– ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ బీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన సీజేఐ
– స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించాలనే అంశంపై పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలి
– హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోవడంలో డివిజన్ బెంచ్ తప్పు చేసింది
– ‘ఆపరేషన్ సక్సెస్- పేషెంట్ డైడ్’ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు
– ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ సంచలన తీర్పు
న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను అనుమతించిన సుప్రీం ధర్మాసనం, వీలైనంత త్వరగా లేదా 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు వేటు వేయాలంటూ బీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తిని సీజేఐ గవాయ్ తోసిపుచ్చారు . హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించాలనే అంశంపై పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలని సీజేఐ గవాయ్ ఆదేశించారు.
‘పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలను వీలైనంత త్వరగా లేదా 3 నెలల్లోపు నిర్ణయించాలి. ఏ ఎమ్మెల్యే అయినా స్పీకర్ ప్రక్రియను పొడిగించాలని అడగకూడదు. అలా చేస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయాలు తీసుకోవచ్చు. రాజకీయ ఫిరాయింపులు జాతీయ చర్చనీయాంశంగా మారింది.
దాన్ని అరికట్టకపోతే, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తి దానికి ఉంది. వివిధ సందర్భాల్లో ఈ అంశంపై పార్లమెంటులో చేసిన వివిధ ప్రసంగాలను కూడా పరిశీలించాం. రాజేష్ పైలట్, దేవేంద్ర నాథ్ మున్షి లాగా అనర్హత చర్యలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం కోర్టుల ముందు జాప్యాన్ని నివారించడమే.
పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు కట్టబెట్టారు. ఆర్టికల్స్ 136, 226, 227 లకు సంబంధించి న్యాయ సమీక్ష అధికారాలు చాలా పరిమితంగా ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోవడంలో డివిజన్ బెంచ్ తప్పు చేసింది. స్పీకర్ ఒక న్యాయనిర్ణేత అధికారిగా వ్యవహరిస్తూనే హైకోర్టు, సుప్రీంకోర్టు అధికార పరిధికి లోబడి ఉండే ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారు.’ అని ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది.
స్పీకర్ అలా వ్యవహరిస్తూనే రాజ్యాంగపరమైన రక్షణని పొందలేరు. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ 2014 నవంబర్ 22న తీర్పును పక్కన పెడుతున్నాము. ఒక ముఖ్యమైన నిర్ణయంలో శాసనసభ స్పీకర్లు, ప్రజాస్వామ్యానికి ప్రమాదం కలిగించే ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునే విషయంలో ఆలస్యం చేస్తారు. కాబట్టి, ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేల అనర్హతపై ప్రస్తుతం ఉన్న యంత్రాంగాన్ని, పార్లమెంటు సమీక్షించాల్సిన అవసరం ఉంది.
ఇటువంటి చర్యలు సంవత్సరాల తరబడి సాగడం వల్ల అర్థరహితంగా మారుతుంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసిన తర్వాత మాత్రమే స్పీకర్ నోటీసు జారీ చేయడం దురదృష్టకరం. ‘ఆపరేషన్ సక్సెస్- పేషెంట్ డైడ్’ అన్న సూత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు’ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
దీనితో తెలంగాణ స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది. తాను న్యాయనిపుణులతో సంప్రదిస్తానని, ఈ అంశంపై ఈపాటికే నోటీసులు ఇచ్చినట్లు స్పీకర్ వెల్లడించారు.