– అగ్నిపథ్ స్కీంపై కాంగ్రెస్ ఆగ్రహం
– దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద “సత్యాగ్రహం” దీక్ష
– ఏపీ నుంచి హాజరైన ఏఐసీసీ కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, జేడీ శీలం
న్యూదిల్లీ: సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతోన్న యువతకు సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఉదయం దేశ రాజధానిలో “సత్యాగ్రహం” పేరిట దీక్ష చేపట్టింది. దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నాలుగు గంటలు పాటు కొనసాగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, ఏఐసీసీ వర్కింగ్ కమిటీ సభ్యులతో పాటు పార్టీ ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. “సత్యాగ్రహం” దీక్షకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏఐసీసీ కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, జేడీ శీలం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ అనాలోచితంగానే ఉంటున్నాయని పేర్కొన్నారు.
తద్వారా దేశాన్ని ప్రమాదకర పరిస్థితుల్లోకి తీసుకువెళుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు, రైతులకు ఉరితాళ్లు వంటి నల్ల చట్టాల ప్రయోగం, జీఎస్టీ వంటి బిల్లులతో దేశంలోని ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. తాము చేస్తున్న కార్యక్రమం ఆందోళన కాదని తెల్లదొరలను ఎదురించేందుకు మహాత్మాగాంధీ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష వంటిదని పేర్కొన్నారు.
దేశ యువతరానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మంచి భవిష్యత్తును ఇస్తుందని భరోసా ఇచ్చేందుకే తాము ఈ కార్యక్రమానికి సంకల్పించామని తెలిపారు. వ్యక్తిగత ఆనందం కంటే దేశ సమస్యల పట్ల రాహుల్ గాంధీ బాధ్యతగా భావిస్తారని పేర్కొన్నారు. నిజానికి ఈ రోజు రాహుల్ గాంధీ పుట్టినరోజు అని, కానీ.. పుట్టిన రోజు సంబరాలు అంటూ దేశ సమస్యలను బాధ్యతరాహిత్యంగా వదలబోమన్నారు. nఉద్యోగాలపై తప్పుడు ఆశలు కల్పించడం ద్వారా దేశంలోని యువతను నిరుద్యోగంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఆధ్వర్యంలోని దిల్లీ పోలీసు వ్యవస్థ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలు చేస్తున్న తమను భయబ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. దేశంలో నెలకొన్న ఇటువంటి ఆందోళనకర పరిస్థితికి ప్రధానమంత్రే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.