– ఇక భూ రికార్డులు ఎవరూ తారుమారు చేయలేరు
– 1.37 లక్షల ఎకరాల ఇనాం భూముల్ని 22ఏ నుంచి తొలగింపు
– ఆటో మ్యుటేషన్ తర్వాత నేరుగా ఇంటికే పాస్ పుస్తకం
– రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లని తప్పుడు ప్రచారం
– కన్నతల్లిని కోర్టుకీడ్చిన వ్యక్తికి మహిళల గురించి మాట్లాడే అర్హతుందా..?
– అధికారంలో ఉంటే విధ్వంసం…లేకపోతే బెదిరింపులు
– మినీ గోవాగా సూర్యలంక బీచ్ అభివృద్ధి
– సూరేపల్లి ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
వేమూరు: రాష్ట్రంలో భూ సమస్యలను లేకుండా చేసేందుకు ప్రభుత్వం పని చేస్తోందని, 2027 మార్చి నాటికి 1.12 కోట్ల పట్టదారు పాసుపుస్తకాలను పంపిణీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక్క రూపాయి కూడా అవినీతికి తావు లేకుండా పాసుపుస్తకాలు అందింస్తున్నామని తెలిపారు. ఆటో మ్యుటేషన్ తర్వాత నేరుగా ఇంటికి పాస్ పుస్తకాలను పంపాలని అధికారులను ఆదేశించారు.
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం సూరేపల్లి గ్రామంలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించారు. వేదికపై రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు. వారి సమక్షంలోనే పొలం వివరాలను అధికారులతో చదివి వినిపించారు అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”గత పభుత్వంలో ప్రజల భూమిపై కన్నేసి కబ్జాలు చేశారు. ప్రశ్నించిన వారిని కట్టడి చేసేందుకు బ్లాక్ మెయిల్ చేశారు. రికార్డులు తారుమారు చేశారు. ప్రతీ గ్రామంలో, ప్రతి ఇంటిలో భూ వివాదాలకు తెరలేపి భయానక వాతావరణం సృష్టించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపైనా జగన్ తన ఫోటో వేసుకున్నాడు. సరిహద్దు రాళ్లపైనా బొమ్మలు చెక్కించుకున్నాడు. ఇందుకోసం వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. వారు అధికారం నుంచి దిగిపోయినా పాపాలు, అక్రమాలు ఇంకా వెంటాడుతున్నాయి. అంతలా రెవెన్యూ వ్యవస్థను నాశనం చేశారు.
ప్రజల ఆస్తులకు భద్రత, ప్రజల జీవితాలకు భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో ప్రతీ నెల నేను స్వయంగా పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నాను. భూమి అనేది ఆస్తి మాత్రమే కాదు. భద్రత, జీవనాధారం. అర్జీల్లో రెవెన్యూ సమస్యలవే ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలని సంకల్పించాం. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం రీ సర్వే 2.0 చేపట్టాం. రాష్ట్రంలో మొత్తం 16,816 గ్రామాల్లో రీ సర్వే చేయాల్సి ఉండగా, ఇప్పటికే 6,976 గ్రామాల్లో పూర్తి చేశాం. 2027 మార్చి నాటికి రీ సర్వే పూర్తి చేసి ప్రతి ఒక్కరికి రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలు ఇస్తాం. ఈ జనవరి నుంచి మార్చి వరకు 21.23 లక్షల కొత్త పాసుపుస్తకాలు ఇచ్చాం.
ఈ నెలలో 356 గ్రామాల్లో 1,56,433 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. జూలై నాటికి మరో 9 లక్షల పట్టాదారు పుస్తకాలు ఇస్తాం. 11,099 గ్రామాల్లో కొత్తగా ఇవ్వాల్సిన 80 లక్షలు పాస్ పుస్తకాలను వచ్చే ఏడాది మార్చి నాటికి పంపిణీ చేస్తాం. 1.10 కోటి మందికి పాస్ పుస్తకాలు ప్రజలకు అందిస్తాం. కరెన్సీకి వాడే టెక్నాలజీనే పాస్ పుస్తకాలకూ వాడుతున్నాం. భవిష్యత్‌లో ఎవరూ రికార్డులు తారుమారు చేయలేరు. రాజీలేకుండా మూడుసార్లు పట్టాదారుకు చెప్పి ఈ కేవైసీ చేస్తున్నాం.
రికార్డులు ట్యాంపరింగ్ చేయకుండా వాటిని భద్రపరిచేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్ పెట్టాం. రికార్డుల లాకర్ సిస్టమ్ తెచ్చాం. దీని ద్వారా భూ యజమానులు ఆధార్, ఈ కేవైసీ ఇచ్చి తమ భూముల రికార్డులు లాక్ చేసుకోవచ్చు. రికార్డ్ లాకింగ్ అనేది రక్షణ కవచంగా ఉంటుంది. ప్రజల ఆస్తులకు, భూములకు రక్షణ కల్పించేందుకు ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేశాం.”అని ముఖ్యమంత్రి చెప్పారు.
లక్షలాది ఎకరాలకు విముక్తి
“1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22ఏ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఇతర సర్వీస్ ఇనాంలోని మరో లక్ష ఎకరాల భూములకూ విముక్తి కల్పించేందుకు 2019లోనే ఆర్డినెన్స్ తెచ్చాం. 2016కు ముందు ఏదైనా ప్రభుత్వ హౌసింగ్ స్కీంలో పట్టా పొందిన ప్రతి ఇంటికీ రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించాలని నిర్ణయించాం. ఈ నిర్ణయం దాదాపు 75 లక్షల పేద కుటుంబాలకు వరంగా మారనుంది. 2016 ముందు పట్టా కలిగిన యజమాని… నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు, విక్రయించేందుకు, గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది.
22-ఏ నిషేధిత భూముల జాబితాను పూర్తిగా సంస్కరిస్తున్నాం. గత ప్రభుత్వంలో 14 లక్షల ఎకరాల పట్టా భూముల్ని 22ఏలో పెడితే గుర్తించాం. 22ఏపై కలెక్టర్ అధికారాలు వికేంద్రీకరిస్తున్నాం. జేసీ, ఆర్డీవోలకు కొన్ని అధికారాలు బదలాయించాలని నిర్ణయించాం. దీంతో సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. వెబ్‌ల్యాండ్ తప్పులు సుమోటోగా సరిదిద్దేలా ఆర్డీవోలు, తహశీల్దారులకు అధికారం ఇస్తాం. ఇప్పటికి 13.59 లక్షల ఎకరాల భూమి ఫ్రీహోల్డ్ కింద ఉంది. ఇందులో అర్హత కలిగిన 9.25 లక్షల ఎకరాల భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తాం. నిలుపుదల ఉత్తర్వులను ఎత్తివేస్తున్నాం.
భూ వినియోగ మార్పులు, మిస్సింగ్ సర్వే నంబర్ల సేవలను త్వరలో ప్రారంభిస్తున్నాం. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు 9 లక్షల భూ లావాదేవీలు ఆటో-మ్యూటేషన్ చేశాం. సేల్, బహుమానం, పార్టీషన్ డీడ్స్‌లో 100 శాతం ఆటో-మ్యూటేషన్ తీసుకొచ్చాం. పట్టణ ప్రాంతంలోని ఆస్తులను కూడా ఆటోమ్యూటేషన్‌లోకి తీసుకువచ్చాం. ఇకపై పాస్‌బుక్ కోసం అధికారులు చుట్టూ, కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన అవసరం ఉండకూడదు. ఆస్తి అమ్మితే నేరుగా మీ ఇంటికే పాస్ బుక్ వస్తుంది. ఆటోమ్యుటేషన్ తో పాటు, పాస్ బుక్ కూడా ప్రింట్ చేసి నేరుగా యజమానికి ఇంటికి అధికారులు పంపాలి. వారసత్వంగా వస్తున్న భూముల విషయంలోనూ సంస్కరణలు తెచ్చాం.
రూ.10 లక్షల లోపు ఆస్తులకు రూ.100, రూ.10 లక్షల పైబడి ఆస్తులకు రూ.1,000తోనే రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం తెచ్చాం. రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి ఎదురు చూడకుండా స్లాట్ బుకింగ్ విధానం తెచ్చాం. ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే ఇలాంటివన్ని ఎప్పుడో అమల్లోకి వచ్చేవి. కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాల విషయంలో పంతాలకు పోవద్దు. కన్నతల్లిని కోర్టుకు ఈడ్చిన వ్యక్తి ఆదర్శం కాదు. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి. పొలం గట్లు దగ్గర ఒక సెంటు కోసం కొట్లాడుకుని పోలీస్ స్టేనషన్ల చుట్టూ తిరుగుతుంటారు. కక్షలకు దూరంగా ఉండి గౌరవంగా బ్రతుకుదాం. భూ వివాదాలు ఉండే గ్రామాలను కలెక్టర్లు గుర్తించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.” అని సీఎం చంద్రబాబు సూచించారు
అమరావతికి రూ.2 లక్షల కోట్లంటూ తప్పుడు ప్రచారం
“అమరావతి పేరు పలకడం కూడా ఇష్టం లేని వారికి పాలించే అర్హత ఎక్కడిది..? జగన్ లాంటి వెయ్యి మంది సైకోలు వచ్చినా అమరావతి నిర్మాణం ఆగదు. మొన్నటి వరకూ మూడు రాజధానులు అన్నారు. ఇప్పుడు మావిగన్ అంటున్నారు. విజయవాడ, గుంటూరు సమీపంలో రాజధాని కట్టేందుకు నేను ఇచ్చిన పిలుపుతో 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ఇచ్చారు. దేవతల రాజధాని అమరావతి. ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అన్ని ప్రార్థనాలయాల్లో పవిత్రమైన నీరు, మట్టి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం.
హైకోర్టు, సుప్రీంకోర్టు అమరావతికి మద్దతుగా నిలిచాయి. 2019కి ముందు బాబాయిని చంపి ఆ నేరాన్ని నాపై వేశాడు. నా చేతిలో కత్తి పెట్టి సాక్షి పత్రికలో తప్పుడు కథనం రాశారు. అమరావతిపై కక్ష గట్టి రైతుల త్యాగాలకు విలువ లేకుండా చేశారు. అమరావతి నిర్మాణానికి రూ.2 లక్షలు ఖర్చు అని అసత్య ప్రచారం చేస్తున్నాడు. అమరావతి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు. మహిళా రైతులను ఇబ్బందులు పెట్టారు. మహిళలు స్నానాలు చేస్తుంటే డ్రోన్ లతో చిత్రీకరించారు. వారిని జట్టు పట్టుకుని బయటకు లాగారు. లాఠీలతో కొట్టారు.
న్యాయస్థానం టూ దేవస్థానం కార్యక్రమం చేపడితే రోడ్డుపై భోజనం చేయనివ్వకుండా హింసించారు. అమరావతి నుంచి అరసవిల్లి వెళ్లాలంటే వారిపై దౌర్జన్యం చేశారు. మహిళల గురించి, నా భార్య గురించి వ్యక్తిగత దూషణలు చేశారు. గత ఐదేళ్లలో మహిళలను వాళ్లకు మహిళల గౌరవం గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి మహిళలు వీరోచితంగా పోరాడారు. చివరకు న్యాయం గెలిచింది. అమరావతి అజరామరం. అమరావతే ఏపీ రాజధాని అని రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లుకు 49 రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తే ఒకే ఒక్క సైకో పార్టీ సపోర్ట్ చేయలేదు.”అని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.
అధికారంలో విధ్వంసం…లేకపోతే బెదిరింపులు
“నాడు ఐదేళ్లు అధికారంలో ఉండి విధ్వంసం సృష్టించారు…అధికారం పోయాక బెదిరిస్తున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడికి యత్నించారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక విచారణలు చేసి అందర్నీ పట్టుకొస్తానని బెదిరిస్తున్నాడు. సాక్షి పత్రికలో రాసిన రాతలు, మహిళలపై చేసిన వ్యక్తిత్వ హననం మరిచిపోయారా? రాజకీయ పార్టీ లేకపోతే జగన్ ఇంట్లో నుంచి బయటకు రాగలరా..? రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కుట్ర చేస్తున్నారు. నాది న్యాయబద్ధ పాలన. ప్రజాస్వామ్యాన్ని కాపాడతాను. ప్రజలకు ఇబ్బందులు వస్తే నా ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడాను.
రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. జగన్ రెడ్డి అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చి బెదిరించి పారిపోతాడు. ఇలాంటి నేతలు మనకు అవసరమా..? 50 మందిని పోగేసుకొచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం నాకు పెద్ద కష్టం కాదు. కానీ నేను చట్ట ప్రకారమే వెళతాను. ఏ తప్పు చేయని నన్ను నోటీస్ కూడా ఇవ్వకుండా జైల్లో పెట్టాడు. ఇలాంటి నేతలను ప్రోత్సహిస్తే ఎవరికీ రక్షణ ఉండదు. భవిష్యత్ ఉండదు. మనందరి జీవితాలు బాగుండాలంటే ఇలాంటి వ్యక్తులను మర్చిపోవాలి. ఏమారితే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది.”అని సీఎం చంద్రబాబు అన్నారు.
సూర్యలంక బీచ్‌ను మినీ గోవాగా అభివృద్ధి
“ప్రతీ వ్యక్తికి సంక్షేమం, అభివృద్ది ఎలా అందుతోంది, అధికారులు ప్రజలతో ఎలా వ్యవహరిస్తున్నారో సమాచారం తెప్పిస్తున్నాం. ప్రజలకు సేవకులుగా పని చేస్తున్నాం. కుల, మత, ప్రాంతాల వారీగా రాజకీయాలు చేస్తే అభివృద్ధి ఉండదు. గత ఐదేళ్లూ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. రాష్ట్రంలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజానికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌ను మరో గోవాగా తయారుచేస్తాం. ఈ ప్రాంతంలో టూరిజాన్ని ప్రోత్సహించడం వల్ల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
ఇక్కడి ప్రజల ఆదాయం పెంచడంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సముద్రపు నాచు సీవీడ్ ద్వారా మత్స్యకారులు స్థానికులకు అదనపు ఆదాయం వస్తుంది. మత్స్యకారుల జీవనోపాధికి నష్టం రాకూడదు. మన సముద్ర జలాలపై మత్స్యకారులదే హక్కు. ఇతర ప్రాంతాల జాలర్లు వస్తే ఉపేక్షించేంది లేదు. గత ప్రభుత్వంలో 217 జీవో ద్వారా స్థానిక నీటి వనరుల్లో చేపల పెంపకానికి మత్స్యకారులను దూరం చేశారు. మేం అధికారంలోకి వచ్చాక దానిని రద్దు చేసి మత్స్యకారుల జీవనానికి సహకరించాం.”అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
వేమూరు నియోజకవర్గ అభివృద్ధికి హామీలు
“రాష్ట్రం బాగుండాలంటే కూటమి ప్రభుత్వం సుధీర్ఘంగా అధికారంలో ఉండాలి. త్వరలో మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు రానున్నాయి. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే అదే వారికి చివరి రోజవుతుంది. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు అంతా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. నేను ఉద్యోగులకు అండగా ఉంటాను.
వేమూరు నియోజకవర్గంలో తుంగభ్రద డ్రైయిన్‌పై బ్రిడ్జ్ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నాం. కొల్లూరు ఫర్రీ రోడ్డుపై హెచ్ ఎల్ బీ నిర్మాణానికి రూ.15 కోట్లు కేటాయిస్తాం. భట్టిప్రోలు, పెసలకం రోడ్డుపై కల్వర్టు నిర్మాణానికి రూ. 2 కోట్లు మంజూరు చేస్తాం. రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. లంక గ్రామాలు కోతకు గురికాండా చర్యలు తీసుకుంటాం. అలాగే వేమూరులో ఫైర్ స్టేషన్ మంజూరు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.”అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
పీ4 కింద రోడ్డు నిర్మాణానికి యాజలి గ్రామానికి చెందిన సత్యనారాయణ రాజు రూ.కోటి విరాళాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్ బాబు, నరేంద్ర వర్మ, సీఎస్ సాయి ప్రసాద్, ఎంపీ కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.