Suryaa.co.in

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేయకండి

తిరుమల శ్రీవారి దర్శనానికి దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం,అలాగే చిత్తూరు జిల్లాలో రైతులు పండించే సీజనల్ పంటలను ఎగుమతి చేసుకునేందుకు కాంగ్రెస్ హయాంలో తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపును తీసుకురావడం జరిగింది.

రాజ్యసభ సాక్షిగా కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వికే సింగ్ తిరుపతి విజయవాడ రాజమండ్రి విమానాశ్రయాలు నష్టాలలో నడుస్తున్నాయని, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడతామని బహిరంగంగా ప్రకటించనా మన ఎంపీలు మౌనంగా పార్లమెంటులో రాజ్యసభలో “ఉత్సవ విగ్రహాలు”గా మారడం ఏపీ ప్రజల దౌర్భాగ్యం!

ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్న 25 విమానాశ్రయాలను లీజికిస్తున్నాం అని”అత్త సొత్తు అల్లుడు దానం” చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ప్రకటించడం దేశ ప్రజల సంపదను కొల్లగొట్టడమే!

కేంద్ర ప్రభుత్వం చేతకానితనం కారణంగా భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఒక్కొక్కటిగా నిర్వీర్యం అయిపోతున్నాయి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి.భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పాలకుల నిర్లక్ష్యం కారణంగా వెలవెలబోతున్నాయి ప్రైవేటు రంగ సంస్థలు కలకలలాడుతున్నాయి! ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పోర్టులు ఎయిర్ పోర్టులు ఆదానీల చేతికి వెళ్లిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని పాలకుల బలహీనతలను, కేసులను బూచిగా చూపించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తులకు “తూకం” వేసి అమేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో విమానాశ్రయాలు లాభాల బాటలో నడవాలంటే దేశ విదేశాల నుంచి విమాన రాకపోకలు, ఎగుమతులు దిగుమతులు కొనసాగించే ప్రయత్నం చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం “ఆడలేక మద్దెల ఓడు” అన్నట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ లో విమానాశ్రయాలని ప్రవేటీకరిస్తున్నామని ప్రకటించిన కేంద్ర మంత్రి మాటలను ఉపసంహరించుకునేలా ఏపీ ఎంపీలు పార్లమెంటును రాజ్యసభను స్తంభింప చేయాలన్నారు లేదంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

– నవీన్ కుమార్ రెడ్డి
రాయలసీమ పోరాట సమితి కన్వీనర్
ఐఎన్టీయూసీ జిల్లా గౌరవాధ్యక్షులు

LEAVE A RESPONSE