– దుగ్గుదూరు- ఉప్పుమిల్లి రోడ్డుకు మోక్షం
– రూ. కోటితో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన వాసంశెట్టి సత్యం
కాజులూరు: కాజులూరు మండలంలోని పది గ్రామాల ప్రజలు సరైనా రహదారి లేక ఇన్నాళ్లు పడిన కష్టాలకు మోక్షం లభించబోతున్నది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన కృషితో రహదారి సౌకర్యం కల్పించేందుకు అరబిందో ఫార్మా ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఈ పౌండేషన్ కు చెందిన రూ. కోటి సిఎస్ ఆర్ నిధులు వెచ్చించి రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. గురువారం కాజులూరు మండలం ఉప్పుమిల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు
వాసంశెట్టి సత్యం రహదారి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ రహదారి నిర్మాణానికి సిఎస్ ఆర్ నిధులు విడుదల చేసిన అరబిందో ఫార్మా పౌండేషన్ ఎం.డీ నిత్యానందరెడ్డిని అభినందించారు. ఇంతకాలం సరైన రహదారి లేక రవాణా సౌకర్యం కొరవడి అవస్ధలు పడిన పది గ్రామాల ప్రజల కష్టాలు ఇక తొలగిపోతాయన్నారు. రహదారి ఏర్పాటుకు మంత్రి వాసంశెట్టి సుభాష్ చూపిన చొరవను ఈ సందర్భంగా పది గ్రామాల ప్రజలు కొనియాడారు.
అధ్వానంగా ఉన్న రోడ్డుపై రాకపోకలు సాగించలేక ప్రజలు ఇబ్బందులు పడ్డామని అడుగడుగున గుంతలతో నిత్యం ప్రమాదాల బారిన పడేవారమనివారు తెలిపారు. అత్యవసర సమయంలో మండల కేంద్రానికి చేరుకోవడానికి గంటల తరబడి ప్రయాణించాల్సిన దుస్థితి నుంచి మంత్రి వాసంశెట్టి సుభాష్ మోక్షం కలిగించారని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలైన రోడ్లు, మంచినీరు కల్పించేందుకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తగు చర్యలు తీసుకుంటున్నారని వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు.