Suryaa.co.in

Andhra Pradesh

కుటుంబ తగాదాలు రాజకీయం చేయొద్దు

– నాలుగు నెలలుగా పాలన గాలికొదిలేశారు
– డైవర్షన్‌ పాలిటిక్స్‌తో కాలం వెళ్లదీస్తున్నారు
– కూటమి ప్రభుత్వం.. ఫ్యామిలీ పాలన అయింది
– వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌

ఒంగోలు: కుటుంబ తగాదాలు రాజకీయం చేయొద్దని వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, సీఎం చంద్రబాబును హెచ్చరించారు. ప్రజల సంపదను ఎవరు దోచుకున్నారు?. దాచుకున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసని ఆయన అన్నారు. రాష్ట్ర సంపదను జగన్‌ పేదలకు పంచగా, అదే చంద్రబాబు తన కుటుంబీలుకు దోచిపెట్టారని ఆక్షేపించారు.

నాలుగు నెలలుగా పాలన గాలికొదిలేసి, ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌తో కాలం వెళ్లదీస్తున్నారని, కూటమి ప్రభుత్వం కాస్తా.. ఫ్యామిలీ పాలన అయిందని స్పష్టం చేశారు. ఇకనైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, ప్రజలకు మంచి చేసే విషయం ఆలోచించాలని సీఎం చంద్రబాబుకు మాజీ ఎమ్మెల్సీ జూపూడి సూచించారు.

జగన్‌ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు అన్న మాటలను ప్రస్తావించిన జూపూడి ప్రభాకర్‌.. ఎదురిళ్లు, పొరుగిళ్లలోకి తొంగి చూసి స్వార్థ రాజకీయాలు చేస్తున్నందుకు ఆయన సిగ్గుపడాలని.. అంతేతప్ప జగన్‌తో రాజకీయాలు చేస్తున్నందుకు కాదని స్పష్టం చేశారు.

ఎక్కడా వివిక్ష, అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకంగా పథకాలు అమలు చేస్తూ.. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా గత 5 ఏళ్లలో జగన్‌గారు నిరుపేదల ఖాతాల్లో ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారని గుర్తు చేశారు. అదే చంద్రబాబు, నాడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు తన సామాజిక వర్గానికి చెందిన రామోజీరావుకు 2 వేల ఎకరాల భూమిని, కేవలం ఒక్క రూపాయికి కట్టబెట్టారని గుర్తు చేసిన మాజీ ఎమ్మెల్సీ.. అది దోచుకోవడమా లేక, పేద ప్రజలకు అండగా నిలబడడాన్ని దోచుకోవడం అంటారా? అని నిలదీశారు.

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎన్నికల నాటికి అన్ని ఇసుక స్టాక్‌ పాయింట్లలో 87 లక్షల టన్నుల ఇసుక నిల్వ చేస్తే, ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచే దోపిడి మొదలుపెట్టిన అధికారపక్ష నాయకులు సగానికి పైగా ఇసుక దోచుకున్నారని తెలిపారు.

రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో వివాదాలు, తగాదాలు ఉంటాయన్న మాజీ ఎమ్మెల్సీ.. జగన్‌ కుటుంబంలో వివాదాన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని గుర్తు చేశారు. తన భర్తను చంపేసి, ఆస్తిని కాజేశారన్న లక్ష్మీపార్వతికి, చంద్రబాబు ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. అలాగే హైదరాబాద్‌లోని తన ఆస్తిని ఎన్ని వాటాలు చేశారని.. తమ్ముడు రామ్మోహన్‌నాయుడు, చెల్లెళ్లుకు ఎన్ని వాటాలు పంచారో చంద్రబాబు చెప్పాలని జూపూడి ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.

LEAVE A RESPONSE