హైదరాబాద్: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయనను టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన బాధ్యతలు చేపట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి ఛాంబర్‌కు వచ్చిన ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు.
టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ టీఎఫ్‌డీసీకి పూర్వ వైభవం తీసుకురావాలని, అందుకు అందరి సహకారం అవసరమన్నారు. తెలంగాణ సంస్కృతిని ఆధారంగా చేసుకొని సినిమాలు వచ్చేలా చూడాలన్నారు. సినిమా పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా మరెంతో అభివృద్ధి చెందాలని టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా తనపై ఎంతో బాధ్యత ఉందని, ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు మధ్య వారధిగా పని చేస్తానన్నారు. పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని.. టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా అవకాశమిచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు.