– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి డిమాండ్
విజయవాడ: ఉల్లి రైతులను నిండా ముంచేశారు. కూటమి ప్రభుత్వానికి ఉల్లి రైతుల ఉసురు తగలకపోదు. రైతుల ఇంట కన్నీళ్ళు పెట్టించిన పాపం ముఖ్యమంత్రి చంద్రబాబుదే. ఉల్లి ఎండినా నష్టమే..ఇప్పుడు పండినా నష్టమేనని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఎకరాకు రూ.1.20లక్షల పెట్టుబడి పోసి పండిస్తే.. మీరిచ్చే ధర కిలోకి 50 పైసలా? క్వింటాకు 50 రూపాయలా? అని ఆమె ప్రశ్నించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే…
ఆరుగాలం కష్టించి ఉల్లి పండిస్తే రైతుకి దక్కిన ఆదాయం ఎకరాకు రూ.3వేలు మాత్రమే. ఉల్లి వేసిన కారణంగా ఒక్కో రైతుకి వచ్చిన నష్టం ఎకరాకు అక్షరాల రూ.లక్షా 15 వేలు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారే. అలాంటి ఉల్లి పండించే రైతే ఉరేసుకొనే పరిస్థితి వస్తే మీరేం చేస్తున్నారు? ఉల్లి రైతులను అప్పుల పాలు చేయడమా రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే? ఉల్లి రైతు కన్నీళ్లు పెడుతుంటే రాష్ట్రం సుభిక్షంగా ఎలా ఉంటుంది?
ధర లేక బేజారు అవుతుంటే ఉల్లి రైతు కళ్ళల్లో ఆనందం ఎక్కడుంటుంది? కర్నూల్ మార్కెట్ లో దళారుల ధరతో సంబంధం లేకుండా క్వింటాకు రూ.1200 ఇస్తాం అన్నారు. రైతులను ఉద్ధరించినట్లు గొప్పలు చెప్పారు. ప్రచార ఆర్భాటాలు చేసుకున్నారు. ఒక్క రైతుకైనా రూ.1200 గిట్టుబాటు ధర ఇచ్చారా?
ఒక్క కిలో అయినా మార్క్ ఫెడ్ సేకరించిందా? 50 పైసలకు అమ్ముకోలేక మార్కెట్ లోనే ఉల్లిని వదిలేస్తుంటే, కూలి ఖర్చుల మందం కూడా రాలేదని బోరున విలపిస్తుంటే ఎక్కడుంది రైతు కళ్ళల్లో ఆనందం? రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు టిక్కెట్ ధర వెయ్యికి పెంచేందుకు పెట్టిన శ్రద్ధ.. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంపై లేకపోవడం బాధాకరం. కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఉల్లి ధరాఘాతంపై ప్రభుత్వం తక్షణం స్పందించాలి.
అసెంబ్లీలో ప్రభుత్వ డబ్బా కొట్టడం కాదు. ఉల్లి రైతుల కష్టాల మీద చర్చ చేపట్టండి. మార్క్ ఫెడ్ ద్వారా ఇస్తామని చెప్పిన రూ.1200 వెంటనే అందేలా చూడండి. కర్నూల్ మార్కెట్ లో దళారుల మాయాజాలన్ని వెంటనే అరికట్టండి.