– కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీ ప్రధానిని చేయలేదు
– ఉమ్మడి ఏపీతో పాటు నేటి తెలంగాణలో ఒక్క బీసీ సీఎంను చేయలేదు
– ఇది ముస్లింలకు మాత్రమే మేలు చేసే బిల్లు
– 10 శాతం ముస్లిం రిజర్వేషన్లను తీసేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
– కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆసిఫాబాద్, మంచిర్యాల, కాగజ్ నగర్ ప్రాంతాల్లో రైతులకు పైసా లాభం లేదు
– రామగుండంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్
రామగుండం: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల విషయంలో ధర్నా చేపట్టారు. కామారెడ్డిలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఢిల్లీకి ఎందుకు వెళ్లారు?
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ని పిలిచారు. మరి కర్ణాటక రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పరిస్థితి గురించి రేవంత్ రెడ్డి సిద్ధరామయ్య ని అడగాలి. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు పదేపదే బీజేపీపై అభాండాలు వేస్తూ, తమ వైఫల్యాలన్నీ బీజేపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు 42 శాతం బీసీ రిజర్వేషన్లపై బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు, బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు భేషరతుగా మద్దతు తెలిపారు. ఆ తర్వాత బిల్లు పాస్ అయి 6 నెలలు గడిచింది. అంతకంటే ముందు స్థానిక సంస్థల, పంచాయతీల గడువు తీరి ఏడాది గడిచిపోయింది. అయినా స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదు.
కాంగ్రెస్ పార్టీ 42 శాతం బీసీ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని ప్రయత్నం చేస్తోంది. దీంతో అసలైన బీసీలకు 42 నుంచి 32 శాతానికి పడిపోనున్నాయి. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ ఆ 42 శాతాల్లో 10 శాతం ముస్లింలను చేర్చి, బీసీ జాబితాలోకి మతపరమైన రిజర్వేషన్లను చొప్పించడం ద్వారా అసలైన బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోంది.
గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం 4 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ఇచ్చి, బీసీ రిజర్వేషన్లను కుదించింది. దీనిపై కేసు ఇంకా కోర్టులో పెండింగ్లో ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10 శాతం రాజకీయ ముస్లిం రిజర్వేషన్లు పెంచి బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు రానివ్వకుండా కుట్ర చేస్తోంది. గతంలో GHMCలో 50 బీసీ రిజర్వ్ డివిజన్లలో 35 పైగా సీట్లు MIM పార్టీ గెలిచింది. దీంతో అసలైన బీసీలకు తీవ్ర నష్టం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు 10 శాతం ముస్లిం రిజర్వేషన్ల గురించి చెప్పలేదు. ఆర్డినెన్స్ తీసుకువచ్చిన కాపీని బహిర్గతం చేయలేదు. ఇప్పుడు బీజేపీ కోఆపరేట్ చేయడం లేదని విమర్శిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సమయం ఇవ్వడం లేదని మాట్లాడుతున్నారు.
రేవంత్ రెడ్డి 50 సార్లు ఢిల్లీకి వెళ్తే రాహుల్ గాంధీ టైమ్ ఇవ్వలేదు. కాని ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇచ్చారు.రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఢిల్లీలో చేస్తున్నది మొత్తం డ్రామా. ఓబీసీలను బీజేపీకి దూరం చేయాలనే కుట్ర చేస్తోంది కాంగ్రెస్. బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రధాని నరేంద్ర మోదీ ని ‘కన్వర్టెడ్ బీసీ’ అంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శించడం దారుణం.
కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీ ప్రధానిని చేయలేదు. ఉమ్మడి ఏపీతో పాటు నేటి తెలంగాణలో ఒక్క బీసీ సీఎంను చేయలేదు. రాష్ట్ర కేబినెట్లో, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదు. మీరా బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడేది? 42 శాతం బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు 10 శాతం కేటాయించాలనుకోవడం.. మతపరమైన బుజ్జగింపు రాజకీయమే. ఇది బీసీలకు అన్యాయం చేసే బిల్లు, ముస్లింలకు మాత్రమే మేలు చేసే బిల్లు.
బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశం కాంగ్రెస్కు లేదు. కాబట్టే ఢిల్లీకి పోయి, కేంద్రంపై నెపం నెట్టి, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ధర్నా పేరుతో నాటకమాడుతున్నారు. బీసీలపై కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, 42% బీసీ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లిం రిజర్వేషన్లను తీసేసి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆసిఫాబాద్, మంచిర్యాల, కాగజ్ నగర్ ప్రాంతాల్లో రైతులకు పైసా లాభం లేదు. సాగునీరు రావడం లేదు. లక్షల కోట్ల ఖర్చుతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో తుమ్మడిహట్టిలో ప్రాజెక్టు కట్టేందుకు నిర్ణయించి, దాని DPR కేంద్రానికి సమర్పిస్తే , తప్పకుండా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన నుంచి,.. నిధులు, రుణసాయం అందిస్తుంది. అప్పుడు ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ రూపొందించి సమర్పించాలి.