-ప్రజా అవసరాలకు ఉపయోగించాలి
-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్
అజమాబాద్ పారిశ్రామిక ప్రాంతంలోని మిగులు భూమిని ప్రభుత్వం వేలం వేయోద్దు. ఇతర ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టొద్దు. ప్రజా అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో అజామాబాద్ పారిశ్రామిక ప్రాంతం సవరణ బిల్లుపైన జరిగిన చర్చ కార్యక్రమంలో పై విధంగా పేర్కొన్నారు.
పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ పారిశ్రామిక వాడలో ఇప్పటి వరకు కొంత మంది మాత్రమే పరిశ్రమలు నెలకొల్పారని, మరి కొందరు ఇతరులకు లీజుకు ఇచ్చినట్టు తెలుస్తుందన్నారు. లీజు గడువు ముగుస్తున్న క్రమంలో ఇక్కడ ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రజా అవసారాలకు ఉపయోగపడేవిధంగా ఉండాలన్నారు. పరిశ్రమలకు కేటాయించిన స్థలం పోను మిగత భూమిని ఏం చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెసిడెన్షియల్ జోన్ గా మార్చుతారా? ఇండస్ర్టీయల్ జోన్ గానే ఉంచుతారా? లేక మిగులు భూమిని వేలం వేయాలని చూస్తున్నారా? దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మిగులు భూమిని ప్రభుత్వం వేలం వేయోద్దని, ఇతర ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టొద్దని, ప్రజా అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. గత ప్రభుత్వాలు ఇలాంటి భూముల్లో పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలకు హౌజింగ్ బోర్డు ఏర్పాటు చేసి ఇండ్లు కట్టించేవారని గుర్తు చేశారు. ఆ విధంగా ప్రజా ప్రయోజానాల కోసం మాత్రమే మిగులు భూమిని సద్వినియోగం చేయాలన్నారు. లీజు ముగిసిన వారికి హక్కులు కల్పించే విషయంలో పారదర్శకంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు.