Suryaa.co.in

Editorial

మహా లఘు దర్శనానికి మంగళం?

  • 20 గంటలు వేచి చూస్తున్న భక్తులు

  • మళ్లీ నాటి లఘుదర్శనమే

  • ధర్మారెడ్డి విధానం రద్దు

  • గదుల అద్దె తగ్గింపు?

  • టీడీపీ హయాం నాటి ధరలే కొన సాగింపు?

  • అన్యమత ఉద్యోగుల నుంచి డిక్లరేషన్

  • వారిని ఏం చేయాలన్న దానిపై చర్చ

  • కొండపై మీడియాకు నిషేధం?

  • వివాదమవుతున్న నేతల వ్యాఖ్యలు

  • ప్రైవేటు వ్యక్తుల పెంట్‌హౌసులు ఇక టీటీడీకే

  • ఇప్పటిదాకా వాటిపై అజమాయిషీ లేని టీటీడీ

  • నిబంధనలు మార్చేసిన ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి

  • కొండపై ఆస్తులన్నీ స్వామివారివేనని వాదించినా పట్టించుకోని జగన్ సర్కారు

  • గతంలో ఇష్టా రాజ్యంగా ఉద్యోగ నియామకాలు

  • కొత్త ఉద్యోగాలకు గ్రీన్‌సిగ్నల్?
  • పాతుకుపోయిన ఉద్యోగులపై బదిలీ వేటు

  • రాజకీయ పునరావాస కేంద్రంగా ఎస్వీబీసీ

  • ఎస్వీబీసీని రద్దు చేయాలన్న డిమాండ్‌పై చర్చ

  • కల్యాణమండపాలపై కనిపించని అజమాయిషీ

  • లెక్కతేలని టీటీడీ భూములపై విచారణ కమిటీ

  • పాత దేవాలయాల జీర్ణోద్ధరకు నిధులు

  • కొలువు తీరనున్న టీటీడీ కొత్త బోర్డు ముందు సవాళ్లు

( మార్తి సుబ్రహ్మణ్యం)

తిరుమలలో సామాన్య భక్తుల కష్టాలకు కారణమవుతున్న మహా లఘు దర్శనానికి కొత్త బోర్డు మంగళం పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి వైఎస్ హయాంలోనే నాటి జెఈఏ ధర్మారెడ్డి చేసిన ఈ ప్రతిపాదనను, అప్పట్లో కొందరు వ్యతిరేకించారు. టీటీడీ బోర్డు సభ్యులుగా ఉన్న విజయసాయిరెడ్డి, ఓవి రమణ జేఈఓ ప్రతిపాదనను లిఖితపూర్వకంగా వ్యతిరేకించారు. తర్వాత ఆదికేశవులు నాయడు హయాంలో మహాలఘుదర్శనానికి తెరలేపారు. అంతకుముందు టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో లఘు దర్శనమే ఉండేది. ధర్మారెడ్డి వచ్చిన తర్వాత దానిని రద్దు చేసి, మహా లఘు దర్శన విధానం అమలు చేశారు.

ఫలితంగా భక్తులకు కష్టాలు మొదలయ్యాయి. దాదాపు 20 గంటలపాటు సామాన్య భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నప్పటికీ, వారిని కేవలం రెండు సెకన్లు కూడా దర్శనం చేసుకోకుండా, లాగిపారేసే విధానంపై విమర్శలు వెల్లువెత్తాయి. శ్రీవారికి 60 అడుగుల దూరం నుంచి దర్శనం చే యించే మహాలఘు దర్శనంలో, ఒకే ఒక్క నిమిషానికి 135 మంది భక్తులకు శరవేగంగా దర్శనం చేయిస్తున్నారు.

దాని వల్ల భక్తులకు స్వామివారిని చూశామన్న తృప్తి లభించడంలేదు. అదే 20 అడుగుల దూరం నుంచి లఘుదర్శనం చేయిస్తే, భక్తులకు స్వామివారిని దగ్గరుండి చూశామన్న సంతృప్తి లభిస్తుంది. ఇప్పుడు టీడీపీ హయాంలో ఏర్పడిన కొత్త బోర్డు, ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక కొండపై ఉన్న ఆస్తులన్నీ స్వామివారివే. ప్రైవేటు వ్యక్తుల పెత్తనం ఉండకూడదు. కానీ ధర్మారెడ్డి హయాంలో బడా పారిశ్రామికవేత్తలు కాటేజీలు కట్టించి, పైన పెంట్‌హౌసులు మాత్రం తమ అధీనంలోనే ఉంచుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటిలో కొన్ని గెస్ట్‌హౌసులను సీఎం జగన్, చినజీయరు స్వామి స్వయంగా ప్రారంభించడం విశేషం.

ఆ పెంట్ హౌసులను దాతలు, ఏడాది పొడవునా తమ అధీనంలో ఉంచుకునేందుకు ధర్మారెడ్డి వెసుబాటు కల్పించారు. కొత్తగా కొలువుతీరనున్న కొత్త టీటీడీ బోర్డు, ఆ 15 పెంట్‌హౌస్‌లను స్వాధీనం చేసుకుని, తామే వాటిని వీఐపీలకు కేటాయించనున్నట్లు చెబుతున్నారు. ధర్మారెడ్డి నిర్ణయాలను కొనసాగిస్తే భక్తులు, కూటమి కార్యకర్తల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే ప్రమాదం లేకపోలేదు.

జగన్ ప్రభుత్వ హయాంలో భక్తులకు అద్దె గదులు గగనమయిందని, స్వామివారిని భక్తులకు దూరం చేసేందుకే గదుల అద్దెరేట్లు, సేవా టికెట్ల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెంచారంటూ.. అప్పట్లో టీడీపీ-బీజేపీ మండిపడ్డాయి. దానిని దృష్టిలో ఉంచుకుని గత టీడీపీ ప్రభుత్వంలో ఉన్న గదుల అద్దెలు, సేవా టికెట్లు ధరలనే కొనసాగించడం ద్వారా భక్తులపై భారం తగ్గించాలని నిర్ణయించినట్లు సమాచారం. దానితో భక్తుల మనోభావాలు గౌరవించాలని భావిస్తోంది. ఆదాయం కోసం కాకుండా భక్తుల సౌకర్యాలకే ప్రాధాన్యం ఇస్తున్నందున.. అద్దెగ దులు, సేవాటికెట్లను వ్యాపార దృక్పథంతో చూడకూడదన్నది టీడీపీ విధానమంటున్నారు.

కాగా కొండపై మీడియాను నిషేధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దర్శనానంతరం నాయకులు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు, ఫొటో షూటింగులతో స్వామివారి పవిత్ర కు భంగం ఏర్పడుతోంది. నిజానికి కొండపైన మీడియాతో ఎవరికీ పని లేదు. ధర్మారెడ్డి జమానాలో తమిళనాడుకు చెందిన చానెళ్లు, పత్రికలకు లెక్కలేనని దర్శనం కోటా టికెట్లు ఇచ్చిన వైనం విమర్శలకు దారితీసింది.

కొండపై చాలాకాలం నుంచి వివిధ మీడియాల్లో పనిచేసేవారికి షాపులు కూడా కేటాయిస్తున్న పరిస్థితి. చాలామంది జర్నలిస్టులకు కొండపై వ్యాపారం లక్షలు కురిపిస్తోందన్న ఆరోపణలు చాలాకాలం నుంచి వినిపిస్తున్నవే. అసలు ప్రశాంతత కోసం వచ్చే వీఐపీలకు.. మీడియాతో ఏం పని అన్న చర్చ చాలకాలం నుంచి జరుగుతోంది. దానిపై కొత్త బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని సమాచారం. వీఐపీలు వస్తే వారి ఫొటోలు టీటీడీ పీఆర్వో విభాగం విడుదల చేస్తే సరిపోతుంది కదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇక కీలమైన అన్యమతస్థుల తొలగింపు వ్యవహారం, కొత్త బోర్డుకు కత్తిమీద సాములా మారింది. కొత్త చైర్మన్ నాయుడు, వారిని తొలగిస్తామని ప్రకటించారు. కానీ అదంత సులభమయ్యే ప్రక్రియ కాదు. దానిపై ఇప్పటికే కోర్టు ఆదేశాలున్నాయి. వారిని ప్రభుత్వ శాఖలకు విలీనం చేయడం సాధ్యం కాదు. టీటీడీ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ. వారిని ఇతర ఆలయాలకు బదిలీ చేయడం కూడా కుదరని పని. మరి ఈ సమస్యను టీటీడీ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. దానికంటే ముందు అసలు టీటీడీలో అన్యమతస్థులు ఎంతమంది ఉన్నారని తెలుసుకునేందుకు ఉద్యోగుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని యోచిస్తోంది.

రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన ఎస్వీబీసీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాభాపేక్ష లేకుండా కేవలం స్వామి వారి కార్యక్రమాలను టెలికాస్టు చేస్తున్న ఎస్వీబీసీలో.. ఇటీవలి కాలంలో వస్తున్న వ్యాపార ప్రకటనలు విమర్శలకు గురవుతున్నాయి. అసలు ఎస్వీబీసీ వలన ఎవరికి ఉపయోగం? చానెళ్లకు లైవ్ టెలికాస్ట్ లింక్ ఇస్తే సరిపోతుంది కదా? అన్న చర్చ చాలాకాలం నుంచి జరుగుతోంది.

శ్రీవారికి భక్తులు విరాళంగా ఇచ్చే భూముల వివరాలు గందరగోళంగా మారాయి. అసలు వాటిలో ఎన్ని టీటీడీ స్వాధీనంలో ఉన్నాయి? ఎన్ని అన్యాక్రాంతమయ్యాయన్న దానిపై లెక్కలు లేవు. అందువల్ల స్వామివారి భూముల వివరాలపై ఒక కమిటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.ఇక తెలుగు రాష్ట్రాల్లో లెక్కకుమించి ఉన్న శ్రీవారి కల్యాణమండపాల నిర్వహణపై, టీటీడీ అజమాయిషీ లేకుండా పోయింది. వాటిలో పశువులు కట్టేస్తుండగా, నల్లగొండ జిల్లాలో మసీదు నిర్మాణానికి ప్రయత్నం జరిగింది. దీనిపై విచారణ కమిటీ వేయడం ద్వారా, వాటిని ఇతర మార్గాల్లో వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక శ్రీవారికి ఆదాయం తెచ్చే వెంట్రుకల టెండరు వ్యవహారంపై, చాలాకాలం నుంచి అనేక ఆరోపణలు వెల్లుతుతున్నాయి. వైఎస్ హయాంలో వెంట్రుకల టెండరు ద్వారా దాదాపు 250 కోట్ల రూపాయలు ఆదాయం రాగా.. ఇప్పుడు భక్తుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, ఆ ఆదాయం వంద కోట్లు దాటకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కాంట్రాక్టర్లను మార్చాలన్న డిమాండ్‌ను, పాలకవర్గాలు పట్టించుకోకపోవడమే దానికి కారణమంటున్నారు.

ఇదిలాఉండగా.. టీటీడీలో ఉద్యోగుల నియామకం ఇష్టారాజ్యమయిపోయిందన్న ఆరోపణలున్నాయి. మొత్తం 15 వేల ఉద్యోగులు, 5 వేల మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉండాలి. అయితే ప్రస్తుతం 7 వేల మంది పర్మినెంట్, 20 వేలమంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త ఉద్యోగాల నియామకాలపై చర్చించే అవకాశం లేకపోలేదంటున్నారు. ఈనెల 18న కొలువు తీరనున్న కొత్త టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయాలపై భక్తులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

LEAVE A RESPONSE