Suryaa.co.in

Andhra Pradesh

డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం పై చర్చ జరగాలి

– పోలవరం లో ప్రాజెక్ట్ సమీక్ష అనంతరం మంత్రి అంబటి రాంబాబు

పోలవరం ప్రాజెక్టుకు ప్రధానమైన డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి ఎవరు కారణమో అనే విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా పరిపూర్ణమైన చర్చ జరగాలని తాము నిజాయితీగా కోరుకుంటున్నామని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించిన అనంతరం రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు పాత్రికేయులతో మాట్లాడారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ కు పోలవరం ప్రాజెక్టు లైఫ్ లైన్ లాంటిదని ఆయన పేర్కొన్నారు అయితే అటువంటి ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం నిర్మించిన డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి కారణం ఎవరని ఆయన ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి పోలవరం ప్రాజెక్టుపై ప్రావీణ్యం కలిగిన వ్యక్తిగా ఉన్న అప్పటి తెలగుదేశం ప్రభుత్వంలోని జలవనరుల శాఖా మంత్రి సమయంలో నిర్మించిన డయాఫ్రం వాలు దెబ్బతినడానికి కారణం వారు కాదాఅని ఆయన ప్రశ్నించారు. కాపర్ డ్యాం పూర్తికాకుండా డయాఫ్రం వాలు పూర్తిచేయడం చారిత్రాత్మక తప్పిదం కాదాఅని తన ప్రశ్నకు ఇంతవరకు సరైన సమాధానం రాలేదన్నారు. దీనికి కారణమైన వారిని ప్రజలు క్షమించరని ఆయన వ్యాక్యానించారు.

ముమ్మాటికి డయాఫ్రం వాల్ నిర్మాణం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి అవగాహన రాహిత్యమేనని ఆయన పేర్కొన్నారు. పైగా తనకు మామూలు వాల్ కి, డయాఫ్రం వాల్ కి తేడా తెలియదని వ్యంగ్యంగా అంటున్నారన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డికి డయాఫ్రం వాల్ అంటే తెలియదని, పైగా రివర్స్ టెండరింగ్ వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతన్నదని అనడం హాస్యాస్పదం అన్నారు. వారు చేసిన తప్పును ప్రస్తుత ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నం చేయడం ఎంతమాత్రం తగదన్నారు. కొన్ని వార్తా పత్రికలు, చానల్స్ లో డయాఫ్రం వాల్ నిర్మాణానికి అనుమతులు తీసుకుని నిర్మించారు కదా అని తనను ప్రశ్నిస్తున్నారని అయితే అలా తీసుకుని ఉంటే అప్పటి ప్రభుత్వం తప్పిదం లేదా అని ఆయన ప్రశ్నించారు.

సాధ్యమైనంత త్వరలో పోలవరం పూర్తిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. పనులు పురోగతిపై అధికారులతో సమీక్షించామన్నారు. ఏ మేరకు ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి ఎంతవరకు పనులను వేగవంతంగా ముందుకు తీసువెళ్లతామని అంశాలపై సమీక్షించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం డయాఫ్రం వాల్ లోపాయిభూయిష్టంగా నిర్మించి సుమారు రూ. 400 కోట్లు వృధాతోపాటు ప్రాజెక్టును సమస్యల సుడిగుండంలోకి నెట్టివేసి ఆ తప్పును ఎదువారిపై రుద్దేందుకు గత పాలకులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ విషయంలో మేధావులు నీటిపారుదల రంగం నిపుణులు చర్చించాలని కోరుకుంటున్నామన్నారు. డయాఫ్రం వాల్ కు మరమ్మత్తులు చేయాలా పునర్మించాలా అనే విషయంపై ఇరిగేషన్ నిపుణులు నిర్ణయం తీసుకోవల్సి ఉందన్నారు.

తమ ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టును తప్పనిసరిగా పూర్తిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 2018 లో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి ఎన్నికలకు వెళతామన్నారని అటువంటిది ఎందుకు ప్రాజెక్టును పూర్తిచేయలేకపోయారని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. అటువంటి వారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రాజెక్టు నిర్మాణం ఏ తేదీకి పూర్తవుతుందని అడగటం సిగ్గుచేటన్నారు. ఏదేమైనప్పటికి పోలవరం ప్రాజెక్టును తమ ప్రభుత్వమే పూర్తి చేయడం మాత్రం ఖాయమని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సమావేశంలో పోలవరం శాసన సభ్యులు తెల్లం బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE