– మాదిగలంతా జగన్ వెంటే..
– దళితులను అవమానించిన ద్రోహలంతా టీడీపీలోనే ఉన్నారు
– బాబు హయాంలో మాదిగలకు ఏ మేలూ జరగలేదు
– ఎన్నికలనగానే బాబు కులాల కుంపట్లు రాజేస్తున్నాడు
– బాబు కుట్రను అర్థం చేసుకుని దళితులే నిలదీయాలి
నా ఎస్సీ, నా ఎస్టీ.. అన్న దమ్మున్న నేత జగన్
– అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ ఆశయాలకు తగ్గట్టు పరిపాలిస్తున్నారు
– ప్రాథమిక స్థాయి నుంచే విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చారు
– పేదపిల్లలకు ముందెన్నడూ ఎరుగనట్టుగా ఇంగ్లీషు మీడియం విద్య
– ఆత్మగౌరవం నిలబెట్టే సంక్షేమంతో దళితుల జీవితాల్లో వెలుగులు
– అందుకే, దళితులంతా జగన్ వెంటే నడుస్తారు
– మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకరావు స్పష్టీకరణ
వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకరావు మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటేః
బాబుకు గులాంగిరి చేస్తున్నందుకు సిగ్గుపడాలిః
టీడీపీ కార్యాలయంలో కులాలవారీగా ఆత్మీయ సమావేశాల పేరుతో చంద్రబాబు చాలా దారుణమైన రాజకీయం చేస్తున్నాడు. కులాల కుంపట్లు రగిల్చే నీచమైన మనస్తత్వమున్న ఆయన తన పార్టీ కార్యాలయంలో పెట్టించే ఆత్మీయసమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రిని, ఇతర ప్రభుత్వ పెద్దల్ని తిట్టిస్తున్నారు. దీన్ని మేం ఖండిస్తున్నాం. ఆదినుంచీ టీడీపీలో దళితవర్గ నాయకులకు అనేక అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా..? అని స్వయంగా చంద్రబాబే అన్నాడు.
ఆయన్ను ఆదర్శంగా తీసుకుని మా చెమట వాసన పడదంటాడు ఆపార్టీలో ఒకడు.. దళితులకు చదువు అబ్బదంటాడు.. మేం శుభ్రంగా ఉండలేమని అదేపార్టీకి చెందిన మరొకడు అంటాడు. మరి, గతంలో ఇలా మాట్లాడిన మాటలన్నింటినీ మరిచిపోయి.. మళ్లీ ఎన్నికలొస్తున్నాయని మాదిగల్ని, మాలల్ని మంచిచేసుకుని మా ఓట్లు దండుకునే ఎత్తుగడకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే రోజుకో కులం నేతలను కూర్చొబెట్టి మా ముఖ్యమంత్రి ని తిట్టిస్తున్నారు. బాబుకు గులాంగిరి చేస్తూ ఆపార్టీలో మాదిగలు, మాలలు మనసు చంపుకుని ఉన్నారంటే మేం సిగ్గుతో తలదించుకుంటున్నాం.
ఆదినుంచీ దళితవ్యతిరేకి చంద్రబాబుః
చంద్రబాబు ఆదినుంచీ దళితులకు వ్యతిరేకంగానే ఉన్నాడు. సామాజిక న్యాయం అంటే ఏదో నలుగురికి పదవులు, పనులు కట్టబెట్టి పదేపదే వారినే చూపుతూ ఇదే సామాజికన్యాయం అని చెప్పుకునే సంస్కృతి టీడీపీలో కనిపిస్తుంది. ఎన్నికలొస్తున్నాయనగానే మళ్లీ మాదిగల ఓట్లు కొల్లగొట్టే కుట్రలో భాగంగానే నిన్న సమావేశం పెట్టించారని తెలుస్తుంది. గతంలో బాబు అధికారంలో ఉన్నప్పుడు మాదిగల పట్ల ఎంత నీచంగా వ్యవహరించారో.. మమ్మల్ని పలు సందర్భాల్లో ఏవిధంగా అవమానించారనేది మేమెవరం మరిచిపోలేదు. మీ దాష్టికాలకు, అరాచక విధానాలకు విసుగెత్తితేనే 2019 ఎన్నికల్లో ఓడించి మూలనబెట్టారనేది బాబు అర్థం చేసుకోవాలి. అంతేగానీ, ఇంకా మాదిగలు తనను నమ్ముతారని.. మమ్మల్ని భ్రమల్లో బతికించవచ్చని అనుకుంటే పొరబాటేనని భావించాలి.
మాదిగలకు అండగా జగన్
దళిత బిడ్డల మనుగడ, వారి భవితవ్యం అనేది సామాజికరంగాల్లో ఎదుగులతో ముడిపడి ఉంటుందని బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రాం అన్నట్లు జగన్ గారు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన దగ్గర్నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల అభివృద్ధికి అనేక మంచి కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా మాదిగలు, మాలలకు పదవులు, పనులు నియామకాల్లో పెద్దపీట వేస్తూ వారి ఆత్మగౌరవం పెంచిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డి కి దక్కుతుంది.
ఈరోజు ప్రపంచస్థాయి విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు మాదిగల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు విద్యను అభ్యసిస్తున్నారు. దీనిపై కూడా ఈ చంద్రబాబు మోకాలడ్డి.. దళితుల పిల్లలకు ఇంగ్లీషు విద్య అవసరమా..? అని కోర్టులకెక్కిన నీచుడు. అదేవిధంగా పేదవాడికి స్థిరమైన నివాసం ఉండాలని .. కనీసం సెంటు స్థలమైనా ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం పూనుకుంటే వాటిని కూడా సమాధులతో పోల్చిన వ్యక్తి ఈ చంద్రబాబు.
2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఏ ఒక్క పేదవాడికైనా సెంటు స్థలమిచ్చావా బాబు అని ప్రశ్నిస్తున్నాను. ఇందుకు టీడీపీలో ఉన్న మాదిగ నేతలు సమాధానమివ్వాలి. మా ప్రభుత్వం చేస్తున్న అనేక అభివృద్ధి పథకాలు, దళితుల సంక్షేమం మీ కళ్లకు కనిపించడంలేదా..? అని నిలదీస్తున్నాను.
నామినేటెడ్ పదవులు, పనుల్లో మాదిగలకు అగ్రస్థానంః
దళితులకు హిందూ దేవాలయాల్లో ప్రవేశం ఎందుకని నాడు ఇదే టీడీపీ పెద్దలన్నారు. గుడిలో ప్రవేశమే కాదని.. దళితుల్లో ఉన్న మాల మాదిగలు, రెల్లి కులస్తులకు కూడా ఆలయపాలకవర్గాల్లో సభ్యులుగా నియమించి.. వాటి నిర్వహణ బాధ్యతను కూడా అప్పగించిన నాయకుడు మా జగన్ గారు అని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం.
బాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే బాబు ఏరోజైనా మాల,మాదిగ, రెల్లి, యానాది కులాలకు చెందిన వ్యక్తుల్ని వ్యవసాయ మార్కెట్‌యార్డు కమిటీలకు చైర్మన్‌గా నియమించావా..? అని అడుగుతున్నాను. అదే మా జగన్ గారు ఈరోజు ప్రతీ అగ్రికల్చర్ కమిటీలో 50శాతం పదవుల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు మహిళలకు ఇస్తున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. నామినేటెడ్ పనులు, పదవుల దగ్గర్నుంచి ముఖ్యమంత్రి కి సలహాదారులుగా మాదిగలు, మాలలు ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం.
సోషల్ ఇంజినీరింగ్ చేస్తున్న నాయకుడు జగన్
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సామాజిక ఎదుగుదల, సాధికారత సాధనకు తపనపడుతున్నది ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని చెప్పాలి. నాడు నేడు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంతో పాటు పేదవర్గాల పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదవాలని, వారికి పౌష్టికాహారం కూడా ముఖ్యమని అందిస్తూ.. స్కూల్‌బ్యాగు నుంచి పుస్తకాలు, యూనిఫాం, షూ వరకు అందిస్తూ విద్యావ్యవస్థలో సమూలమార్పులు తెచ్చిన సంగతిని చంద్రబాబుతో పాటు టీ డీపీలో ఉన్న మాదిగలు గమనించలేకపోతున్నారా..? సచివాలయ వ్యవస్థ, వాలంటీర్‌ల నియామకం, రైతుభరోసా కేంద్రాలు, అమ్మఒడి, చేయూత, చేదోడు, ఆసరా ఇలాంటి విప్లవాత్మక చర్యలతో జగన్‌మోహన్‌రెడ్డి గారు సమాజాన్ని మార్చే సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారని గర్వంగా చెబుతున్నాం.
నా ఎస్సీ, నా ఎస్టీ అన్న దమ్మున్న నేత జగన్
మరి, దళితులంటేనే గిట్టని నాయకుడుగా చంద్రబాబు ఉంటే, మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు మాత్రం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ.. దమ్ముగా చెబుతున్నారు. మాల మాదిగల పిల్లలంటే నా సోదరులు, మేనల్లుళ్లు అని జగన్‌మోహన రెడ్డి మమ్మల్ని అక్కునజేర్చుకుంటున్నారు. దీన్నిబట్టి దళితులంటే ఎవరికి ప్రేమ ఉందో.. ఎవరు దళితుల పట్ల నీచంగా వ్యవహరిస్తున్నారనేది ప్రజలకు తెలిసిపోతుంది.
దీన్ని మరిచి బాబు చెప్పాడని .. ఆయనకు ఊడిగం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్న టీడీపీ ఎస్సీనేతలు పొలోమంటూ సభ పెట్టడం.. మా జగన్‌గారిని తూలనాడటం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నాను. జగన్ ఇంటి గుమ్మం ముందు వదిలే చెప్పులు గురించి మాట్లాడుతారు..తాగే మంచి నీళ్ల గురించి వాళ్లు మాట్లాడుతున్నారు. నిజంగా, జగన్ వాడే చెప్పులు, తాగే నీళ్లు గురించి ఏమాత్రం అవగాహనలేకుండా టీడీపీ ఎస్సీనేతలు ఎలా మాట్లాడతారు..? మీలో ఎవరైనా వస్తే నిజనిజాల్ని నేను నిరూపించి చూపిస్తానని సవాల్ విసురుతున్నాను.
మాదిగలంతా జగన్ వెంటే ఉన్నారుః
చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలను అధికారంలోకి వచ్చాక నిలబెట్టుకోలేకపోవడంతోనే బాబును 2019లో ఓడించారు. ఆ సంగతిని మరిచిన బాబు మళ్లీ మినీ మ్యానిఫెస్టో అంటూ ఒక చెత్తబుట్టను ప్రకటించాడు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన టీడీపీ 650 హామీల్లో కనీసం ఆరు హామీల్ని కూడా నిలబెట్టుకోలేని నాయకుడు ఈ చంద్రబాబు అని గుర్తుచేస్తున్నాను.
అదే మా జగన్ తన పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న దళితజాతి బిడ్డలందరికీ నేను అండగా ఉన్నాను అని మా జగన్ గారు భరోసా ఇచ్చారు. అధికారంలోకి రాగానే నాడు ఇచ్చిన ప్రతీ హామీని ఈరోజు నిలబెట్టుకున్నందునే దళిత కుటుంబాలన్నీ ఆయన వెంటే నడుస్తున్నాయి. భవిష్యత్ ఎన్నికల్లో కూడా మాదిగలంతా మా నాయకుడు జగన్ వెంటనే నడుస్తారని మేం ధీమాగా చెబుతున్నాం.