– రైతు సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ఏపీ టాప్
-రికార్డు స్థాయిలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల ఆదాయం
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి
చిన్న జిల్లాలతో ఉన్నతాధికారులు ప్రజలకు మరింత చేరువవుతారనే ఉద్దేశంతో పాత జిల్లాల స్థానే 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి సీఎం జగన్ నవశకానికి నాంది పలికారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా సోమవారం పలు అంశాలపై స్పందించారు.
అధికార వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు మరింత సమర్థవంతంగా సులభతరంగా జరుగుతుందని అన్నారు. ఎవరు వ్యతిరేకించినా 3 రాజధానుల సంకల్పం వెనక లక్ష్యం కూడా ఇదేనని అన్నారు. అభివృద్ధి ఏ ఒక్క వర్గానికో ప్రాంతానికో పరిమితం కాకూడదని అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షని అన్నారు.
రైతుల కోసం దేశంలో మరే ఇతర రాష్ట్రం అమలు చేయనన్ని సంక్షేమ పథకాలు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే అమలు జరుగుతున్నాయని, రైతు సంక్షేమమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తోందని. విత్తు నుంచి విక్రయం దాకా రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని అన్నారు. ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ అందిస్తుందని అన్నారు.
స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు, ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించిందని. 2021-22 లో ఏకంగా రూ.7,327.24 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని అన్నారు. రికార్డు స్థాయిలో 35 శాతం వృద్ధి రేటు నమోదైందని అన్నారు. 2014లో 13.70 లక్షలు మాత్రమే ఉన్న రిజిస్ట్రేషన్లు తాజాగా 20.76 లక్షలు దాటాయని అన్నారు. మార్చిలో రూ.1000 కోట్ల లావాదేవీలు జరిగాయని కోవిడ్ తరువాత స్థిరాస్తి వ్యాపారం ఊపందుకుందని అన్నారు.
సీఎం జగన్ ప్రారంభించిన తల్లీబిడ్డ వాహనాలపై పచ్చ మీడియా ఆర్తనాదాలు మొదలెట్టిందని, ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని తక్కువ చేసి చూపడానికి దురదృష్టవశాత్తూ ఒక వాహనం ప్రమాదానికి గురైతే ఏదో విమానం కూలి నంతగా చంద్రబాబు భజన మీడియా పెడబొబ్బలు పెడుతోందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను సోమవారం ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు దుశ్శాలువతో సత్కరించి తిరుమలేశుని ప్రతిమను అందించారని తెలిపారు.
నేపాల్ ప్రధాని భారతదేశ పర్యటన ఫలవంతంగా జరిగిందని, ఇరు దేశాల ప్రధానులు రైలు సేవలు, రూపే వ్యవస్థను ప్రారంభించడం జరిగిందని, 4 అవగాహన ఒప్పందాలపై సంతకం చేయడం జరిగిందని అన్నారు. శ్రీలంక కూడా సాయం కోసం భారత్ వైపు చూస్తోందిని, పాకిస్తాన్ మనల్ని సహాయం అడిగే రోజు త్వరలో వస్తుందని అన్నారు.