* శాసనమండలిలో వైద్యారోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్
* గత ప్రభుత్వానికి ప్రజారోగ్యంపై చిత్తశుద్ధి లేదని విమర్శ
అమరావతి: రాష్ట్రంలో 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి కోసం రూ.194 కోట్లు వ్యయం చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్ర శాసనమండలి సమావేశాలు గురువారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సత్యకుమార్ సమాధానమిచ్చారు.
అప్పటి ప్రభుత్వం 100 పీహెచ్సీల అభివృద్ధిపనులకు పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చి, చేతులు దులుపుకుంది. అప్పటి ప్రభుత్వానికి ప్రజారోగ్యంపై చిత్తశుద్ధి లేదు. కూటమి ప్రభుత్వం వాటి నిర్మాణాలను ప్రారంభించింది. వందలో 88 కొత్త పీహెచ్సీలకు కొత్త భవనాలను, శిథిలావస్థలో ఉన్న 12 పీహెచ్సీల్లో అభివృద్ధిపనులకు అవసరమైన రూ.194 కోట్లను 15వ ఆర్ధిక సంఘం, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం-అభీమ్) కింద మంజూరయ్యాయి. 46 పీహెచ్సీలను ఆర్.అండ్.బి., మిగిలిన వాటి నిర్మాణాలు ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా చురుకుగా జరుగుతున్నాయి.
ప్రతీ పీహెచ్సీకి ఏడాదికి రూ.11.71 లక్షల వ్యయం
పీహెచ్సీకి అవసరాల కోసం 2,600 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశాం. ప్రతి పీహెచ్సీకి లో 62 రకాల పరీక్షలు జరుగుతున్నాయి. రోగులకు ఉచితంగా 172 రకాల మందులు వీహెచ్సీల ద్వారా అందచేస్తున్నాం. ప్రతి పీహెచ్సీలో మందులు, సర్జికల్స్, ఇతర అవసరాలకు ఏడాదికి రూ.11,71,560 వరకు ఖర్చు పెడుతున్నాం. విలేజ్ హెల్త్ క్లినిక్కుల నుంచి ఉన్నత స్థాయి ఆసుపత్రుల వరకు రోగులకు ఉత్తమ సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ వివరించారు.