాడ జనరల్ హాస్పిటల్ లో రెడ్ క్రాస్ వారి సీఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న క్యాన్సర్ బ్లాక్ కి భవన నిర్మాణానికి పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ప్రారంభించారు. రూ. 6 కోట్ల రెడ్ క్రాస్ నిధులతో ఈ బ్లాక్ ను నిర్మించనున్నారు.