– చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం
– 1లక్ష రెండువేల కోట్లు కాంట్రాక్టర్లు మెక్కితే కేసీఆర్ బుక్కితే కాళేశ్వరం కూలిపోయింది.
– ఒక్కరోజులోనే ఎవరూ అద్భుతాలు సృష్టించరు
– కులగణన లో కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ ఎందుకు పాల్గొనడంలేదు?
– మీరు బీసీ వ్యతిరేకులా.. బీసీలకు దక్కాల్సిన వాటా ఇవ్వడం ఇష్టం లేదా?
– కులగణనలో పాల్గొనని వారిని సామాజిక బహిష్కరణ చేయండి
– పెద్దపల్లి యువ వికాసం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పెద్దపల్లి: గ్రూప్-4 లో ఎంపికైన 8,084 మందికి యువ వికాసం వేదికపై నియామక పత్రాలు అందించడం సంతోషంగా ఉంది. కరీంనగర్ గడ్డపై కాలు పెట్టినప్పుడల్లా ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటారనే నమ్మకాన్ని కలిగించిన సోనియమ్మ గుర్తుకు వస్తారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి సోనియమ్మ తెలంగాణ కలను సాకారం చేశారు.
తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది మన ఉద్యోగాల కోసం.ప్రజలకు ఉపాధి కోసం.. మన ప్రాంత అభివృద్ధి కోసం. పెద్దపల్లి రైతుల కోసం కొట్లాడితే ఆనాడు మా నాయకులను కేసీఆర్ జైల్లో పెట్టారు. ఆనాడు ఏ ప్రాజెక్టుల కోసం కొట్లాడామో, ఆ ప్రాజెక్టులు పూర్తి చేసుకునే అవకాశం మనకు వచ్చింది. రూ.1035 కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటున్నామంటే అది ప్రజా పాలన వల్లే.
మేం కడుపు కట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుంటే, కొందరు వాళ్ల భవిష్యత్ చీకటిమయమవుతుందని ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారు. పది నెలల మా పాలనపై వాళ్లు చేస్తున్న విష ప్రచారాన్ని ఈ పది రోజుల్లో తిప్పి కొడదాం. వరి వేసుకుంటే ఉరే అని మాట్లాడిన చరిత్ర కేసీఆర్ ది. వడ్లు పండించండి.సన్నాలు వేయండి మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని చెప్పిన చరిత్ర మాది.
33 జిల్లాల్లో అత్యధికంగా 2 లక్షల ఎకరాల్లో సన్న వడ్లు పండించిన ఘనత పెద్దపల్లి జిల్లాది. 95 శాతం రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు పడ్డాయి. తెలంగాణ ఉద్యమమమే ఉద్యోగాల కోసం మొదలైంది. ఏడాదిలో 55,143 ఉద్యోగాలను నిరుద్యోగులకు అందించి దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది.
కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు సవాల్ విసురుతున్నా.. 25 ఏళ్లలో మోదీ గుజరాత్ లో మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చారా ? చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. అక్షరాల 1లక్ష రెండువేల కోట్లు కాంట్రాక్టర్లు మెక్కితే, కేసీఆర్ బుక్కితే కాళేశ్వరం కూలిపోయింది.
కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో.. మీరు కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో లెక్క తీద్దాం రా. కాళేశ్వరం నుంచి చుక్క నీరు లేకపోయినా.. 1 కోటి 50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి తెలంగాణ దేశంలోనే రికార్డు సృష్టించింది. 25 లక్షల మంది రైతులకు రూ.21వేల కోట్లు రుణమాఫీ కోసం విడుదల చేసిన చరిత్ర మాది..గుజరాత్ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేశారా ఎవరు చర్చకు వస్తారో రండి. ఇందిరమ్మ రాజ్యంలో స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించాం.
కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని కంకణం కట్టుకున్నాం. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేది లేదు. కేసీఆర్ హయాంలో యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారు. మేం అధికారంలోకి రాగానే యూనివర్సిటీలను బలోపేతం చేసాం. శాతవాహన యూనివర్సిటీకి ఇంజనీరింగ్, లా కాలేజీ కావాలని కోరారు… వాటిని ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. కనీసం సమస్యలపై ధర్నా చేసుకోలేనంత నిర్బంధాల మధ్య తెలంగాణ పదేళ్లు మగ్గిపోయింది. మేం అధికారంలోకి రాగానే ఇందిరా పార్కు లో ధర్నా చౌక్ లో ధర్నాలు చేసుకునే అవకాశం కల్పించాం.
మా పీసీసీ అధ్యక్షుడు వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. పదేళ్లలో హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే విద్యార్థులకు డైట్, చార్జీలు పెంచాం. మళ్లీ నిరుద్యోగ ఆత్మహత్యలు జరుగొద్దనే ఏడాదిలోనే 55వేల ఉద్యోగ నియామకాలు పూర్తి చేశాం. ఒక్కరోజులోనే ఎవరూ అద్భుతాలు సృష్టించరు. .ప్రజలు మాకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారు. పది నెలలు కూడా ఓపిక పట్టకుండా దిగిపో దిగిపో అంటున్నారు.. వాళ్ల దుఃఖం దేనికో అర్థం కావడంలేదు.
పదేళ్లు సీఎం గా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో కేసీఆర్ ముందుకు వచ్చి సూచనలు ఇవ్వాలి.రండి అసెంబ్లీకి వచ్చి సూచనలు ఇవ్వండి. ఎకరానికి కోటి ఎలా సంపాదించిన మీ అనుభవాన్ని ప్రజలకు వివరించండి. కులగణనలో కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ ఎందుకు పాల్గొనడంలేదు? మీరు బీసీ వ్యతిరేకులా.. బీసీలకు దక్కాల్సిన వాటా ఇవ్వడం ఇష్టం లేదా? బీసీ సంఘాలు ఆలోచన చేయండి.. కులగణనలో పాల్గొనని వారిని సామాజిక బహిష్కరణ చేయండి.