– పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం హేయ
– ఖమ్మం నగరం వెలుగుమట్ల వినోబా నగర్లో రాక్షస కాండను ఖండిస్తున్నా.
– మాజీ మంత్రి హరీష్ రావు
వరంగల్ : ఇది ప్రజాస్వామ్యమా? లేక పోలీస్ రాజ్యమా?: నాలుగు జిల్లాల నుండి వేల మంది పోలీసులను మోహరించి, ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఇళ్లను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది, పేద ప్రజలు మీకేమైనా తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా? పోలీసులను అడ్డం పెట్టుకుని మీడియాను రాకుండా అడ్డుకుంటున్నారంటేనే.. మీరు చేస్తున్న అరాచకం లోకానికి తెలియకూడదనే మీ భయం అర్థమవుతోంది. చీకటి పనులు చేసేవారే మీడియాను చూసి భయపడతారు.
మేము అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం అని నమ్మబలికిన రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు .. నేడు ఉన్న ఇళ్లను కూలగొట్టి పేదలను నడిరోడ్డుపై నిలబెడుతున్నారు. ఓటు వేసినందుకు మాకు తగిన శాస్తి జరిగింది అని బాధితులు రోదిస్తుంటే.. గుండె తరుక్కు పోతున్నది.
ఎంతో కష్టపడి, రూపాయి రూపాయి పోగేసి కట్టుకున్న ఇళ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చడం అమానుషం. బాధితుల ఆవేదన రేపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దహించి వేయడం ఖాయం.
వెంటనే ఈ అక్రమ కూల్చివేతలను ఆపాలి. పోలీసులు వెనక్కి వెళ్లాలి. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుంది. పేదలపై కర్రలు ఎత్తడం మానేసి, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టండి. పేదల గూడు చెదిరితే.. మీ అధికారం గద్దెలు అంతే వేగంగా కూలుతాయని హెచ్చరిస్తున్నాను.
వెంటనే కూల్చివేతలు ఆపాలి. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి. నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇంచు భూమి కూడా కదిలించడానికి వీల్లేదు. పేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. ఖమ్మం బిడ్డల కన్నీళ్లకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు.