– దౌర్జన్యాలు, దోపిడీ, దొంగతనాలు చేసుకోవడానికి అనుమతిచ్చారా?
– జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులపై దాడులు చేస్తున్నా చర్యలు తీసుకోరా?
– పాతబస్తీకి ఒక రూల్, ఇతర ప్రాంతాలకు మరో రూల్ ను అమలు చేస్తున్నారా?
– మీరే హోం…మీ చేతగానితనానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి
– కాంగ్రెస్ పాలనలో హిందువులకు రక్షణ లేకుండా పోయింది
– పక్కనున్న పాతబస్తీనే అభివృద్ధి చేయలేనోడు ఆదిలాబాద్ ను అభివృద్ధి చేస్తానంటే నమ్మేదెలా?
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
– పాతబస్తీలోని మురళీధర్ ఆలయాన్ని దర్శించుకున్న బండి సంజయ్
– బెంగాలీ కుటుంబాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి
హైదరాబాద్: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయించాలని కోరిన బండి సంజయ్ అక్రమ నిర్మాణాల కూల్చివేతకు వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులపై దాడులకు తెగబడ్డ మజ్లిస్ నేతలను అరెస్ట్ చేయకపోవడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.
అక్రమ నిర్మాణాలు కూల్చిన చోటే గంటల వ్యవధిలో మళ్లీ నిర్మాణాలు చేపట్టినా చేష్టలూడిగిపోవడం సిగ్గు చేటు అని విమర్శించారు. ‘‘సీఎం గారు… పాతబస్తీని మజ్లిస్ కు రాసిచ్చారా? వాళ్లు ఎవరిపైనైనా దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలు, దొంగతనాలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారా? పాతబస్తీకి ఒక రూల్, ఇతర ప్రాంతాలకు మరో రూల్ ను అమలు చేస్తున్నారా?’’అని ప్రశ్నించారు.
పాతబస్తీలోని హైకోర్టు సమీపంలోని మురళీధర్ ఆలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అనంతరం బెంగాలీ కుటుంబాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చొరబాటు దారుల ఓట్లతో గెలవాలని మమతా బెనర్జీ కుట్రలు చేస్తోందన్నారు. బంగ్లా చొరబాటుదారులతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు.
బెంగాల్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ వేయనీయకుండా మమతా బెనర్జీ ప్రభుత్వం ఇబ్బందులు స్రుష్టిస్తోందదన్నారు. దేశభక్తులకు, దేశ ద్రోహులకు మధ్య జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయించి గెలిపించాలని బెంగాలీ కుటుంబాలను అభ్యర్ధించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, జె.సంగప్ప, పుల్లారావు యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉమామహేందర్, లంకల దీపక్ రెడ్డి తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏమన్నారంటే…
హైదరాబాద్ లో దాదాపు 60 వేల మంది బెంగాలీలు నివసిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడున్న వాళ్ల బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో మాట్లాడి బీజేపీకి ఓటేయించాలని కోరుతున్నా. బీజేపీకి ఓటేయిస్తామని హైదరాబాద్ లోని బెంగాలీ సమాజమంతా హామీ ఇచ్చారు. బెంగాల్ లో మమతా బెనర్జీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోంది. బంగ్లాదేశ్ చొరబాటుదారులకు రెడ్ కార్పేట్ పరుస్తూ దేశ భద్రతకు ముప్పు కలిగేలా చేస్తున్నారు. బెంగాల్ లో ఉండలేక చాలా మంది బెంగాలీలు హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు.
పాతబస్తీలోనూ బెంగాలీ కుటుంబాలు ఉండలేని విధంగా పరిస్థితులు నెలకొన్నాయి. 2014 కంటే ముందే యూపీఏ పాలనలో బంగ్లాదేశ్, ఇతర దేశాల నుండి అక్రమంగా వేల మంది హైదరాబాద్ కు వచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు రోహింగ్యాలకు రేషన్ కార్డులు, ఓటర్ కార్డులిచ్చి రెడ్ కార్పెట్ పర్చారు. చొరబాటుదారులతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.
బెంగాల్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ వేసేందుకు కేంద్రం ముందుకొస్తే… మమతా బెనర్జీ అడ్డంకులు స్రుష్టిస్తోంది. చొరబాటుదార్ల ఓట్లతో గెలవాలని మమతా బెనర్జీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. దేశభక్తులకు, దేశ ద్రోహులకు మధ్య బెంగాల్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీకి ఓటేసి దేశ భద్రతలో భాగస్వాములు కావాలని బెంగాల్ ప్రజలను కోరుతున్నా.
పాతబస్తీలో కొంత మంది బెంగాలీ కుటుంబాల పిల్లలను మజ్లిస్ గూండాలు డ్రగ్స్ ఎరవేసి లోబర్చుకునే ప్రయత్నం చేశారు. మజ్లిస్ గూండాల అరాచకాలకు పోలీసులూ వత్తాసు పలకడం సిగ్గు చేటు. పాతబస్తీలో అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులపై మజ్లిస్ ఎమ్మెల్సీ, నాయకులు అడ్డుకుని దౌర్జన్యం చేసినా చర్యలు తీసుకునే పాపాన పోలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనం.
మజ్లిస్ కు రేవంత్ రెడ్డి పూర్తిగా దాసోహమయ్యారు. ఫలితంగా జీహెచ్ఎంసీ కూల్చిన అక్రమ నిర్మాణాల స్థలంలో మళ్లీ మజ్లిస్ నేతలు నిర్మాణాలు చేపట్టినా చేష్టలుడిగి చూస్తుండటం సిగ్గు చేటు. రేవంత్ రెడ్డి సీఎంగా, హోం మంత్రిగా ఉన్నా ఏమీ చేయలేని అసమర్ధుడి మిగిలారు.
హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలుస్తుంటే అడ్డుకుంటే బీజేపీ కార్యకర్తలపై, పేదలపై లాఠీ ఛార్జ్ చేసి కేసులు పెట్టారు. పాతబస్తీలో మాత్రం అక్రమ నిర్మాణాలను కూలుస్తున్న అధికారులపై మజ్లిస్ దాడులు చేస్తున్నా కనీసం కేసులు పెట్టలేని అసమర్ధ సర్కార్ నడుస్తోంది. పాతబస్తీని మజ్లిస్ నేతలకు పూర్తిగా ధారాదత్తం చేశారా? పాతబస్తీలో ఒక రూలు… ఇతర ప్రాంతాలకు మరో రూల్ అమలు చేస్తున్నారా? మజ్లిస్ నేతలు పాతబస్తీలో దొంగతనాలు, దోపిడీలుసహా ఏదైనా చేసేందుకు లైసెన్స్ ఇచ్చారా?
దేవాలయాలపై దాడులు జరుగుతున్నా, గోవధ జరుగుతున్నా, లవ్ జీహాద్ పేరుతో హిందువులపై దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పాలనలో హిందువులకు రక్షణ లేకుండా పోయింది. పాతబస్తీని అభివృద్ధి చేయడం చేతగాని సీఎం బాసరకు పోయి ఆదిలాబాద్ ను వేల కోట్లతో అభివృద్ధి చేస్తాననడం పెద్ద జోక్. ఉపన్యాసాలకే రేవంత్ రెడ్డి పరిమితమయ్యారు. కేంద్రం పంచాయతీలకు నిధులిస్తున్నా… గ్రామాలను ఎందుకు అభివృద్ధి చేయడం లేదు. పాతబస్తీలో అధికారులు, పోలీసులపై జరుగుతున్న దాడులపై సీఎం వెంటనే స్పందించాలి. లేనిపక్షంలో పాతబస్తీలో పరిస్థితులు అదుపు తప్పే ప్రమాదముంది.