గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సైబర్ సెక్యూరిటీ సంస్థలు నెలకొల్పుతాం
పోలీస్ అకాడమీ(అప్పా) శాశ్వత భవనాల నిర్మాణానికి భూసేకరణ పూర్తి
నేర నియంత్రణే లక్ష్యం..పోలీసుల వసతులకు ప్రాధాన్యం
జనవరి మొదటి వారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ
పోలీసులకు అత్యాధునిక శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు
రాష్ట్ర సచివాలయంలో ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష
అమరావతి : కేంద్ర ప్రభుత్వ నిధులు రాబట్టి పోలీస్ శాఖ అభివృద్ధికి బాటలు వేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన బకాయిలు, నిధుల గురించి చర్చించినట్లు ఆమె పేర్కొన్నారు. పోలీస్, అగ్నిమాపక సేవలు, జైళ్లు, విపత్తునిర్వహణ, జిల్లా సైనిక సంక్షేమానికి సంబంధించిన కేంద్ర పథకాల నిధులు రాబట్టడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించినట్లు స్పష్టం చేశారు.
కేంద్ర హోంశాఖ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడైన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)తో కలిసి సోమవారం రాష్ట్ర సచివాలయంలో హోం, విపత్తు నిర్వహణ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…టెక్నాలజీ పెరుగుతూ నిరంతరం నేర స్వరూపం మార్చుకుంటోన్న నేపథ్యంలో పోలీసులకు తగిన సదుపాయాలు, శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై సమాలోచనలు జరిపినట్లు హోంమంత్రి తెలిపారు. అందులో భాగంగా సాంకేతికతతో కూడిన గ్రేహౌండ్స్,ఆక్టోపస్,సైబర్ సెక్యూరిటీ వంటి కీలక సంస్థలను నెలకొల్పేందుకు కృషి చేస్తామన్నారు.
కేంద్ర నిధులు, పోలీస్ శిక్షణ సంస్థలు రాబట్టడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలం
కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సేకరించడం, పోలీసులకు కనీస సదుపాయాలు కల్పించడంపై గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనీసం దృష్టి పెట్టలేదని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. ఏపీ పోలీస్ అకాడమీ (అప్పా)కు సంబంధించి కూటమి ప్రభుత్వంలో వేగంగా అడుగులు పడుతున్నాయని హోంమంత్రి అన్నారు. శాశ్వత భవనాలు నిర్మించేందుకు వీలుగా స్థల సేకరణ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. ఆక్టోపస్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం కోసం ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం గొండపల్లి వద్ద 76 ఎకరాల భూమిని కేటాయించామన్నారు.
పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (గ్రే హౌండ్స్) నిర్మాణ ప్రతిపాదన కోసం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో 498.23 ఎకరాల భూమిని సేకరించామన్నారు. రాష్ట్ర పోలీసులకు శిక్షణనిచ్చే పీటీసీ లేకపోవడం వలన అనంతపురం జిల్లాలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (పీటీసీ)లో ఎస్ ఐ స్థాయి ఆపై స్థాయి ఉద్యోగులకు శిక్షణనిస్తున్నట్లు పేర్కొన్నారు.
గ్రూ హౌండ్స్ శిక్షణ కేంద్రాన్ని సైతం విశాఖపట్నంలో తాత్కాలికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హోం,విపత్తు నిర్వహణ శాఖలకు అవసరమైన సంస్థలు, శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఏపీలో నేర రహిత సమాజాన్ని నిర్మించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయి పది సంవత్సరాలు కావస్తోన్నప్పటికీ కేంద్రం నుండి రావాల్సిన 118 కీలక శిక్షణ సంస్థల ఏర్పాటు జరగలేదని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. కేంద్ర హోంశాఖ కమిటిలో సభ్యుడిగా ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను హోంమంత్రి అనిత నేతృత్వంలో జనవరి 8,9 తేదీల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి త్వరలో వివరిస్తామన్నారు. విపత్తు నిర్వహణకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన రూ.1150 కోట్ల తాత్కాలిక నిధులను కూడా రాబట్టాల్సి ఉందన్నారు. పోలీస్ స్టేషన్లు, జైళ్ళ ఆధునికీకరణకు కృషి చేస్తామన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి , ఐజీ విజయకుమార్, ‘ఈగల్’ చీఫ్ ఆకే రవికృష్ణ, ఎస్పీ ఎస్ఐబీ, గీతాదేవి, జైళ్ల శాఖ అడిషనల్ ఎస్పీ రఘు, డీజీ ఫైర్ మాదిరెడ్డి ప్రతాప్, విపత్తునిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్, రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్ బ్రిగేడైర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.