– మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో అనేక రంగాలు ఎంతో అభివృద్ధి చెందాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్ లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మహిళా విద్యుత్ ఉద్యోగులు మంత్రికి బతుకమ్మ లతో స్వాగతం పలికారు. సమావేశానికి ముందుగా రాష్ట్ర ఆవిర్బావం కు ముందు విద్యుత్ పరిస్థితి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించిన ప్రగతి ని వివరించే ప్రత్యేక డాక్యుమెంటరీ ని ప్రదర్శించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచనా, విధానాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే వివిధ రంగాలకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా జరుగుతుందని అన్నారు. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా నాయిబ్రాహ్మణులు, రజకులకు సబ్సిడీ పై విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ శాఖ లోని ఉద్యోగులు, సిబ్బంది కృషి తోనే ఇది సాధ్యమైందని మంత్రి వారిని ప్రశంసించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అంధకారంలో ఉండాలని ఎగతాళి చేశారని, వాటిని కొట్టి పారేస్తూ అనేక వ్యయ ప్రయాసలకోర్చి విద్యుత్ వ్యవస్తను బలోపేతం చేయడం జరిగిందని వివరించారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడే నాటికి విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, నేడది 18,453 మెగావాట్లకు పెంచుకోగలిగామని రాష్ట్రం ఏర్పడిన నాడు సోలార్ పవర్ ఉత్పత్తి 74 మెగావాట్లు మాత్రమే ఉండగా, నేడది 5,741 మెగావాట్లకు పెంచుకోగలిగినట్లు వివరించారు.
సౌర విద్యుదుత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రభాగాన నిలిచింది. సంస్థలో నష్టాలను నివారించుకోవడం, అవసరమైన సిబ్బంది నియామకాలు చేపట్టడం, విద్యుత్ ఉత్పత్తి సామర్ద్యాలను పెంచుకోవడం వంటివి ముఖ్యమంత్రి ఆదేశాలతో అనుసరించి అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం జరిగిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసే విషయాన్ని పట్టించుకోలేదని, కనీసం ఆలోచన కూడా చేయలేదని విమర్శించారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి చేయని కారణంగా వ్యవసాయానికి ఎప్పుడు కరెంట్ వస్తుందో…ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో అన్నదాతలు అనేక అవస్తలు పడ్డారని వివరించారు.
పరిశ్రమలకు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా చేయలేక పవర్ హాలిడే ప్రకటించారని, దీంతో పరిశ్రమలలోని కార్మికులకు సరైన ఉపాధి లభించేంది కాదన్నారు. వేసవి కాలంలో విద్యుత్ సరఫరా కోసం ధర్నాలు, రాస్తారోకోలు, సబ్ స్టేషన్ ల ఎదుట ఆందోళనలు కొనసాగిన విషయాన్ని గుర్తుచేశారు. ఏదైనా చేయాలనే సంకల్పం, పట్టుదల ఉండాలని, అది మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఉందని 9 సంవత్సరాలలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనం అన్నారు.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా 24 గంటల విద్యుత్ సరఫరా కావడం లేదని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం, సరఫరా ను పెంచుకున్న కారణంగా రాష్ట్రంలో సాగుభూమి విస్తీర్ణం పెరిగి పంటల దిగుబడి గణనీయంగా పెరిగిందని, ఫలితంగా దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించిందని, ఇది మనందరికీ గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేషన్ చైర్మన్ లు గజ్జెల నగేష్, మన్నె క్రిశాంక్, కార్పొరేటర్ కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ లు ఆకుల రూప, నామన శేషుకుమారి, ఎలెక్ట్రికల్ SE రవి కుమార్, DE లు శ్రీధర్, సుదీర్, పర్వతాలు, సుచెంద్రనాద్ తదితరులు పాల్గొన్నారు.