– పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు
చేవెళ్ల: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణమే ధ్యేయంగా పెట్టుకొని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పార్టీ కోసం కష్టపడాలని పోలిట్ బ్యూరో సభ్యులు , జాతీయ ప్రధాన కార్యదర్శి , షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు పిలుపునిచ్చారు.
ఇందులో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ నియోజకవర్గంలోని నాయకులను , క్రియాశీల కార్యకర్తలను కలిసి వారిలో నూతన ఉత్సవం నింపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలను , అన్ని వర్గాలను అభివృద్ధి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం అన్నారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు, జాతీయ పార్టీ అధ్యక్షులు , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిక్షణం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం , పేద ప్రజల సంక్షేమం కోసం , వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డారన్నారు. దేశంలో ఎక్కడా లేని ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చి పేద ప్రజలను ఆదుకోవడంతోపాటు వారికి ఉపాధి కల్పించి వారి కుటుంబాలకు అండగా నిలబడ్డారన్నారు .
కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ వెన్నుముక
ఎంతోమంది నాయకులు ఎన్నో ప్రయోజనాలు పొంది , పదవులు అనుభవించి పార్టీ మారినా , కార్యకర్తలు అహర్నిశలు పార్టీ కోసం కష్టపడి ఉభయ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా నిలిచారన్నారు. రాబోయే రోజుల్లో సీనియర్ నాయకులు , కార్యకర్తలను గుర్తించి వారిని గౌరవించడంతోపాటు యువతను ప్రోత్సహించి పార్టీ పునర్నిర్మానంలో భాగం చేస్తామన్నారు. త్వరలో జరగబోయే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని విభాగాల నాయకులను ,కార్యకర్తలను యువతను కలుపుకొని ప్రజలలోకి వెళ్లి గతంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణకు ఎటువంటి అభివృద్ధి చేసిందో వివరిస్తామన్నారు.
కార్యకర్తకు సన్మానం
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఎటువంటి పదవి , ప్రయోజనం ఆశించకుండా పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న నియోజకవర్గంలోని రొంపల్లి గ్రామ అధ్యక్షుడు నరసింహారెడ్డిని శాలువాతో బక్కని నరసింహులు ఘనంగా సత్కరించారు. నరసింహారెడ్డిని ఆదర్శంగా తీసుకొని నాయకులు , కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కోసం కష్టపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పరి ప్రసాద్ , గొడుగు పండు, బంతారాం నరసింహులు, జంగయ్య, జకిల్, కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు