Suryaa.co.in

Editorial

ధర్మాన అవునంటే… వనిత కాదనిలే

-వాలంటీర్ల పోస్టులు వైసీపీ కార్యకర్తలకే వాలంటీర్లు ఇచ్చామన్న మంత్రి వనిత
-నిండు సభలో నిజం ఒప్పుకున్న హోంమంత్రి
-కార్యకర్తలు పార్టీ మీద ఆధారపడవద్దన్న మంత్రి ధర్మాన
-ఏదో ఒక వృత్తి చేసుకోమని సలహా
-ఇద్దరు మంత్రుల భిన్న స్వరాలు
-వనిత వివాదాస్పద వ్యాఖ్యల్లో మరోసారి చిక్కుల్లో వైసీపీ సర్కారు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇద్దరూ ఒకే క్యాబినెట్‌లో మంత్రులు. మరి పార్టీ-ప్రభుత్వ అభిప్రాయాలు కూడా ఒకే స్వరంలో ఉండాలి. కానీ.. అదే విచిత్రం. ఒకే అంశంపై ఇద్దరిదీ వేరుబాట. ఒక మంత్రి అవునంటే.. ఇంకో మంత్రి కాదంటారు. ఒక మంత్రి కార్యకర్తలకే వాలంటరీ ఉద్యోగాలిచ్చామంటే, మరో మంత్రి మీరు ఉద్యోగాల కోసం పార్టీ మీద ఆధారపడవద్దంటారు. ఇదీ ఏపీలో వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు, ఉపాథిపై ఇద్దరు మంత్రుల భిన్న స్వరాలు.

పార్టీ కోసం భుజాలు పుండ్లు పడేలా కష్టపడ్డ తమకు ప్రభుత్వం నుంచి గానీ, పార్టీ నుంచి ఎలాంటి సాయం అందటం లేదని వైసీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చివరకు వాలంటీర్ల పోస్టులు కూడా, తమ కుటుంబాలకు ఇవ్వడం లేదంటూ.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వైసీపీ కార్యకర్తల, కళ్లు తెరిపించే నిజాలను హోంమంత్రి వనిత పార్టీ వేదికపై నుంచి వెల్లడించారు.

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వైసీపీ ప్లీనరీకి హాజరయిన వనిత.. వాలంటీర్ల పోస్టులన్నీ వైసీపీ కార్యకర్తలకే ఇస్తున్నప్పటికీ, ఇంకా అసంతృప్తి ఎందుకని ప్రశ్నించారు. ‘‘మేం వైసీపీ కార్యకర్తల కుటుంబాలకు వాలంటీరు పోస్టు ఇవ్వడం లేదా? మీరు చెప్పండి. ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు మెంబర్లతో

పాటు, వాలంటీర్ల పోస్టులు కూడా వైసీపీ కార్యకర్తల కుటుంబాలకే ఇచ్చిన విషయాన్ని మర్చిపోకూడదు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల్లో మన కార్యకర్తలు లేరా? ఈ విషయంలో ప్రతిపక్షాలు మన మధ్య చిచ్చు పెట్టడానికి చేస్తున్న విష ప్రచారాన్ని నమ్మవద్దు. ఇది మన ప్రభుత్వం. కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు. కార్యకర్తలకు తప్పనిసరిగా న్యాయం చేస్తాం’’ అని మంత్రి వనిత సెలవిచ్చారు.

అయితే.. ఇదే అంశంపై అటు శ్రీకాకుళంలో సీనియర్‌ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరో కోణంలో చేసిన వ్యాఖ్యలు కార్యకర్తలను నిరాశ పరిచాయి. శ్రీకాకుళం అంబేద్కర్‌ కళావేదికపై నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో మాట్లాడిన ధర్మాన.. వైసీపీ కార్యకర్తలు ఎవరి కాళ్లపై వారు నిలబడాలే తప్ప, మా సాయం కోసం ఎదురుచూడవద్దని హితవు పలికారు. ‘‘ కార్యకర్తలు ఏదో ఒక వృత్తి చేసుకుని బతకాలి. అంతేగానీ ఏదో ప్రయోజనం ఆశించి పార్టీపై బతకొద్దు. మీ కాళ్లపై మీరు నిలబడండి’’ అని జ్ఞానబోధ చేయడం, కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురిచేసింది.

పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా, కష్టపడి పనిచేసిన తమకు ఏమీ జరగడం లేదన్న ఆవేదన, అంసంతృప్తి చాలాకాలం నుంచి వైసీపీలో వినిపిస్తోంది. దానితో చాలామందికి వాలంటీరు ఉద్యోగాలిచ్చినా, ఉన్నతవిద్య చదువుకున్న కార్యకర్తలెవరూ ఆ పని చేసేందుకు ముందుకురాలేదు. ఫలితంగా తక్కువ చదవు చదివిన వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమిస్తున్నారు. గతంలో ఎంపీ విజయసాయిరెడ్డి సైతం.. వాలంటీర్లు, గ్రామసచివాలయ ఉద్యోగాల్లో 90 శాతం వైసీపీ కార్యకర్తలకే ఇచ్చామని బహిరంగంగానే ప్రకటించారు. అదే విషయాన్ని పిటిషన్‌ వేసిన విపక్షాలు, ఆ వ్యాఖ్యల వీడియోలను కోర్టులో సాక్ష్యంగా చూపించారు.

అయితే ఈ వ్యవహారం అటు విపక్షాలకు వరంగా పరిణమించింది. వాలంటీరు వ్యవస్థపై హైకోర్టులో కేసులు వేశారు. వైసీపీ కార్యకర్తల చేతికి ప్రజల సమాచారం ఎలా ఇస్తారంటూ పలువురు కేసు దాఖలు చేశారు. దానితో ఆగ్రహించిన కోర్టు.. అసలు వాలంటీర్ల పాత్ర ఏమిటని ప్రశ్నిస్తే.. వారు కేవలం సేవలకులే తప్ప ప్రభుత్వ ఉద్యోగులు కాదని ప్రభుత్వం అఫిడవిట్‌ ఇవ్వాల్సివచ్చింది.

ఇంత వివాదంలో కూడా వైసీపీ కార్యకర్తలు, తమ కుటుంబాలకు వాలంటీరు ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదన్న అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. హోంమంత్రి వనిత చేసిన వ్యాఖ్యలు సరికొత్త వివాదానికి కారణమయ్యాయి.

LEAVE A RESPONSE