– ‘స్వచ్ఛ ఆంధ్ర’తో సీజనల్ వ్యాధులు గతంలో కన్నా తగ్గాయి
– నూజివీడుకు త్వరలో కొత్త శానిటేషన్ మిషన్లు
– సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
నూజివీడు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు గతం కన్నా తగ్గాయని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా నూజివీడు పట్టణ ఉర్దూ పాఠశాల ప్రాంగణంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం భాగంగా విద్యార్థులచే మంత్రి మొక్కలు నాటించి, ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. వ్యాధులకు మూలం అపరిశుభ్ర వాతావరణమన్నారు. ప్రజలంతా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడం అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏటా 25 వేల కోట్ల రూపాయలకు పైగా ప్రజారోగ్య పరిరక్షణకు ఖర్చు చేస్తోందన్నారు. వ్యాధుల మూలంగా ప్రజలు ఆర్థికంగా నష్టపోవడమే కాక, శారీరకంగా కూడా బలహీనులవుతారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాధులు వచ్చిన తరవాత చికిత్స కన్నా వ్యాధులు రాకుండా నివారణకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాయన్నారు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే లు అందరూ స్వచ్ఛ ఆంధ్ర.. స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలలో పరిశుభ్రతపై, అవగహన, చైతన్యం తీసుకువస్తున్నారన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు ప్రతీ నెలలో మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా గత జనవరి నెల నుండి పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ చేపడుతున్నారని, మార్పు ఎప్పుడూ ఒక్క రోజుతో రాదని, ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంతో రాష్ట్రంలో ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు గతంలో కన్నా తక్కువగా నమోదయ్యాయని, ఇది ఒక మంచి శుభ పరిరణమన్నారు.
పరిసరాల అపరిశుభ్రంగా, డ్రైనేజీలలో మురుగునీరు నిల్వ కారణంగా దోమలు వ్యాప్తిచెంది మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగ్యూ వంటి విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ శుభ్రం పాటిస్తే వ్యాధులు దరిచేరవన్నారు. పరిశుభ్రత ప్రతీ ఒక్కరి జీవితంలో భాగంగా కావాలని, ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించినప్పుడే వ్యాధులు మన దరిచేరవని, అనారోగ్యానికి గురికానివారి జీవిత కాలం పెరుగుతుందన్నారు.
వ్యక్తిగత, పరిసర పరిశుభ్రత పై గతంలో కరోనా మనకు ఒక గుణపాఠం నేర్పిందన్నారు. నూజివీడు పట్టణంలో శానిటేషన్ కోసం త్వరలో యంత్రాలు కొనుగోలు మిషన్లతో వీధుల శుభ్రం చేస్తామన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థుల పర్యావరణ పరిరక్షణ, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యతలను మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బి.వినూత్న తహసీల్దార్ భద్రు, పాఠశాల విద్యార్థులు, స్థానిక ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.