Suryaa.co.in

Andhra Pradesh

వేమిరెడ్డి దంపతుల గొప్ప మనసు

– 4 వేల మంది టీటీడీ ఉద్యోగులకు వస్త్రాల బహూకరణ
– బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏటా దుస్తుల పంపిణీ
– దాతృత్వం పరంగా ఆ కుటుంబం ఎప్పుడూ ముందుంటుంది
– అడిషనల్‌ ఈవో వెంకయ్య చౌదరి

తిరుపతి, మహానాడు: నెల్లూరు పార్లమెంట్‌ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు గొప్ప మనసు చాటుకున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి సేవలో పాల్గొంటున్న దాదాపు 4000 వేల మంది తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, సిబ్బందికి వస్త్రాలను బహూకరించారు.

ఎంపీ వేమిరెడ్డి దంపతులు.. బుధవారం ఉదయం టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్‌ ఈవో వెంకయ్య చౌదరి చేతులమీదుగా టీటీడీ స్టాఫ్‌, వాహన బేరర్స్‌, అర్చకులు, లడ్డూ పోటు వర్కర్స్‌, కల్యాణకట్టలో విధులు నిర్వహించే సిబ్బంది, అలాగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్న ఇతర విభాగాల సిబ్బందికి వారు వస్త్రాలు అందించారు. తమ సేవలు గుర్తించి ఏటా వస్త్రాలను బహూకరిస్తున్న వేమిరెడ్డి దంపతులకు ఆయా ఉద్యోగులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ.. అయిదేళ్ళుగా టీటీడీ ఉద్యోగులకు వస్త్ర బహూకరణ నిర్వహిస్తున్నామని చెప్పారు. స్వామివారికి సేవలు చేసే వారికి సేవ చేయడం చాలా సంతోషంగా ఉంటుందన్నారు. అందుకే వాహన బేరర్స్‌, అర్చకులు వంటి అన్ని విభాగాల సిబ్బందికి వస్త్రాలను బహూకరించామని తెలిపారు.

అడిషనల్‌ ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. ఎంతో గొప్ప మనసుతో శ్రీవారి సిబ్బందికి వేమిరెడ్డి దంపతులు వస్త్రాలను బహూకరించడం చాలా సంతోషదగ్గ విషయమన్నారు. బ్రహ్మోత్సవాలు అంటే పండుగ వాతావరణమని, ఇలాంటి వాతావరణంలో కొత్త బట్టలు పెట్టడం హర్షణీయమన్నారు. దాతృత్వం పరంగా వేమిరెడ్డి కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. వేంకటేశ్వరస్వామివారి పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉన్న వేమిరెడ్డి దంపతులకు శ్రీవారి ఆశీసులు ఎప్పుడూ ఉంటాయని ఆకాంక్షించారు. అనంతరం సిబ్బందికి వస్త్రాలను బహూకరించారు. కార్యక్రమంలో టీటీడీ ఉద్యోగులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE