గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పెన్షనర్లకు ఉదయం 6 గంటల నుండే వారి ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని, సోమవారం సాయంత్రానికి పించన్ల పంపిణీ నూరు శాతం పూర్తికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేశామని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గ ఎంఎల్ఏల గల్లా మాధవి, మహ్మద్ నసీర్ లతో కలిసి పట్టాభిపురం, ఆనందపేట తదితర ప్రాంతాల్లో పించన్ల పంపిణీ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు గుంటూరు నగరంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని వార్డ్ సచివాలయ కార్యదర్శుల ద్వారా పెన్షనర్ల ఇంటి వద్దనే అందిస్తున్నామన్నారు. నగరంలోని 206 వార్డ్ సచివాలయాల పరిధిలో వృధ్యాప్య, వికాలాంగులు, ఒంటరి మహిళా వంటి 27 కేటగిరిలు వారీగా ఉన్న 59,403 మంది పెన్షనర్లకు ఏప్రిల్ నుండి జూన్ వరకు హామీ ఇచ్చిన నెలకు వెయ్యితో కలిపి రూ.40,87,60,000లను వారి ఇంటి వద్దనే 1632 మంది వార్డ్ సచివాలయ కార్యదర్శుల ద్వారా అందించడం జరుగుతుందన్నారు.
పెన్షన్ ల పంపిణీ సజావుగా జరిగేలా పర్యవేక్షణకు 42 మంది నోడల్ అధికారులను నియమించి, ప్రతి గంటకు రిపోర్ట్ తీసుకొని, పించన్ల పంపిణీ వేగవంతంకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో గతంలో ప్రతి నెల షుమారు రూ.17 కోట్ల రూపాయలు పించన్ పంపిణీ చేస్తుండగా, ప్రస్తుతం పెరిగిన వెయ్యి రూపాయలతో కలిపి షుమారు రూ.25 కోట్ల రూపాయలు పించన్ దారులకు అందించడం జరుగుతుందన్నారు. సోమవారం సాయంత్రానికి పించన్ పంపిణీ నూరు శాతం పూర్తి అయ్యేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేశామని తెలిపారు.
పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబదించి నెలకు ఒక వెయ్యి, ప్రస్తుత నెలకు రూ.4 వేలు కలిపి ఏక మొత్తంగా రూ.7 వేలు అందించడం ద్వారా పెన్షనర్ల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందన్నారు. చంద్రబాబు పెన్షన్ పెంచడం ద్వారా పేదల ఇంటికి పెద్ద కొడుకులా అండగా నిలిచారన్నారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన అధికారాన్ని వారి సంక్షేమానికి కృషి చేసేలా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు.
తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నసీర్ మాట్లాడుతూ.. పెన్షన్ల పెంపు ద్వారా ముఖ్యమంత్రి ప్రతి ఇంటిలో పండగ వాతావరణం కల్గించారన్నారు. గతంలో రూ.2 వేలు, ప్రస్తుతం రూ.4 వేలకు పెంపు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతిగా నిలిచారన్నారు. ఎన్నికల హామీ మేరకు ఏప్రిల్ నుండే పెంపు అమలు చేశారన్నారు. పెన్షన్లన ఇంటింటికి పంపిణీ చేస్తున్న కార్యదర్శులు, పెన్షనర్లు అందుబాటులో లేకుంటే వారికి తగిన సమాచారం ఇచ్చి పెన్షన్ ఇవ్వాలని సూచించారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, వెంకట లక్ష్మీ, ఎంహెచ్ఓ మధుసూదన్, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, నోడల్ అధికారులు, సచివాలయం కార్యదర్శులు పాల్గొన్నారు.