Suryaa.co.in

Telangana

ఎన్టీఆర్, కోట్ల, నీలం, కాసు పేర్లను తొలగించే దమ్ముందా?

-దమ్ముంటే సీఎం నా సవాల్ పై స్పదించాలి
-పొట్టి శ్రీరాములు చేసిన తప్పేంది?
-ఆయన దేశభక్తుడు, స్వాతంత్ర్యం కోసం అనేకసార్లు జైలుకు పోయినోడు
-హరిజనులను ఆలయాల్లోకి ప్రవేశం కల్పించాలని పోరాడిన వ్యక్తి
అట్లాంటి దేశభక్తుడిని అవమానిస్తారా?
-కాంగ్రెస్ దళిత వ్యతిరేకి… ఆర్యవైశ్య వ్యతిరేకి
-ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్పోర్స్ నరేందర్ రెడ్డిని ఆ పార్టీ నాయకులే ఓడించారు
-బీజేపీ అభ్యర్ధిని కార్యకర్తలే గెలిపించుకున్నారు
-ఇదే విషయం నరేందర్ రెడ్డికి చెప్పిన
-రాబోయేది బీజేపీ ప్రభుత్వమే
-తెలంగాణను కాంగ్రెస్ శ్రీలంకలా మారుస్తోంది
-రాబోయే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా ఆశ్చర్యం లేదు
-అర్బన్ నక్షల్స్ చేతిలో కులగణన డేటా
-కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్….
-సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ఆత్మీయ సమ్మేళనానికి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు
– వేలాది మందితో ర్యాలీ నిర్వహించిన బీజేపీ జిల్లా నాయకత్వం

సిరిసిల్ల: తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరామలు పేరును తొలగించడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ‘‘పొట్టి శ్రీరాములు గొప్ప దేశభక్తుడు. దేశ స్వాతంత్ర్యం కోసం అనేకసార్లు జైలుకు పోయినోడు. హరిజనులను ఆలయాల్లోకి ప్రవేశం కల్పించాలని ఉద్యమించి శాసనం చేయించినోడు. శ్రీరాములు లాంటోళ్లు 10 మంది ఉంటే ఎప్పుడో స్వాతంత్ర్యం తెచ్చేటోడినని అన్నారంటే ఆయన గొప్పతనం అర్ధం చేసుకోవాలి. అట్లాంటి నేత పేరును తొలగించి అవమానిస్తారా?’’ అని మండి పడ్డారు.

ఈ సందర్భంగా సీఎంకు సవాల్ విసిరారు. ‘‘ఆంధ్రా మూలాలున్నాయని పొట్టి శ్రీరామలు పేరు తొలగించారు. మరి ఆ మూలాలున్న ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మనందరెడ్డి పేరిట అనేకం ఉన్నాయి. వారి పేర్లను కూడా తొలగిస్తారా?’’అని సవాల్ విసిరారు.

బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా రెడ్డబోయిన గోపీ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా పట్టణ కేంద్రంలో ఆత్మీయ సమ్మేళం నిర్వహించారు. వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహంచారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో బండి సంజయ్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. ఏమన్నారంటే….

కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్యుల వ్యతిరేక పార్టీ. దళిత వ్యతిరేక పార్టీ. పొట్టి శ్రీరాములు జయంతి ఈరోజు. ఆయన గొప్ప దేశభక్తుడు. స్వాతంత్ర్య సమరయోధుడు. హరిజనులకు దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని ఉద్యమించి శాసనం చేయించిన నాయకుడు. ఆంధ్ర రాష్ట్రం కోసమే కాదు…. దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొని అనేకసార్లు జైలుకు పోయిన నాయకుడు. పొట్టి శ్రీరాములు లాంటి వాళ్లు నా వెంట 10 మంది ఉంటే చాలు… దేశానికి ఎప్పుడో స్వాతంత్ర్యం తెచ్చేవాడనని మహాత్మాగాంధీయే చెప్పారంటే ఆయన గొప్పతనం అర్ధమవుతుంది.

మద్రాస్ రాష్ట్రం నుండి ఆంధ్రను వేరు చేయాలని ఉద్యమించారే తప్ప ఏనాడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదే.. అట్లాంటి మహనీయుడి పేరును తొలగించి తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలనుకోవడం దుర్మార్గం. సురవరం పట్ల మాకు అభ్యంతరం లేదు. గొప్ప వ్యక్తే. మంచి రచయిత. తెలుగు భాష ఉద్దరణ కోసం పాటుపడ్డారు. ఇయాళ ఆయన బతికుంటే సీఎం చేసిన పనికి బాధపడేవారు.

ఆంధ్రా మూలాలున్నాయని పొట్టి శ్రీరాములు పేరును తీసేయడం దారుణం. అట్లయితే ఎన్టీఆర్ పేరును కూడా తీసేస్తారా? కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి పేర్లను తొలగిస్తారా? తొలగించే దమ్ముందా సీఎం గారు.. వాళ్లకు ఒక రూల్. పొట్టి శ్రీరాములకు ఇంకో రూలా? సీఎంకు దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించాలి.

మద్రాస్ నుండి ఆంధ్రను వేరు చేయాలని మాత్రమే కోరిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. అంతే తప్ప తెలంగాణకు వ్యతిరేకం కాదే…. అట్లాంటి వ్యక్తిని అవమానించడం ఎంత వరకు కరెక్ట్? ఆర్యవైశ్య సమాజమంతా ఆగ్రహంతో ఉంది. హిందూ సమాజమంతా ఆలోచించాలి. ఈ దేశం కోసం పోరాటాలు చేసిన వాళ్లను, త్యాగాలు చేసిన వాళ్లను స్మరించుకోవడం, వారి విగ్రహాలు పెట్టి గౌరవించుకోవడం మన సంస్కారం. వారి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి రాబోయే తరానికి స్పూర్తిగా నిలుపుతాం.

అట్లా కాకుండా అవకాశవాద రాజకీయాలు చేస్తూ మహనీయులను అవమానించడం ఏమాత్రం సరికాదు. స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను తెరమరుగు చేయడం కరెక్ట్ కాదు. యధా రాజా…తథా ప్రజా. రాహుల్ గాంధీ తీరు కూడా అట్లనే ఉంది. ఆయన కూడా యూరప్ పోయి భారత దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని కోరి దేశం పరువు తీసిండు.

ఇయాల గోపి బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం సంతోషం. నాకు గ్రూపుల్లేవు. నాది ఒకటే గ్రూప్. బీజేపీ గ్రూప్. మోదీ గ్రూప్ మాత్రమే. మీరంతా అట్లనే ఉండాలి. ఇయాళ పొద్దున్నే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కలిశారు. ఆయనకు నేను చెప్పిన. ‘‘మిమ్ముల్ని మీ పార్టీ నాయకులే ఓడగొట్టారు… మమ్ముల్ని మా బీజేపీ కార్యకర్తలే గెలిపించారు’’అని చెప్పిన. పోలింగ్ రోజు బీజేపీ కార్యకర్తలను చూసి కాంగ్రెస్ బెంబేలెత్తిపోయారు. బీఆర్ఎస్ అయితే పోటీ నుండే తప్పుకుంది.

సిరిసిల్ల కార్యకర్తలు పోరాట యోధులు. బీఆర్ఎస్ పాలనలో యువరాజు సిరిసిల్లకు వస్తుంటే అడుగడుగునా అడ్డుకుని ప్రజా వ్యతిరేక పాలనపై పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ఆ భయానికే యువరాజు తాను వచ్చే ముందు బీజేపీ కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ లు చేసి జైలుకు పంపేటోడు. అయినా తెగించి కొట్లాడిన చరిత్ర బీజేపీ సిరిసిల్ల కార్యకర్తలదే… అధికారం ఉందని అరాచకాలు చేసే సంస్క్రుతి బీజేపీకి లేదు. నేను హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న. ఎక్కడైనా అరాచకంగా, అమర్యాదగా వ్యవహరించిన దాఖలాలున్నాయా? మనకు అధికారం శాశ్వతం కాదు… ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయి…వారి సమస్యలను పరిష్కరించడమే మన బాధ్యత.

సిరిసిల్ల పార్టీ నాయకులను నేను చెబుతున్నా… గతంలో ఏం జరిగిందో వదిలేయండి. గతం గత:. క్రమశిక్షణతో వ్యవహరించాలి. కలిసిమెలిసి ఉండాలి. అట్లా కాకుండా అసమ్మతి రాజకీయాలు చేస్తే కన్న తల్లికి ద్రోహం చేసినట్లే. వాటిని ఇకపై ఉపేక్షించే ప్రసక్తే లేదు. రాష్ట్రంలో బీజేపీకి మంచి వాతావరణం ఉంది. దయచేసి చెడగొట్టొద్దు. నేనే గొప్ప అని అనుకోవద్దు. బండి సంజయ్ లేకపోయినా పార్టీ నడుస్తది. బీజేపీ అండ లేకపోతే బండి సంజయ్ ను కూడా కుక్కలు కూడా దేకవనే సంగతిని గుర్తుంచుకోండి.

రాబోయేవి కార్యకర్తల ఎన్నికలే. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత మాది. బీజేపీ స్ట్రాటజీ ఎట్లుంటదో మీకు తెలుసు. సెస్, ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో ఎట్లా ఫైట్ చేసినమో మీకు తెలుసు. సెస్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే… భయపెట్టి బెదిరించి బీఆర్ఎస్ గెలిచినట్లు అరాచకాలు చేసిన నీచ చరిత్ర బీఆర్ఎస్ దే. ఎవరెన్ని చేసినా ప్రజలు బీజేపీవైపే ఉన్నారు. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు బీజేపీదే.

తెలంగాణను కాంగ్రెస్ శ్రీలంకలా మారుస్తోంది. రాష్ట్రంలో అరాచక, అవినీతి పాలన కొనసాగుతోంది. 15 నెలల్లోనే లక్షన్నర కోట్ల అప్పు చేసి…ప్రజలపై భారం మోపుతోంది. రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పు భారం మోపబోతున్నారు. జీతాలివ్వడానికి, ప్రజలకిచ్చిన హామీలను పరిష్కరించడానికి పైసల్లేవంటున్నారు. కానీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని తబ్లిగీ జమాతే వంటి సమావేశాలు నిర్వహిస్తోంది. సిగ్గుండాలే. 6 గ్యారంటీలను నెరవేరిస్తే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. రైతు భరోసా, రుణమాఫీ పైసలన్నీ ఇస్తేనే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. మహిళలకు తులం బంగారం, స్కూటీ, నెలకు రూ.2500 ఇస్తేనే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. అవినీతిరహిత పాలన చేస్తే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. అట్లాకాకుండా అవినీతి, అరాచక పాలన చేస్తూ… ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి బ్రాండ్ ఇమేజ్ పేరుతో లేనిపోని కార్యక్రమాలు నిర్వహిస్తే ఏ విధంగా ఇమేజ్ పెరుగుతుంది?

అప్పులు తీర్చడానికి భూములను అమ్మేయాలనుకుంటోంది. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీకి చెందిన 400 ఎకరాలను వేలం వేసి భావి తరాలకు భూములు లేకుండా చేస్తోంది. కాంట్రాక్టర్ల వద్ద 20 శాతం కమీషన్లు దండుకుంటోంది.

కులగణన పేరుతో తెలంగాణ ప్రజల ఆస్తిపాస్తుల వివరాలను ప్రభుత్వం సేకరించింది. రహస్య సమాచారమంతా అందజేస్తే ఆ డేటాను అధ్యయనం పేరుతో అర్బన్ నక్సల్స్ చేతిలో పెట్టారు. ఇగ మనం బతుకతమా? అర్బన్ నక్సల్స్ చేతిలో మన డేటా పెడితే… తెలంగాణ ప్రజల ఆస్తిపాస్తులు భద్రంగా ఉంటాయా? దోపిడీకి గురవుతాయా? ఆలోచించాలి. ఇప్పటికే విద్యా కమిషన్ పేరుతో అర్బన్ నక్సల్స్ చేతిలో విద్యా వ్యవస్థను పెట్టి హింసను స్రుష్టించి తుపాకీ రాజ్యం చేయాలనుకుంటోంది. దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.

తెలంగాణకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులిస్తోంది. ఇయాళ గ్రామాల్లో జరుగుతున్న అభివ్రుద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరుగుతున్నయ్. రాష్ట్రం నయాపైసా ఇస్తలే. అయినా తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందని ఎదురుదాడి చేస్తున్నరు. అన్నీ మేమే ఇస్తే.. ఇగ మీరెందుకు? తప్పుకోండి. డబుల్ ఇంజన్ సర్కార్ తో తెలంగాణను ఎట్లా అభివ్రుద్ధి చేస్తామో చేతల్లో చూపిస్తాం… తెలంగాణలోని ఏ గ్రామానికి కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో… గ్రామాల వారీగా సమగ్ర వివరాలను అందజేస్తాం. గ్రామాల్లోకి కరపత్రాలు, ఫ్లెక్సీలు వేస్తాం.

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే. రెండు పార్టీలు డ్రామాలాడుతున్నయ్. బీఆర్ఎస్ చేసిన స్కాంల్లో అరెస్ట్ కాకుండా కాపాడుతోంది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, ఫార్ములా ఈ రేసు, భూముల కుంభకోణం, కాళేశ్వరంసహా అన్ని స్కాముల్లో కేసీఆర్ కుటుంబం ఉందని తెలిసినా అరెస్ట్ చేయలే. కనీసం నోటీసులు కూడా ఇచ్చే దమ్ము లేకపాయే. కనీసం కేసీఆర్ ను విచారణకు పిలిచే దమ్ము లేకపాయే. ఎందుకంటే రెండు పార్టీలూ ఒక్కటే. బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసుందుకు కలిసి పనిచేస్తున్నయ్. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా ఆశ్చర్యం లేదు. ఏదేమైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బీజేపీ అధికారంలోకి రాగానే వాళ్ల లెక్కలు తేలుస్తాం…

LEAVE A RESPONSE