– అరెస్టు తర్వాత నాయకత్వానికి అర్ధమవుతున్న వైనం
– అరెస్టుపై తెలంగాణలో అంతగా వినిపించని నిరసనలు
– హైదరాబాద్ ఐటీ నిపుణుల నిరసన తెలంగాణకు వ్యాప్తి
– సెటిలర్లు ఉన్న ప్రాంతాల్లో వెల్లువెత్తుతున్న నిరసన
– బీఆర్ఎస్ ఎమ్మెల్యేలూ పాల్గొంటున్న వైచిత్రి
– నిరసన ప్రదర్శనల్లో కనిపించని టీడీపీ శ్రేణులు
– తెలంగాణ అధ్యక్షుడు కాసాని మౌనరాగం
– రాజమండ్రికి వెళ్లని కాసాని
– సంక్షోభ సమయంలో చొరవ తీసుకోని వైఫల్యం
– కనిపించని పార్టీ సమన్వయకమిటీ
– పార్టీ నాయకత్వంలో కనిపించని దూకుడు
– సమర నినాదానికి దొరకని నేతలు
– సెటిలర్లు, కమ్మనేతలే నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న వైనం
– నాయకుడు లేకుండానే కొనసాగుతున్న ఆందోళనలు
– తెలంగాణపై చంద్రబాబు దృష్టి సారించని వైఫల్యమే ఇది
– డివిజన్-నియోజకవర్గ స్థాయి నేతలకూ రాష్ట్ర-జాతీయ కమిటీల్లో పదవులు
( మార్తి సుబ్రహ్మణ్యం)
చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అంటే ఇదే. పార్టీ పుట్టిన గడ్డను పట్టించుకోని నిర్లక్ష్య ఫలితం, సంక్షోభ సమయంలో స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ అధినేత జైల్లో ఉంటే, రాష్ట్ర అధ్యక్షుడిలో చొరవ లేని దుస్థితి. కంటితుడుపు ప్రకటనలు తప్ప, క్యాడర్ను సమరానికి సన్నద్ధం చేయలేని వైఫల్యం. చివరాఖరకు అధినేతపై ఉన్న అభిమానంతో.. ఎవరికివారే నాయకులుగా మారి, ఆందోళనలో పాల్గొంటున్న వైచిత్రి. ఇదీ.. తెలంగాణ-ప్రధానంగా హైదరాబాద్లో, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టు అనంతర తెలుగుదేశం పార్టీ దయనీయ పరిస్ధితి.
తెలుగుదేశం పార్టీ పుట్టింది హైదరాబాద్ గడ్డమీదనే. ఉమ్మడి రాష్ట్రంలోనయినా ఆంధ్రా కంటే తెలంగాణలో వచ్చిన సీట్లే ఎక్కువ. ఏపీ కంటే తెలంగాణ నేతలే బలంగా ఉండేవారు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ 15 సీట్లు సాధించిన టీడీపీ పరిస్థితి, ఇప్పుడు అధినేతను అరెస్టు చేసినా కనీస నిరసనలు చేయలేని అత్యంత విషాదంగా మారింది.
పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయి, జైల్లో ఉంటే కనీసం వందమందిని కూడా సమీకరించుకుని, ఆందోళన చేయలేని అసమర్ధ పరిస్థితి దర్శనమిస్తోంది. చంద్రబాబు అరెస్టైన తర్వాత హైదరాబాద్లోని ఆ పార్టీ ఆఫీసు వద్దకు చేరి, ధర్నా చేసిన వారి సంఖ్య మూడుపదులు కూడా లేవు. అసలు ఈ ఆందోళనా కార్యక్రమాల్లో అయితే, రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఎక్కడా కనిపించని వైచిత్రి. ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నట్లు కనిపించింది.
అయితే హైదరాబాద్, తెలంగాణ ప్రాంతంలోని కొన్ని జిల్లా కేంద్రాల్లో సెటిలర్లు, కమ్మ వర్గం, ఎన్టీఆర్ అభిమానులే వందలసంఖ్యలో కదలివచ్చి, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం ప్రస్తావనార్హం. ఈ వర్గాలన్నీ తమంతటతాము రాజమండ్రికి తరలి వెళ్లడం గమనార్ఱం. అయితే విచిత్రంగా ఇప్పటివరకూ రాష్ర్ట అధ్యక్షుడు కాసాని మాత్రం రాజమండ్రికి వెళ్లి.. చంద్రబాబు కుటుంబానికి సంఘీభావం ప్రకటించి, పరామర్శించకపోవడంపై పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
ఖమ్మం-నిజామాబాద్-రంగారెడ్డి-నల్లగొండ-హైదరాబాద్-ఆదిలాబాద్-వరంగల్ జిల్లాల్లో సెటిలర్లు-కమ్మ వర్గమే ఆందోళనకు నడుం బిగించింది. అక్కడ టీడీపీ నేతల భాగస్వామ్యం భూతద్దం వేసి వె తికినా కనిపించలేదు. ఇది కూడా చదవండి: ‘కారు’లో ‘కమ్మ’టి కలవరం
ఇక హైదరాబాద్లో స్థిరపడిన ఐటీ నిపుణులు నిర్వహించిన కారు ర్యాలీలు, జాతీయ దృష్టిని ఆకర్షించాయి. దానిపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. దానిపై పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కూడా ధీటైన సమాధానం ఇచ్చారంటే.. నాయకుడు లేని ఉద్యమం, ఏ స్థాయిలో సర్కారును కదిలించిందో స్పష్టమవుతోంది.
నిజానికి ఐటీ ఉద్యోగుల వెనుక ఏ నాయకుడూ లేరు. వారంతట వారే వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకుని, హైదరాబాద్ టు రాజమండ్రికి కార్ల ర్యాలీ నిర్వహించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఐటీ ఉద్యోగుల దెబ్బకు ఏపీ పోలీసులు సరిహద్దుల వద్దకు చేరి, అడ్డుకునే పరిస్థితి వచ్చింది. ఐటీ ఉద్యోగుల కారు ర్యాలీ, హైదరాబాద్లోని సెటిలర్లు నివసించే ప్రాంతాలకు స్ఫూర్తిగా మారింది. ఫలితంగా నగర శివారు నియోజకవర్గాల్లోని ఎన్టీఆర్ విగ్రహ ప్రాంతాలు, నిరసన నినాదాలతో అట్టుడికిపోయాయి. ఇది కూడా చదవండి: ఇక్కడ ర్యాలీలు ఎందుకు?ఏపీలో చేస్కోండి!
అధినేత అరెస్టు తర్వాత తెలంగాణ టీడీపీ నాయకత్వం, కార్యాచరణ కోసం సమావేశాలు జరిపిన దాఖలాలు లేవు. క్యాడర్ను ఎటువైపు నడిపించాలన్న దిశానిర్దేశం కనిపించలేదు. ఉద్యమ కార్యాచరణ కోసం ఏపీలో మాదిరిగా సమన్వయ కమిటీ ఏర్పాటుచేసింది లేదని పార్టీ సీనియర్లు విమర్శిస్తున్నారు. బాబు అరెస్టును ఖండిస్తూ ప్రకటనలివ్వడం, యూట్యూబ్ చానెళ్లలో మైకులు బద్దలుకొట్టి ప్రచారం సంపాదించడమే తప్ప.. ప్రత్యక్ష కార్యాచరణపై దృష్టి సారించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
చివరకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మోత్కుపల్లి నర్శింహులుకు ఉన్నంత అభిమానం-చిత్తశుద్ధి కూడా, తమ నేతలకు లేకపోవడంపై పార్టీ శ్రేణుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. బాబు అరెస్టుకు నిరసనగా మోత్కుపల్లి స్పందించి ఎన్టీఆర్ ఘాట్ వద్ద దీక్ష నిర్వహించారు. అలాంటి ఆలోచన తమ అధ్యక్షుడు కాసానికి ఇప్పటికీ రాకపోవడంపై, పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఇదేమి రాజ్యం? పోలీసు భోజ్యం!
‘‘కనీసం సెటిలర్లు-కమ్మ వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోనయినా పార్టీ పక్షాన నిరసన ప్రదర్శనలు నిర్వహించాలన్న ఆలోచన లేని వ్యక్తిని, పార్టీ అధ్యక్షుడిగా నియమించిన తప్పు చంద్రబాబుదే. ఆయన ఏ అంచనాతో కాసానిని అధ్యక్షుడిగా నియమించారో మాకు తెలియదు’’ అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
పార్టీ నిర్వహణకు కావలసిన నిధులు సమకూర్చుతానన్న హామీతోనే ఆయనకు ఆ పదవి ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. కానీ అలాంటిదేమీ కనిపించడ లేదని మరికొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘అంతదానికి సీనియర్ నేత బక్కని నర్శింహులును తొలగించడం ఎందుకో అర్ధం కాలేదు. కనీసం రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు రూపొందించలేని వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటే, ఇక చంద్రబాబుకు తెలంగాణ-హైదరాబాద్ ప్రజల నుంచి, నైతిక మద్దతు ఎలా లభిస్తుంది? అదృష్టం బాగుండి ఐటి పిల్లలు ముందుకొచ్చారు. లేకపోతే పార్టీ పరువు పోయేది’’ అని ఓ సీనియర్ నాయకుడు ప్రశ్నించారు.
నిజానికి బలంగా ఉన్న తెలంగాణలో పార్టీని విడిచిన వైఫల్యం చంద్రబాబుదేనని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఓటుకునోటు కేసు తర్వాత, తెలంగాణలో పార్టీని వదిలేసి, ఏపీపైనే పూర్తిస్థాయి దృష్టి సారించడంతో తెలంగాణలో పార్టీ నిర్వీర్యమైందని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా, పార్టీ ఆఫీసుకు రాని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దీనితో టీడీపీని అభిమానించే సెటిలర్లు, కమ్మ వర్గం బీఆర్ఎస్-బీజేపీ వైపు మళ్లిందని విశ్లేషిస్తున్నారు.
అయితే తెలంగాణ టీడీపీ నేతలంతా వివిధ పార్టీల్లోకి వెళ్లిపోయినప్పటికీ, క్యాడర్ మాత్రం పార్టీని అంటిపెట్టుకుందని చెబుతున్నారు. చంద్రబాబు విజయవాడ వెళ్లే మార్గంలో ప్రతిసారీ.. నల్లగొండ జిల్లాలో పార్టీ క్యాడర్ ఆయనకు భారీ స్వాగతం చెబుతున్నారని గుర్తు చేస్తున్నారు. చివరకు పార్టీ బలంగా ఉన్న ఖమ్మం జిల్లాలో కూడా ఇప్పుడు పార్టీ చతికిలపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సభకు లక్షలాదిమంది రాగా, ఆ ఉత్సాహాన్ని కొనసాగించడంలో కాసాని విఫలమయ్యారంటున్నారు. గతంలో ఎప్పుడూ కార్యకర్తలతో కిటకిటలాడే పార్టీ ఆఫీసు, ఇప్పుడు కళావిహీనంగా మారిందని వాపోతున్నారు. ప్రస్తుతం టీడీపీ ఆఫీసు ఒక రాజకీయ పార్టీలా కాకుండా, ఒక కులసంఘం మాదిరిగా నడుస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఎవరంటే వారిని-కనీస అర్హత లేని వారిని కమిటీల్లో నియమిస్తున్నారని చెబుతున్నారు. ఎవరినంటే వారిని తొలగించడం-నియమించడంతో పార్టీ పదవులకు విలువ లేకుండా పోయిందంటున్నారు. డివిజన్-నియోజకవర్గ స్థాయి నేతలను కూడా.. రాష్ట్ర అధికార ప్రతినిధి-ఆర్గనైజింగ్ సెక్రటరీ-ప్రధాన కార్యదర్శి-ఉపాధ్యక్షుల పదవుల పంపకాలు చేసి.. రాష్ట్ర కమిటీ స్థాయిని దిగజార్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ కారణంగానే చివరకు పార్టీ అధినేతను అరెస్టు చేసినా.. కనీస స్పందన లేకుండా పోయిందని విశ్లేషిస్తున్నారు. గతంలో స్కిల్ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణను అరెస్టు చేసేందుకు, ఏపీ పోలీసులు హైదరాబాద్కు వచ్చారు. అయితే వారిని అడ్డుకునేందుకు వెళ్లాలని పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినా, 20 మంది కూడా రాకపోవడం నాయకత్వాన్ని నిరాశ పరిచింది. అదే చంద్రబాబు.. తెలంగాణలో పార్టీపై తొలినుంచి సీరియస్గా దృష్టి సారించి ఉంటే, ఈ దుస్థితి తలెత్తేని కాదంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఖర్చుకు భయపడి, అస్త్రసన్యాసం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబునాయుడు అరెస్టునే ఖండించి, నేతలు రోడ్డెక్కకపోతే.. ఇక తెలంగాణలో పార్టీ శాఖ ఉండి ఏం ప్రయోజనం అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ చంద్రబాబునాయుడు స్వయంకృతాపదరాధాలే అన్న వ్యాఖ్యలు పార్టీ సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి.