-
గ్రామాల అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం
-
సీఎం చంద్రబాబుతోనే పల్లెలకు పూర్వ వైభవం గ్రామాల్లో రోడ్లకు మహర్దశ
-
ప్రభుత్వం ఏర్పడి 125 రోజులలో 4,500 రూ. కోట్లతో 30 వేల పనులకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం
-
రూ.4.20 కోట్ల నిధులతో సాలూరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
సాలూరు (పార్వతీపురం మన్యం) : గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
సాలూరు నియోజకవర్గం సాలూరు మండలం కూర్మరాజుపేట, కొత్తవలస పంచాయతీలు చంద్రపువలస, చిన్నవలస, గుండ్రపువలస గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చంద్రపువలస నుండి ముగడవలస బీ.టీ రోడ్డును రూ .1.60 కోట్లు, చిన్నయ్యవలస నుండి పునికిలవలస జంక్షన్ వరకు రూ.50 లక్షలు, గుండ్రపువలస నుండి ఖరాసువలస వరకు రూ .1.55 కోట్లు వెరసి 3.65 కోట్ల రూపాయల నిధులతో బి.టీ రోడ్డులకు శంకుస్థాపనలు చేసారు. దాగరవలస నుండి ఎగువ దాగరవలస వరకు రూ.2.80 కోట్లతో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ…
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రగతి పరుగులు తీస్తుందని పేర్కొన్నారు. గ్రామాలలోని ప్రజల మౌలిక వసతులకు ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఏర్పడిన 125 రోజులలో రూ 4,500 కోట్లతో 30 వేల పనులకు శ్రీకారం చుట్టిందని – 3 వేల కి.మీ. మేర సిమెంట్ రోడ్ల నిర్మాణం ,500 కి.మీ. మేర బీటీ రోడ్ల నిర్మాణం జరగనుందని చెప్పారు. ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యను గుర్తించిన వెంటనే ఆ సమస్యకు పరిష్కారం చూపడం జరుగుతుందని తెలిపారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా నెరవేరుస్తున్నామన్నారు. మహిళలకు దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. మొదటి దఫా పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. త్వరలోనే రెండవ దఫా నిధులను కేటాయించి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటినుండే ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడం సీఎం చంద్రబాబుకే సాధ్యమన్నారు.
గత ప్రభుత్వ తప్పిదలవల్ల రాష్ట్రం పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేక అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందన్నారు. గ్రామ పంచాయతీలలో సర్పంచులకు అధికారం లేకుండా చేయడమే కాకుండా కుంటుపడిన అభివృద్ధికి వారిని బాధ్యులను చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామనికి సర్పంచులకు పూర్తిగా అధికారమిచ్చి సర్పంచులకు గౌరవం ఇచ్చిందని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.