– ఆ వ్యాఖ్యలు చట్టాలను ఉల్లంఘిస్తున్న పోలీసులకు వంతపాడటమే
– గాడి తప్పిన శాంతి భద్రలతకు ఇదే నిదర్శనం
– ఈ రకమైన పనితీరుతోనే దిగజారిన ఏపీ పోలీస్ వ్యవస్ధ
– దేశంలో అట్టడుగున 36 వ స్ధానానికి దిగజారిన పోలీస్ విభాగం
– వైయస్సార్సీపీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్ రెడ్డి ఆగ్రహం
తాడేపల్లి: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్ధ పూర్తిగా గాడి తప్పిందని, డీజీపీ బాధ్యతారాహిత్య సమాధానమే దీనికి నిదర్శనమని వైయస్సార్సీపీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… జంతు బలుల కేసులో అరెస్టైన వారిని పెట్రోలింగ్ వాహనాలు లేకవపోవడం వలనే రోడ్డుపై నడిపించామని డీజీపీ చెప్పిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు.
గాడితప్పిన పోలీస్ వ్యవస్ధకు ఇదే నిదర్శనమని మండిపడ్డారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తుంటే సామాన్యులకు న్యాయం జరుగుతుందన్న భరోసా ఎవరిస్తారని ప్రశ్నించారు. పోలీసులు సివిల్ పంచాయతీల్లో తలదూర్చుతూ బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు నిత్యం పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తున్నా… అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
ఈ రకమైన చర్యల వల్లే… గత వైయస్సార్సీపీ ప్రభుత్వంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న పోలీస్ వ్యవస్థ, కూటమి పాలనలో దేశంలోనే అట్టడుగు స్థానానికి పడిపోయిందని విమర్శించారు. రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకోవాల్సిన పోలీసులే న్యాయస్థానాల ఆదేశాలను సైతం ఉల్లంఘిస్తూ పొలిటికల్ బాస్ల ఆదేశాలతో రాజకీయ కుట్రల్లో భాగస్వాములు కావడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఇటీవల కదిరిలో జరిగిన ఘటన దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని తేల్చి చెప్పారు.
చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘించి వ్యవహరించడమే తప్పయితే, దాన్ని సమర్థించేలా రాష్ట్ర డీజీపీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం మరింత ఘోరంగా ఉంది. బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతుంటే పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు. గంజాయి, డ్రగ్స్, మహిళలపై వేధింపులు, భూకజ్జాలు, అవినీతికి పాల్పడుతున్న వారిని వదిలేసి, వైయస్సార్సీపీ పక్షాన నిలబడి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిన వారిపైనే అక్రమ కేసులు నమోదు చేసి హింసించడమే పోలీసులు పనిగా మారిందని సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా చట్టాలను ఉల్లంఘించే పోలీసులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.