-కౌంటింగ్‌కు సాయుధ బలగాలతో పటిష్ఠ బందోబస్తు
-జిల్లాలో జరిగిన అల్లర్లలో నిందితుల కోసం ప్రత్యేక బృందాలు
-అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో ముమ్మరంగా కార్డన్ సెర్చ్
-సిట్ కేసుల్లో 32 మందిని అరెస్టు చేశాం
-పెట్రోల్ బంకుల్లో విడిగా పెట్రోలు, డీజిల్ అమ్మరాదు
-పల్నాడు జిల్లా నూతన ఎస్పీ మల్లికా గార్గ్
-మాచర్లలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసు కవాతు
పోలింగ్ రోజున, అనంతరం మాచర్లలో జరిగిన సంఘటనల దృష్ట్యా నూతన ఎస్పీ మల్లికాగార్గ్ మంగళవారం మాచర్ల పట్టణంలో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అదే విధంగా పట్టణ, రూరల్ పోలీసుస్టేషన్లను తనిఖీ చేశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడారు. శాంతిభద్రతలకు విఘా తం కలిగిస్తే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉందని ముగ్గురి కంటే ఎక్కువ మంది గుమికూడరాదని సూచించారు. జిల్లాలో ఎక్కువ సంఖ్యలో కేంద్ర సాయుధ బలగాలు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌లు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ఏ పెట్రోల్ బంకులోనూ విడిగా పెట్రోలు, డీజిల్ అమ్మరాదని వారికి ముందస్తుగా నోటీసు ఇవ్వడం జరిగిందని, ఆదేశాలను ఉల్లంఘిస్తే పెట్రోల్ బంకులు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
146 కేసుల్లో 1500 మంది నిందితులు
ఎన్నికల సమయంలో ట్రబుల్ మంగర్స్‌గా గుర్తించి పలువురిని బైండోవర్ చేయగా అందులో సుమారు 250 మంది బైండోవర్‌ను ఉల్లంఘించడం జరిగిందని, వీరిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి బాండ్ అమౌంట్‌ను కట్టిం చడం జరుగుతుందన్నారు. లేనిపక్షంలో వారంట్ తీసుకుని జైలుకు పంపడం జరుగుతుందని వివరించారు. జిల్లాలో ఎన్నికలకు సంబంధించి మొత్తం 146 కేసులు నమోదయ్యాయని, ఇప్పటివరకు 1500 మందిని నిందితులుగా గుర్తించినట్లు తెలిపారు. దీనిలో ఇప్పటివరకు 950 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. మిగిలిన వారిని కూడా వీలైనంత త్వరగా అరెస్టు చేస్తామని, దీనికి సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
సిట్ కేసులలో 32 మంది అరెస్ట్
ఈ కేసులలో సిట్ పర్యవేక్షిస్తున్న కేసులకు సంబంధించి వీడియో ఫుటేజ్ ద్వారా ఇంకొంత మంది నిందితులను చేర్చి లీగల్ ఒపీనియన్ ద్వారా సెక్షన్‌లను యాడ్ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో సిట్ కేసులలో ఈ ఒక్కరోజే 32 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. పోలింగ్ రోజు, పోలింగ్ తేదీకి ముందు, పోలింగ్ తర్వాత జరిగిన కేసులకు సంబంధించి ఈ ఒక్కరోజే 76 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా సత్తెనపల్లి సబ్ డివిజన్‌లో మంగళవారం రెండు రౌడీ షీట్లను ఓపెన్ చేసినట్లు తెలిపారు.
అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో కార్డన్ సెర్చ్
అసాంఘిక శక్తులను గుర్తించుటకు జిల్లాలో ప్రతిరోజూ అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మంగళవా రం 19 పోలీసుస్టేషన్ల పరిధిలో 20 గ్రామాలను సందర్శించి ఎటువంటి డాక్యుమెంట్స్ లేని 49 బైక్‌లను సీజ్ చేసినట్లు వివరించారు. ఎన్నికల నేరాలలో ఈ ఒక్కరోజే 32 మందిని రిమాండ్‌కు పంపించాం. 44 మందికి 41ఏ నోటీ సులు ఇచ్చాం. 12 పోలీసుస్టేషన్ల పరిధిలో 19 102 సీఆర్‌పీసీ కేసులు పెట్టి 34 వెహికల్స్ మీద కట్టడం జరిగినది. ఈ కార్యక్రమంలో గురజాల డీఎస్పీ చుం డూరు శ్రీనివాసరావు, కేంద్ర సాయుధ బలగాల కమాండెంట్లు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, ఎస్‌బి సీఐ, గురజాల సబ్ డివిజ న్‌లోని పోలీసు అధికారులు పాల్గొన్నారు.